దేశంలో లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీల ప్రచారం జోరందుకుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఇప్పటికే ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు వంటి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే అధికార బీజేపీ ఎన్నికల్లో ప్రచారం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది.
2024 పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అధికార బీజేపీ ఎన్నికల్లో అమలు చేసే వ్యూహాలు, ప్రచార సరళిని క్షేత్రస్థాయిలో చూపించేందుకు ప్రపంచంలోని పలు దేశాలకు సంబంధించి అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలకు ఆహ్వానాలు పంపింది. సుమారుగా 25 విదేశాలకు చెందిన పార్టీలకు ఇప్పటికే ఆహ్వానాలను పంపిచినట్లు తెలుస్తోంది. అయితే అందులో 13 పార్టీల ప్రతినిధులు భారత్‌కు రావడానికి ఆసక్తి చూపినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. అయితే 13 పార్టీల ప్రతినిధులు ఏయే దేశాలకు చెందినవారనే పూర్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు.
బీజేపీ ఆహ్వానించిన విదేశీ పార్టీలు..
అమెరికాలోని అధికార డెమోక్రటిక్ పార్టీ, ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీకి బీజేపీ ఆహ్వానం పంపింది. ‘‘అమెరికాలో అధికార, ప్రతిపక్ష పార్టీలు అధ్యక్ష ఎన్నికలు కోసం తలమునకలై ఉంది. అయితే యూఎస్ పార్టీ ఇండియా, యూరప్‌లోని ఎన్నికల విధానానికి భిన్నంగా ఉంటుంది. యూఎస్ పార్టీ కార్యకర్తకు ఆ పార్టీ చీఫ్ తెలియని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అక్కడ అధ్యక్ష కార్యాలయం, యూఎస్ కాంగ్రెస్ (చట్ట సభ)కు అక్కడ చాలా ప్రాముఖ్యం ఉంటుంది’’అని ఓ బీజేపీ నేత తెలిపపారు. యూఎస్‌తో పాటు యూకేలోని కన్జర్వేటివ్, లేబర్ పార్టీల ప్రతినిధులను ఆహానం పంపారు. జర్మనిలో క్రిస్టియన్ డెమోక్రటిక్ పార్టీ, సోషల్ డెమోక్రటిక్ పార్టీని ఆహ్వానించారు.
అయితే పొరుగు దేశం పాకిస్తాన్ నుంచి ఒక్కపార్టీని కూడా పిలువకపోవటం గమనార్హం. భారత్‌తో పాక్‌కు సరైన సంబంధాలు సరైన సంబంధాలు లేని విషయం తెలిసిందే. అదేవిధంగా సరిహద్దు వివాదంతో తరుచు కవ్వించే చైనా పార్టీలకు కూడా బీజేపీ ఆహ్వానం పంపించలేదు. మరోవైపు పొరుదేశమైన బంగ్లాదేశ్‌లో కేవలం అధికార అవామీ లీగ్‌ను మాత్రమే ఆహ్వానించింది. ఇటీవల అక్కడి ప్రతిపక్ష పార్టీ బీఎన్‌బీ.. ‘ఇండియా అవుట్’ అనే నినాదంతో భారతీయ ఉత్పత్తులను బాయ్‌కాట్ చేసిన విషయం తెలిసిందే. నేపాల్, శ్రీలంకకు చెందిన అన్ని ప్రముఖ పార్టీలను బీజేపీ ఆహ్వానించింది.
ఇక.. తాము ఆహ్వానించిన విదేశీ పార్టీల ప్రతినిధులు లోక్‌సభ ఎన్నికల మూడో లేదా నాలుగో దశ పోలిగ్ సమయం(మే రెండో వారం)లో భారత్‌ను సందర్శిస్తారని బీజేపీ భావిస్తోంది. విదేశి పార్టీకు చెందిన ప్రతినిధులు, పరిశీలకులు ముందుగా ఢిల్లీ చేరుకొని భారత్ రాజీకీయ వ్యవస్థ, ఎన్నికల విధానం గురించి తెలుసుకుంటారు. 5-6 మంది ప్రతినిధుల బృందం నేరుగా క్షేత్రస్థాయిలో 4-5 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ నేతలను కలుస్తారు. ప్రధాని మోదీ, హోం మంత్రి వంటి నేతల ర్యాలీల్లో విదేశీ పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొననున్నారు.
బీజేపీ ప్రాముఖ్యత తెలపటమే లక్ష్యం
ప్రపంచ వ్యాప్తంగా బీజేపీ పార్టీ ప్రాముఖ్యత తెలియచేయటంలో భాగంగా ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఆయన విదేశీ పార్టీలకు చెందిన సుమారు 70 మంది ప్రతినిధులను కలువనున్నారు. ఇప్పటికే.. నేపాల్ ప్రధాని పుష్పకుమార్ దహాల్ ప్రచండను బీజేపీ ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి ఆహ్వానించింది. గతేడాది జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో సైతం విదేశీ పార్టీలకు చెందిన 4-5 మంది ప్రముఖుల బృందం పలు చోట్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొంది.
ఇక.. ప్రపంచం దేశాల్లో ఉన్న వివిధ రాజకీయ పార్టీలకు చేరువకావటమే లక్ష్యంగా బీజేపీ ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘ప్రజాస్వామ్యానికి ఇండియా తల్లి వంటిది. ప్రపంచంలోనే అతి పెద్దపార్టీ బీజేపీ. బీజేపీ ఎన్నికల విధానం, ఎన్నికల ప్రచారం, అమలు చేసే వ్యూహాలను ప్రపంచ దేశాలు తెలుసుకోవాలి’’అని బీజేపీ విదేశీ వ్యవహారాల విభాగం నేత విజయ్ చౌతైవాలే తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment