6 గ్యారంటీల్లో 5 అమలు చేశాం
ఉద్యోగులకు ప్రతినెల 1న వేతనాలు ఇస్తున్నాం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
చింతకాని వరకు పల్లెవెలుగులో ప్రయాణించిన భట్టి
ఉచిత కరెంట్, బస్ ప్రయాణంపై మహిళలతో ముచ్చటించిన డిఫ్యూటీ సీఎం
ఖమ్మం వన్‌టౌన్: మహిళల ఆర్థిక స్వావలంబనే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక, ఇంధన శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్ నుండి బుధవారం ఆయన పల్లెవెలుగు బస్సులో చింతకాని మండలం జగన్నాధపురం వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా సాధారణ ప్రయాణికుడిలానే టికెట్ తీసు కుని ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత కరెంట్, ఉచిత బస్సు ప్రయాణం లాంటి పథకాల అమలుపై మహిళలతో, జీరో టిక్కెట్ విధానం గురించి కండక్టర్ శైలజను అడిగి తెలుసుకున్నారు.
నాగులవంచ గ్రామానికి చెందిన జానమ్మ, అనంతమ్మతో భట్టి మాట్లాడుతూ కరెంట్ మంచిగా వస్తుందా...ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉంది? ఎన్నిసార్లు ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణం చేశారని అడిగారు. అందుకు వారు సమాధానమిస్తూ ఉచిత బస్సుల్లో ప్రయాణం వల్ల ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుందని తెలుపుతూ సంతోషం వ్యక్తం చేశారు. స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు రుణాలు ఇప్పించి వారితో బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీలో పెట్టాలనే ఆలోచన చేస్తున్నామని భట్టి తెలిపారు.
రాష్ట్రంలో 92% ఉన్న బలహీన వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత ప్రభుత్వంలో ఆర్టీసీ ఉంటుందా, మూసివేస్తారా, అమ్ముతారా అన్న దశ నుంచి ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కలి్పంచడంతో పాటు సంస్ధను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేశామన్నారు. కాగా, గత పాలకులు రూ.7లక్షల కోట్లు అప్పులు చేస్తే ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని నెమ్మదిగా గాడిలో పెడుతున్నామన్నారు. డిప్యూటీ సీఎం భట్టి వెంట వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, కలెక్టర్ వీపీ.గౌతమ్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ వెంకన్న బస్సులో ప్రయాణించారు.
Comments
Please login to add a commentAdd a comment