దూకుడుగా బీజేపీ ప్రచార పర్వం
అగ్రనేతల పర్యటనలతో జోష్...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ హైవోల్టేజీ ప్రచారం ముగిసింది. ప్రధాని నరేంద్రమోదీ మొదలు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంల పర్యటనలతో ప్రచారపర్వాన్ని దూకుడుగా పూర్తి చేసింది. బహిరంగసభలు, వివిధ సామాజికవర్గాల వారీగా సమావేశాలు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు, ఇంటింటికి బీజేపీ వంటి కార్యక్రమాలతో హోరెత్తించింది.
ముఖ్యంగా మోదీ, అమిత్‌షా, నడ్డా వంటి అగ్రనేతలు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవ ర్గాలను ఒక ప్రణాళికాబద్ధంగా చుట్టివచ్చేలా ఎన్నికల ప్రచార కార్యక్రమాల రూపకల్పన ఆ పార్టీకి కలిసొచ్చిందనే చెప్పాలి. పార్టీ కచ్చితంగా గెలిచే అవకాశమున్న సీట్లు, ఇంకా కొంచెం కష్టపడితే గెలవగలిగే స్థానాలు, పోటీలో ఉన్న స్థానాలు...ఇలా వర్గీకరించుకుని తప్పకుండా విజయం సాధిస్తామనే చోట్ల అధిక దృష్టిని కేంద్రీకరించారు.
ఇందుకు అనుగుణంగానే.. ప్రచారం ప్రారంభించిన నాటి నుంచి ప్రచార గడువు ముగిసే వరకు బీజేపీ నేతలు ఉధృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచార పర్వం పూర్తయ్యే ముందురోజు అంటే...శుక్రవారం సాయంత్రం ఎల్‌బీస్టేడియంలో ఐదు ఎంపీ సీట్ల పరిధిలో నిర్వహించిన బహిరంగసభలో మోదీ ప్రసంగించారు. అదేరోజు మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానంలో ఎన్నికల ప్రచారంలోనూ ఆయన పాల్గొన్నారు. ఇక ప్రచారం ముగిసిన శనివారం చేవేళ్ల ఎంపీ సీటు పరిధిలోని వికారాబాద్‌లో, నాగర్‌కర్నూల్‌లోని వనపర్తిలో నిర్వహించిన సభల్లో అమిత్‌షా పాల్గొన్నారు.
ప్రచారంలో దూకుడుగానే
ప్రధానపార్టీల కంటే ముందుగా అభ్యర్థుల ప్రకటనతో పాటు ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ వెలువడేలోగానే తొలివిడత ఎన్నికల ప్రచారం పూర్తి చేసిన బీజేపీ.. మొత్తంగా రాష్ట్రంలో ప్రచార విషయంలో మాత్రం బీజేపీ‘అడ్వాంటేజ్ పొజిషన్’లోకి ప్రవేశించిందనే చెప్పాలి. పదేళ్లపాటు కేంద్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు, తెలంగాణకు వివిధ రూపాల్లో రూ.10 లక్షల కోట్ల వరకు నిధుల కేటాయింపు వెరసి మోదీ సర్కార్ సాధించిన విజయాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రచారాన్ని ఉరకలెత్తేలా చేసింది.
అయితే సీఎం రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు ఆరోపించిన రిజర్వేషన్ల రద్దు అంశం, మళ్లీ బీజేపీ వస్తే హైదరాబాద్‌ను యూనియన్ టెరిటరీ చేస్తారన్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ల ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీజేపీ నేతలు సర్వశక్తులూ ఒడ్డాల్సి వచ్చింది. ఈ రెండు విషయాలపై ఏకంగా మోదీ, అమిత్‌షా సహా రాష్ట్ర పార్టీ అ«ధ్యక్షుడు కిషన్‌రెడ్డి కూడా ప్రధానంగా ఫోకస్ చేయాల్సి వచ్చిందనే చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment