నా విజన్ నాదే | i know very well of poverty | Sakshi
Sakshi News home page

నా విజన్ నాదే

Published Sun, Aug 10 2014 2:07 AM | Last Updated on Sat, Sep 2 2017 11:38 AM

i know very well of poverty

(సాక్షి ప్రతినిధి, ఖమ్మం): ‘పేద కుటుంబం నుంచి వచ్చాను.. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను.. ఐఏఎస్ అయ్యాను. పేదరికం గురించి నాకు బాగా తెలుసు. అందుకే ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తా. మనం పని మనం బాగా చేస్తే రేపు ఏంటనేది దేవుడు నిర్ణయిస్తాడు. బ్యాడ్మింటన్, ఫొటోగ్రఫీ నా అభిరుచులు. సినిమాలు బాగా చూస్తాను. రజనీకాంత్ నా అభిమాన హీరో.

పరిపాలనపరంగా నా విజన్ నాది. ఉద్యోగులు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందే. నేనేంటో నెలరోజుల్లో సమాధానం వస్తుంది. 19న జరిగే సమగ్ర సర్వే చాలా ముఖ్యమైంది. ప్రజలందరూ దీనికి సహకరించాలి’ అని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె. ఇలంబరితి కోరారు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించి వారమే అయినా తన మార్కుతో ముందుకెళ్తున్న ఆయన శనివారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చారు.

ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
 సర్వే చాలా ముఖ్యమైనది
 ఈనెల 19న జరిగే సమగ్ర కుటుంబ సర్వే చాలా ముఖ్యమైనది. జిల్లాలో ఒక్క ఇల్లూ వదిలిపెట్టం. ఇల్లున్నా.. లేకపోయినా ప్లాట్‌ఫామ్‌ల మీద ఉన్న వారినీ సర్వే చేస్తాం. జిల్లాలో ఉన్న ప్రతి ఇంటినీ గుర్తించి లిస్టు చేశాం. యజమానుల పేర్లు కూడా తీసుకున్నాం. జిల్లావ్యాప్తంగా 8,89,530 ఇళ్లను సర్వే చేస్తున్నాం. ఇందుకోసం 29,651 మంది ఎన్యూమరేటర్‌లను వినియోగించుకుంటాం.

 ఒక్కో ఎన్యూమరేటర్ 30 కుటుంబాల వివరాలు సేకరిస్తారు. ప్రభుత్వ సిబ్బంది, ఆశా, అంగన్‌వాడీ సిబ్బందిని కూడా ఉపయోగించుకుంటున్నాం. ముందస్తు ప్రక్రియలో భాగంగా గుర్తించిన ఇళ్లన్నింటికీ 11వ తేదీ నుంచి 15 వరకు స్టిక్కర్లు పంపిణీ చేస్తాం. గ్రామపంచాయతీ స్థాయిలో ఈ ప్రక్రియ నిర్వహిస్తారు. సర్వే చేసే సమయంలో ప్రతి ఒక్కరూ రేషన్, ఆధార్‌కార్డులు, ఇంటిపన్ను రశీదు, భూమి పట్టా కాగితం, కరెంటు బిల్లు చూపించాలి. సామాజిక లేదా ఉద్యోగ పింఛన్లు తీసుకునే వారు ఆ వివరాలు ఇవ్వాలి. ఉపాధి హామీ కూలీలు గుర్తింపు కార్డు చూపాలి. వికలాంగులు సదరన్ సర్టిఫికెట్టు చూపించాలి.

కుటుంబ సభ్యులందరూ ఇంట్లో ఉంటే మంచిది. ఈ ప్రక్రియ ఇక్కడితో ఆగిపోదు. తర్వాత సర్వేలో అదనపు వివరాలు చేర్చవచ్చు... అవసరమైతే తొలగించుకోవచ్చు. ప్రభుత్వం అధికారికంగా మూడు కేటగిరీలకు సర్వే నుంచి మినహాయింపునిచ్చింది. ఎన్యూమరేటర్లుగా పనిచేసే ప్రభుత్వ సిబ్బంది... ఆసుపత్రులలో ఉన్నవారు, హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న విద్యార్థులు సర్వే సమయంలో లేకపోయినా వారి వివరాలు నమోదు చేసుకుంటారు.

ఇతర జిల్లాలకు చెందిన వారు ఈ జిల్లాలో ఉంటే వారి స్వగ్రామానికైనా వెళ్లవచ్చు. లేదా ఇక్కడే నమోదు చేయించుకోవచ్చు. మేం మాత్రం ఖమ్మం జిల్లా భౌగోళిక స్వరూపంలో ఉన్న ప్రతి మనిషి వివరాలు తీసుకుంటాం. ఈ సర్వే గురించి ఎవరూ భయపడాల్సిన పనిలేదు. రేషన్‌కార్డులు పోతాయని, పింఛన్లు తీసేస్తారని అనుకోవద్దు. ఏ ప్రభుత్వం కూడా అలాంటి పనులు చేయదని నా అభిప్రాయం.
 
 జేసీ పర్యవేక్షణలో భూసమస్యల పరిష్కార టీం
 జిల్లాలో భూమికి సంబంధించిన సమస్యలు చాలా మా దృష్టికి వస్తున్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 19 తర్వాత మండల స్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తాం. అక్కడే ప్రజల ఫిర్యాదులు తీసుకుంటాం. మ్యుటేషన్, ఆర్‌ఓఆర్, సర్వే సమస్యలు, కబ్జాలు... సమస్య ఏదైనా ఫిర్యాదు తీసుకుని దాన్ని నిర్ణీత కాలపరిమితిలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. ఇందుకోసం జేసీ పర్యవేక్షణలో ఓ టీంను ఏర్పాటు చేస్తా.

 భూ పంపిణీ... ఆర ంభం మాత్ర మే
 భూమిలేని నిరుపేద ఎస్సీలకు భూ పంపిణీ చేసే కార్యక్రమం ఇప్పుడే మొదలైంది. ఇప్పుడు ఇవ్వకపోతే ఇంక ఇవ్వరేమో అనే భయం అవసరం లేదు. ఎంత మందికి ఇచ్చామన్నది ముఖ్యం కాదు..ఇచ్చిన వారికి సక్రమంగా ఇవ్వాలి. అందుకే మొదటి దశలో కేవలం నాలుగు నియోజకవర్గాల్లోని నాలుగు గ్రామాల్లో మాత్రమే అమలు చేస్తున్నాం.

ఇచ్చిన భూమిని సాగుకు ఉపయోగపడేలా చూసి నెలవారీగా భూపంపిణీ ప్రక్రియను అమలు చేస్తాం. ఐటీడీఏ పరిధిలోని అభివృద్ధి, గిరిజన సంక్షేమం బాధ్యతలు అక్కడి ప్రాజెక్టు అధికారికే ఇస్తున్నాం. పీవో దివ్య యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. మా నుంచి ఏదైనా సహకారం కావాలంటే తప్పకుండా అందిస్తాం. గిరిజన ప్రాంతాల్లో విద్యు, వైద్య, తాగునీటి సమస్యలు పరిష్కరిస్తాం.

 వైద్యులు లేకుండా ఆసుపత్రులు ఎందుకు?
 జిల్లాలో వైద్య సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించి పనిచేస్తా. వైద్యులు లేకుండా ఆస్పత్రులు ఎందుకు? ఈ విషయమై డీసీహెచ్‌ఎస్, డీఎంహెచ్‌వోలతో సమీక్ష చేశా. ముందుగా ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేస్తా. ఇప్పటికే 17 మంది డాక్టర్ల నియామకానికి ఉత్తర్వులిచ్చాం. 33 మంది ఏఎన్‌ఎంల నియామకాలు పెండింగ్‌లో ఉంటే వాటిని క్లియర్ చేశా. ఇంకా మిగిలిన డాక్టర్లు, నర్సులు, ఏఎన్‌ఎం పోస్టులను కూడా భర్తీ చేసి వైద్య విభాగం బాగా పనిచేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నాం. అన్ని ఆసుపత్రుల్లో మౌలిక సౌకర్యాల కల్పనపై కూడా దృష్టి పెట్టా.

 నాణ్యమైన విద్య కావాలి
 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లినప్పుడు మంచి సంస్థల్లో ప్రవేశాలు పొందాలి. అప్పుడే గవర్నమెంట్ పాఠశాలలకు సార్థకత. ఆ దిశలో జిల్లాలోని పేద విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం చేస్తా. బాగా పనిచేసి పాఠాలు చెప్పే టీచర్లు, హెచ్‌ఎంలను గుర్తిస్తాం. విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ నిప్పిస్తాం. ఇంకా ఏం చేయాలన్నది మున్ముందు నిర్ణయించుకుంటాం.

 అన్ని మున్సిపాలిటీల్లో తాగునీటి సరఫరా
 జిల్లాలోని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, ఇతర మున్సిపాలిటీలపై కూడా ప్రత్యేక విజన్ ఉంది. పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పెంచాలి. ఈ విధంగా ప్లాన్ చేయమని చెప్పా. రోజుకు రెండు, మూడు గంటలు ఇవ్వడం కాదు... టార్గెట్ పెద్దదే పెట్టుకోవాలి. అందుకే 24 గంటల నీటి సరఫరా ప్రణాళిక తయారు చేయమని అధికారులకు చెప్పా. ఖమ్మంపై ప్రత్యేక దృష్టి సారిస్తా. లీకులను అరికట్టాలి. స్టోరేజి సామర్థ్యం పెంచాలి. అన్ని మున్సిపాలిటీల్లో ఇదే విధంగా చర్యలు తీసుకునేలా ప్లాన్ చేస్తున్నాం.

 గ్రామీణ నీటి సరఫరాకు ప్రత్యేక ప్రణాళిక
 పట్టణాల్లో కాకుండా గ్రామీణ ప్రజలకు కూడా రక్షిత నీటి సరఫరా ఉండాలి. దీనికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నాం. చిన్న చిన్న ప్రాజెక్టులు (రెండు, మూడు గ్రామాలకు నీరిచ్చేవి) ఎలా ఉన్నాయో వివరాలు పంపమని చెప్పా. వారంరోజుల్లో ఆ వివరాలు వస్తాయి. వివరాలందిన తర్వా త ప్రణాళిక రూపొందించుకుంటాం. జిల్లాలోని మూడు భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, మధ్య తరహా, ఎత్తిపోతల పథకాలపై సమీక్షలు చేసి ప్రణాళిక రూపొందించుకుంటా.

 తెలంగాణ వచ్చాక తొలి పంద్రాగస్టు..
 త్వరలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ ఫ్లేవర్ ఉండాలని అధికారులకు చెప్పా. తెలంగాణ వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి పంద్రాగస్టు ఇది. ఎక్కువగా తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు, ముఖ్యంగా ఖమ్మం ఆచార వ్యవహారాలు ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం.

 ఉద్యోగులకు సమయ పాలన చాలా ముఖ్యం
 ప్రజల సమస్యలు, ఫిర్యాదులను సక్రమంగా పరిష్కరించడం ఉద్యోగుల బాధ్యత. ప్రజలకు జవాబుదారీగా ఉండే బాధ్యత ఉద్యోగులది. కచ్చితంగా సమయానికి కార్యాలయానికి రావాల్సిందే. సమసయం అయిపోయేంతవరకు ఉండాల్సిందే. ఇదే విషయాన్ని అన్ని శాఖాధిపతులకు చెప్పాను. వారిని తనిఖీ చేయమన్నా. నేను కూడా ఆకస్మిక తనిఖీలకు వెళ్తా. ఈనెల 19 తర్వాత అన్ని మండలాలను విరివిగా తనిఖీ చేస్తా. తనిఖీకి వెళ్లినప్పుడు ఆసుపత్రి, పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్తా.

ఇక, పాలనా వ్యవహారాల్లో నేను వచ్చిన తర్వాత ఇప్పటికైతే రాజకీయ జోక్యం ఎక్కడా కనిపించలేదు. ఒకవేళ అలాంటిది ఏైదె నా ఉంటే... రూల్స్ ప్రకారమే నడుచుకుంటా. ఈ పని అవుతుంది... ఈ పని కాదు అని చెప్పేస్తా.... రూల్స్‌కు అతీతంగా వెళ్లలేం కదా...! జిల్లాలో ఉన్న లాంగ్ స్టాండింగ్ సిబ్బంది సమస్య నా దృష్టికి వచ్చింది. వారు చాలా కాలంగా ఉన్నారు కదా అని బదిలీ చేయాల్సిన పనిలేదు. వారి పనితీరేంటో తెలుసుకుంటా. అప్పుడు నిర్ణయం తీసుకుంటా. నా విజన్ నాదే. ఏదైనా పాలన విషయంలో నేనేంటో నెలరోజుల్లో సమాధానం వస్తుంది.

 వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చా...
 మాది వ్యవసాయ కుటుంబం. నాన్న పేరు కుంజితపాదం, అమ్మ పేరు ఇందిర.  మాది తమిళనాడులోని నాగపట్నం జిల్లా ఆయకారన్‌పురం అనే గ్రామం. నేను ప్రభుత్వ పాఠ శాలలోనే చదువుకున్నా. పేద కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి పేదరికం గురించి నాకు బాగా తెలుసు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో ఉన్న భారత పభ్రుత్వ పశు పరిశోధన సంస్థలో పీజీ డాక్టర్ కోర్సు చదివిన తర్వాత ఐఏఎస్‌కు సెలెక్ట్ అయ్యా. రెండో ప్రయత్నంలోనే సాధించా. భార్య డాక్టర్ టి.ఆర్. కన్నకి, ఆమె నా క్లాస్‌మేట్. ఇప్పుడు శాస్త్రవేత్త. నాకు ఇద్దరు కూతుర్లు. పెద్ద పాప సంజీవని, చిన్న కుమార్తె లాయషిణి. నా సోదరుడు, ఆయన భార్య ఇద్దరూ డాక్టర్లే.

 నెలరోజుల తర్వాత రాకెట్ పట్టుకుంటా
 స్వతహాగా నేను బ్యాడ్మింటన్ క్రీడాకారుడిని. బ్యాడ్మింటన్, ఫొటోగ్రఫీ అంటే నాకు చాలా ఇష్టం. ప్రతి రోజూ రెండు గంటలు బ్యాడ్మింటన్ ఆడతా. ప్రస్తుతానికి ఇక్కడ మొదలుపెట్టలేదు. అంతా కుదురుకున్నాక నెలరోజుల్లో బ్యాడ్మింటన్ ఆడటం స్టార్ట్ చేస్తా. సినిమాలు బాగా చూస్తా... రజనీకాంత్ అంటే చాలా ఇష్టం.

 పూజిస్తే మంచి వ్యక్తిత్వం అలవడుతుంది..
 నాకు దైవభక్తి ఎక్కువే. రోజూ రెండుసార్లు పూజ చేస్తా. దేవుడంటే మంచితనం..ఆయనను పూజిస్తే మంచి వ్యక్తిత్వం అలవడుతుంది. జిల్లా ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మనిషి జీవితంలో స్నేహం, సోదరభావం చాలా ముఖ్యం.

 ఏ రోజు పని ఆరోజే..
 నాలాంటి పేదవాడు, కింద నుంచి వచ్చిన వారు కూడా కలెక్టర్ అయ్యేలా రాజ్యాంగం రాసిన వారికి కృతజ్ఞతలు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన వారు, రాజ్యాంగం రాసిన వారికి ఎప్పుడూ రుణపడి ఉంటాం. నాకు ప్రత్యేక కోరికలేమీ లేవు. ఏ రోజు పని ఆరోజు బాగా చేయడమే నా సూత్రం. ఇప్పటివరకు అదే చేస్తున్నా. రేపు అనేది దేవుడిష్టం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement