She autos
-
మహిళలకు షీ ఆటోలు
చిలకలపూడి(మచిలీపట్నం): జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 8వ తేదీన మహిళలకు ఆటోలు అందజేయనున్నట్లు సంక్షేమ రుణాల కన్వీనరు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎన్వీవీ సత్యనారాయణ అన్నారు. స్థానిక కార్యాలయంలో శుక్రవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఆటోలు అందజేస్తామన్నారు. మహిళలకు సాధికారత కోసం స్వయంశక్తితో ఎదిగేందుకు ఆటోలను పంపిణీ చేసే ఆలోచన చేశామన్నారు. కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఆదేశాల మేరకు జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు కార్పొరేషన్ల ద్వారా మహిళలకు సబ్సిడీపై అందజేయనున్నామన్నారు. దరఖాస్తు చేసుకున్న మహిళలను మెప్మా పీడీ, అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్, మహిళా కార్పొరేషన్ ఆధ్వర్యంలో లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. లక్ష రూపాయల సబ్సిడీతో ఈ ఆటోలను అందజేస్తామన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 50 మందికి, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 25 మందికి, బీసీ కార్పొరేషన్ ద్వారా 50 మందికి, కాపు కార్పొరేషన్ ద్వారా 50 మందికి అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మహిళలకు ఆటోలు అందజేసే ముందుగా శిక్షణా కార్యక్రమంతో పాటుగా లైసెన్సులను తామే అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ ఈడీ జి పెంటోజీరావు, గిరిజన సంక్షేమశాఖాధికారి ఎం.ఈశ్వరరావు పాల్గొన్నారు. -
త్వరలో రోడ్డుపైకి షీ ఆటోలు
మహిళలకు శిక్షణ ఇస్తున్న పీపుల్ వెల్ఫేర్ సొసైటీ మధురానగర్ : మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు అయోధ్యనగర్‌కు చెందిన పీపుల్ వెల్ఫేర్ సొసైటీ తన వంతు బాధ్యతగా పలు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నగర పాలక సంస్థతో కలిసి నిర్వహిస్తున్న షీ ఆటో శిక్షణ కార్యక్రమానికి మహిళల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మొదటి బ్యాచ్‌లో 20 మంది మహిళలు శిక్షణ పొందుతున్నారు. ఆటో డ్రైవింగ్‌తో పాటు మహిళలకు ఆపదకాలంలో ఉపయోగపడేందుకు కరాటేను కూడా నేర్పిస్తున్నారు. షీ ఆటో శిక్షణతోపాటు మహిళలకు స్వయం ఉపాధిని అందించేందుకు అవసరమైన ఫ్యాషన్ డిజైనింగ్, టైలరింగ్, కార్ డ్రైవింగ్లలో శిక్షణ ఇవ్వనున్నామని నిర్వాహకులు వివరించారు. అవకాశాలు అందిపుచ్చుకోవాలి షీ ఆటో శిక్షణ కార్యక్రమాన్ని నగర పాలక సంస్థతో కలిసి నిర్వహిస్తున్నాం. ఆటోలలో స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు, దోపిడీల నివారణకు షీఆటోలు దోహదపడతాయి. రాత్రి పూట స్వీయ రక్షణ కోసం కరాటేను నేర్పిస్తున్నాం. అధికారులు మహిళల కోసం ప్రత్యేకంగా షీ ఆటోలు తయారు చేయించి వారికి శిక్షణానంతరం సబ్సిడీపై అందజేందుకు కృషి చేస్తున్నాం. మహిళలు పురుషులతో సమానంగా అవకాశాలు అందిపుచ్చుకోవాలి. - నందిగామ శ్రీలక్ష్మి, పీపుల్స్ వెల్పేర్ సొసైటీ