త్వరలో రోడ్డుపైకి షీ ఆటోలు
మహిళలకు శిక్షణ ఇస్తున్న పీపుల్ వెల్ఫేర్ సొసైటీ
మధురానగర్ : మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు అయోధ్యనగర్‌కు చెందిన పీపుల్ వెల్ఫేర్ సొసైటీ తన వంతు బాధ్యతగా పలు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నగర పాలక సంస్థతో కలిసి నిర్వహిస్తున్న షీ ఆటో శిక్షణ కార్యక్రమానికి మహిళల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మొదటి బ్యాచ్‌లో 20 మంది మహిళలు శిక్షణ పొందుతున్నారు. ఆటో డ్రైవింగ్‌తో పాటు మహిళలకు ఆపదకాలంలో ఉపయోగపడేందుకు కరాటేను కూడా నేర్పిస్తున్నారు. షీ ఆటో శిక్షణతోపాటు మహిళలకు స్వయం ఉపాధిని అందించేందుకు అవసరమైన ఫ్యాషన్ డిజైనింగ్, టైలరింగ్, కార్ డ్రైవింగ్‌లలో శిక్షణ ఇవ్వనున్నామని నిర్వాహకులు వివరించారు.
అవకాశాలు అందిపుచ్చుకోవాలి
షీ ఆటో శిక్షణ కార్యక్రమాన్ని నగర పాలక సంస్థతో కలిసి నిర్వహిస్తున్నాం. ఆటోలలో స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు, దోపిడీల నివారణకు షీఆటోలు దోహదపడతాయి. రాత్రి పూట స్వీయ రక్షణ కోసం కరాటేను నేర్పిస్తున్నాం. అధికారులు మహిళల కోసం ప్రత్యేకంగా షీ ఆటోలు తయారు చేయించి వారికి శిక్షణానంతరం సబ్సిడీపై అందజేందుకు కృషి చేస్తున్నాం. మహిళలు పురుషులతో సమానంగా అవకాశాలు అందిపుచ్చుకోవాలి.
- నందిగామ శ్రీలక్ష్మి,
పీపుల్స్ వెల్పేర్ సొసైటీ