త్రీటౌన్ సీఐ స్వామి వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధిత విద్యార్థులు
మరో గొలుసుకట్టు వ్యాపారం
* మోసం చేసిందని పలువురి ఆందోళన
* పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
కరీంనగర్ క్రైం : ఢిల్లీ కేంద్రంగా గ్లేజ్ ట్రేడింగ్ ప్రైవేట్ కంపెనీల పేరుతో కరీంనగర్ మండలంలోని తీగలగుట్టపల్లిలో ఓ కార్యాలయం ప్రారంభించారు. వీటిలో ఉద్యోగాలున్నాయని పలువురు విద్యార్థులను ఆకర్షించారు. వీరిని నగరంలోని వావిలాలపల్లిలో ఓ కాంప్లెక్స్‌లో వసతి కల్పించి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గ్లేమా కంపెనీ ఉత్పత్తులను విక్రయించాలని చెప్పి ప్రతీ ఒక్కరికి ఓ కిట్ అందించారు. దీనికి గాను ఒక్కొక్కరి వద్ద రూ.7,800 నుంచి రూ.10 వేల వరకు వసూలు చేశారు. కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్‌తోపాటు పలు జిల్లాల నుంచి 2,500 మంది విద్యార్థులను చేర్చుకున్నారు. మొదట జాయిన్ అయిన వారు... వారి కింద ఎంత మంది జాయిన్ అవుతారో ఆ ప్రకారం పైనున్న వారికి వివిధ హోదాలు కల్పించారు.
పైస్థాయిలో ఉన్నవారికి పెద్దమొత్తంలో కమీషన్లు వస్తున్నాయని నమ్మించి పలువురిని చేర్పించారు. చైన్ సిస్టమ్ అని చెప్పకుండానే సదరు వ్యక్తుల కింద ఎంత మంది చేరితే అంత హోదా పెరిగి కమీషన్ పెరుగుతుందనేలా సృష్టించారు. ఇలా 8 నెలలుగా వీరికి శిక్షణ సాగింది. ఇప్పటివరకు చాలామందికి ఎలాంటి సొమ్ము చెల్లించలేదు. వివిధ రకాల శిక్షణ అంటూ తమను తిప్పించుకుని ఎలాంటి వేతనాలు ఇవ్వకపోవడంతో కంపెనీ తమను మోసం చేసిందని కొందరు ఆరోపించారు. తమ నుంచి డబ్బులు వసూలు చేసి ఇప్పుడు వేరే రాష్ట్రంలో ఉత్పత్తుల అమ్మకాలకు పంపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కంపెనీలో మొదట చేరిన వారు తమకు వేలల్లో వేతనాలు వస్తున్నాయని, కంపెనీలో ఎలాంటి మోసం లేదని పేర్కొనడం గమనార్హం. తమకు తెలియకుండానే చైన్ సిస్టమ్‌లో ఇరికించారని వరంగల్ జిల్లా గూడూరు మండలం అపారిపల్లికి చెందిన గోవర్ధన్, శ్రీకాంత్ ఆరోపించారు. తమకు ఇచ్చిన కిట్ అమ్ముకుంటే తాము పెట్టిన డబ్బులు తిరిగివస్తాయని చెప్పారని, కానీ, ఆ ఉత్పత్తులను ఎవరూ కొనడం లేదని తెలిపారు.
ఒక్కో సబ్బు రూ.48, షాంపూ రూ.145 ఉందని... ఇలాంటి వాటిని ఎవరు కొంటారని వాపోయారు. శనివారం నగరంలోని వావిలాలపల్లిలో విద్యార్థులు నివాసముంటున్న కాంప్లెక్స్‌లో కొందరు నిరసన వ్యక్తం చేయడంతో గందరగోళం నెలకొంది. సమాచారమందుకున్న త్రీటౌన్ సీఐ స్వామి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రధాన కార్యాలయం తీగలగుట్టపల్లిలో ఉండడంతో బాధితులను రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తమకు వేతనాలతో మంచి ఉద్యోగం ఇస్తామని చెప్పి కంపెనీ మోసం చేసిందని గోవర్ధన్, శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.