కొత్త ఊపిరులూదిన సర్కారు | modi govt gives new hopes | Sakshi
Sakshi News home page

కొత్త ఊపిరులూదిన సర్కారు

Published Fri, Jun 10 2016 12:10 AM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM

కొత్త ఊపిరులూదిన సర్కారు - Sakshi

కొత్త ఊపిరులూదిన సర్కారు

- విశ్లేషణ
 
మోదీ ప్రభుత్వం సామాన్యుల కోసం స్పందించే ప్రభుత్వంగా ఖ్యాతి పొందుతోంది. కేవలం సంక్షేమ చర్యలే కాకుండా మోదీ ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేసింది. కేవలం ఆర్థికవృద్ధి అనే కోణంలో కాకుండా పేద ప్రజలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచించింది. మౌలిక సదుపాయాల కల్పనే అభివృద్ధికి చాలా ముఖ్యం. రోడ్లు, రైల్వేలు, పోర్టులు, పౌర విమానయాన విస్తరణ, ఇంధన తదితర రంగాలను బలోపేతం చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చింది.
 
 
 సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా ప్రధాని నరేంద్ర మోదీ పేదల, కింది వర్గాల కష్టాలను వెనువెంటనే గుర్తించారు.  నిజానికి రెండేళ్ల పాలనలో పేదరిక నిర్మూలనకే మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. అదే సమయంలో జాతీయ ప్రయోజనాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఆయన ముందుకు వెళుతున్నారు. కాబట్టే రెండేళ్ల మోదీ పాలన సందర్భానికి ఎంతో స్పందన కనిపిస్తున్నది. అణగారిన వర్గాల సామాజిక, ఆర్థిక సాధికారత సాధించేం దుకు అవసరమైన దృఢమైన ఆర్థిక ప్రగతికి  పునాదులు నిర్మించే క్రమంలో మోదీ ప్రభుత్వం ఎన్నో పథకాలు చేపట్టింది. వీటి ఫలితాలు సమీప భవిష్యత్తులోనే కనిపిస్తాయి. ప్రజా సంక్షేమం, ఆర్థిక ప్రగతి - ఈ రెండింటి నీ మేళవించిన అభివృద్ధి నమూనా ఎన్డీఏ పాలనకు గీటురాయిగా నిలిచింది. పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ప్రవచించిన ‘అంత్యోదయ’ సిద్ధాంత స్ఫూర్తితో పేద, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఈ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తున్నది. వీరి ప్రయోజనాల రక్షణకు రాజ్యాంగ నిర్మాతలు ఏర్పరచిన ప్రజాస్వామిక వ్యవస్థలను రక్షిస్తున్నది.
 

అవినీతి రహిత పాలన
 యూపీఏ అవినీతి దుర్గంధాన్ని భరించలేకే బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు ఓటు వేశారు. ప్రజల నమ్మకాన్ని మోదీ నిలబెట్టారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో, రెండేళ్ల ప్రధానిగా ఆయన మీద, ఆయన మంత్రివర్గం మీద అవినీతి మచ్చ లేకపోవడంతో మేధావులు, కొన్ని సర్వే సంస్థలు విభ్రమంగా చూస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. అవినీతి వల్ల ఎక్కువగా నష్టపోయేది పేద ప్రజలేనన్నది వాస్తవం. తమ అవినీతి, కుంభకోణాలు ఎక్కడ బయట పడతాయోనని కాంగ్రెస్ అధిష్టానం మోదీ ప్రభుత్వం వేగానికి అడ్డుపడు తున్న సందర్భంలో కూడా ఆయన స్పష్టమైన ఫలితాలను సాధించి పెట్టారు. బీజేపీ అత్యున్నత స్థాయిలోనే ఈ అవినీతిని నిర్మూలించి వనరులను కాపాడి సామాన్య ప్రజల సంక్షేమానికి నిధులు ఖర్చు చేస్తున్నది. పారదర్శకతకు ప్రాధాన్యం ఇచ్చి పరిపాలనను మరింత మెరుగు పరిచింది. ముద్ర యోజన, స్కిల్ డెవలప్‌మెంట్, ఉపాధి హామీ పథకం, జన్‌ధన్ యోజన పథకాలతో సామాన్యుల అభివృద్ధికి బాటలు వేస్తున్నది. ఈ ఏడాది 2016-2017 కేంద్ర బడ్జెట్‌లో పేద వర్గాలను ఆదుకునేందుకు భారీ పథకాలను చేపట్టింది. గ్రామీణ పేదల పురోగతి కోసం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం నీటి పారుదల ప్రాజెక్టులను త్వరితగతిని పూర్తి చేయాలని, పంట బీమా, మెరుగైన మార్కెట్ సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంది.


 గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను వృద్ధి చేసే దిశగా అందరికీ విద్యుత్ సౌకర్యం, ఎల్‌పీజీ కనెక్షన్లు, మరుగుదొడ్ల నిర్మాణం వంటి కార్యక్ర మాలను చేపట్టింది. ప్రధానమంత్రి ఉజ్జ్వల యోజన కింద పేద కుటుంబా లకు ఐదు కోట్ల కొత్త ఎల్‌పీజీ కనెక్షన్లు మంజూరు చేస్తోంది. స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఇంటింటికీ మరుగుదొడ్డిని నిర్మిస్తున్నది. సమాజంలో ఆ వర్గాల గౌరవాన్ని పెంచడానికి తన వంతు కృష్టిని ఈ ప్రభుత్వం అంది స్తున్నది. 2002 నాటికి దేశమంతటా 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన ప్రణాళికలు చేపట్టింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్ వంటి రాష్ట్రాలలో పైలట్ పథకంలో భాగంగా నిరంతర విద్యుత్  సరఫరా చేస్తోంది. జన్‌ధన్ యోజన పథకం ద్వారా పేదలను ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను చేసి వారి జీవితాలను మార్చేందుకు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతమయ్యాయి.

ఇన్నేళ్ల పాటు బ్యాంకు వ్యవస్థతో సంబంధాలు లేని పేదలకు ఇప్పుడు బ్యాంక్ ఖాతాలు ఏర్పాటయ్యాయి.  ఈ పథకం కింద 22 కోట్ల ఖాతాలు తెరవడం జరిగింది. మోదీ పరిపాలనలో ఇదొక చరిత్రాత్మక ముందడుగేనని చెప్పాలి. వీటితోను, ఆధార్‌కార్డుతోను మోదీ ప్రభుత్వం మధ్య దళారుల ప్రమేయాన్ని నిరోధించగలిగింది. ఇప్పటికే  పలు విదేశీ విశ్వవిద్యాలయాలు, మేధావులు ఈ పథకాన్ని లోతుగా అధ్యయనం చేసి ప్రశంసలు కురిపించారు. ఈ ఖాతాలతో పాటు లభించే ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకా లతో పాటు పేదలకు సామాజిక భద్రత ఏర్పడింది. ముద్ర యోజన పథకంతోనూ పేదల జీవితాలలో మార్పు మొదలయింది. రెండేళ్ల కిందటి వరకు చిన్న వ్యాపారులు, వృత్తి పనివారు చిన్న పరిశ్రమలకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు బ్యాంకుల నుంచి అప్పు పుట్టేది కాదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ముద్ర యోజన కింద పూచీకత్తు లేకుండా చిన్న మొత్తాలు రుణాలు తీసుకునే అవకాశాన్ని ఇచ్చింది.


విశిష్టం విదేశాంగ విధానం
 మోదీ విదేశాంగ విధానం స్వతంత్ర భారత విదేశాంగ విధానం ప్రాతిపదికగా సరికొత్తగా ఆవిర్భవించినదే. పాకిస్తాన్‌తో ఆయన అనుసరిస్తున్న సంబం ధాలే ఇందుకు నిదర్శనం. ఉగ్రవాదం గురించి ఆ దేశాన్ని దుయ్యబడుతూనే, సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయో గించుకునే మార్గాలను అన్వేషించడం మోదీ విదేశాంగ విధానంలో కని పిస్తుంది. బంగ్లాతో సరిహద్దు భూమి ఒప్పందం చేసుకున్నారు.మిడిల్ ఈస్ట్ దేశాలలో ప్రచ్ఛన్న యుద్ధాల మధ్య ప్రాణ భయంతో నలిగిపోతున్న భార తీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చి కేంద్ర ప్రభుత్వం వారికి భరోసా కల్పించింది. జపాన్‌తో 35 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు సంబం ధించిన ఒప్పందం మరొక మైలురాయి. ఐదేళ్ల కాలంలో ఈ మొత్తం దేశానికి పెట్టుబడుల రూపంలో వస్తుంది. ఆస్ట్రేలియాతో యురేనియం కోసం ఒప్పందం చేసుకున్నారు మోదీ. భారత్ సాధించిన విజయాలను చెప్పి, పెట్టు బడులను ఆహ్వానించడానికి ఆయన ఈ రెండేళ్లలోనే విస్తృతంగా విదేశాలలో పర్యటించారు.


గ్రామీణాభివృద్ధికి పెద్దపీట
భారత ఆర్థిక వ్యవస్థను వృద్ధిపథంలో నడిపే నిజమైన ఇంజిన్‌గా గ్రామీణ ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఈ ముద్ర పథకం కింద మే-2016 వరకు 3.89 కోట్ల మంది లబ్దిదారులు 1.46 లక్షల కోట్ల రూపాయల రుణాలు పొంది తమ వ్యాపారాభివృద్ధికి వినియోగించుకుంటున్నారు. దీని ఫలాలు, సామర్థ్యం రాబోయే సంవత్సరాల్లో మరింత మెరుగవుతుంది. ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్న ప్రతీ సమయంలో ప్రభుత్వం  స్పందిస్తోంది. అధు నాతన సాంకేతిక పద్ధతులను వినియోగించి వారిని ఆదుకుంటోంది. కరువు విషయంలో ప్రధానమంత్రి మోదీ స్వయంగా రంగంలోకి దిగి ముఖ్య మంత్రులతో నేరుగా సమావేశమై అవసరమైన చర్యలు తీసుకున్నారు. తమిళనాడు వరదల సమయంలో, కేరళ ఆలయంలో అగ్ని ప్రమాద ఘటన సమయంలో ప్రధానమంత్రి ప్రత్యక్షంగా అక్కడికివెళ్లి సంక్షోభాన్ని గట్టెక్కించే ప్రయత్నం చేశారు.  పౌర కేంద్రితమైన, పారదర్శకమైన, జవాబుదారీతనం కలిగిన పరిపాలనను ప్రజలకు అందిస్తూ ప్రజల ఆదరాభిమానాలను చూర గొంటున్నారు.

రైళ్లలో ప్రయాణించే సాధారణ ప్రయాణీకుడు సైతం తనకే దైనా ఇబ్బంది కలిగితే ప్రధానమంత్రి జోక్యం చేసుకుంటారనే ఆశావహ దృక్పథాన్ని కలిగి ఉన్నాడు. మోదీ ప్రభుత్వం సామాన్యులకు స్పందించే ప్రభుత్వంగా ఖ్యాతి పొందుతోంది. కేవలం సంక్షేమ చర్యలే కాకుండా మోదీ ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేసింది. కేవలం ఆర్థికవృద్ధి అనే కోణంలో కాకుండా పేద ప్రజలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచించింది. మౌలిక సదుపాయాల కల్పనే అభివృద్ధికి చాలా ముఖ్యం. రోడ్లు, రైల్వేలు, పోర్టులు, పౌర విమానయాన విస్తరణ, ఇంధన తదితర రంగాలను బలోపేతం చేసేందుకు అవసరమైన మౌలిక సదు పాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చింది. జాతీయ రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేస్తోంది. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రతిరోజూ 8.5 కిలోమీటర్ల రహదారి నిర్మాణం జరిగితే, ఎన్డీఏ హయాంలో 2015-16 సంవత్సరంలో రోజుకు 16.5 కిలోమీటర్ల రహదారి నిర్మాణం జరుగుతోంది. రైల్వే ట్రాక్‌ల నిర్మాణం ఊపందుకుంది. యూపీఏ ప్రభుత్వ హయాంలో రోజుకు 4.3 కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌లు వేయగా, ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజుకు 7 కి.మీ రైల్వేట్రాక్‌లు వేస్తున్నారు. అహ్మదాబాద్- ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్‌కు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించింది.
 

సాగరమాల ప్రాజెక్టుతో దేశంలోని పోర్టులను అభివృద్ధి పరచే చర్యలు ప్రారంభమయ్యాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధి అత్యంత వేగంతో పూర్తి చేసేందుకు భారీ స్థాయిలో ఏడాదికి 2,200 కోట్లు ఖర్చు చేయాలని ప్రధానమంత్రి నిర్దేశించారు. వ్యవసాయరంగంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించి రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రధానమంత్రి కృషి సిచాయ్ యోజన ద్వారా - తక్కువ నీటితో ఎక్కువ పంటలు - పండించేందుకు ప్రణాళికలు రచించారు. త్వరి తగతిన పూర్తయ్యే నీటి పారుదల ప్రాజెక్టులను ప్రాధాన్యతగా తీసుకుని వాటికి నాబార్డ్ ద్వారా 20 వేల కోట్ల రూపాయల నిధులను సమకూర్చింది. దీంతో పంట భూములకు వేగంగా నీటిని అందించే ఏర్పాట్లు జరిగాయి. తెలంగాణ, ఏపీ నుంచి పలు నీటి పారుదల ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. యూరియాకు వేపపూత అంటించటం వల్ల బ్లాక్ మార్కెట్‌ను అరికట్టగలిగింది. సబ్సిడీలు అనర్హులకు చేరకుండా నేరుగా లబ్దిదారులకు చేరేలా లీకేజీలను అరికట్టడంలో ప్రభుత్వం విజయ వంతమైంది. ఎన్డీఏ ప్రభుత్వ రెండేళ్ల పాలన అభివృద్ధికి బాటలు వేస్తూ పేదరిక నిర్మూలన దిశగా వెళుతోంది. దురదృష్టవశాత్తు కాంగ్రెస్, కొన్ని రాజకీయ పార్టీలు ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి.  ప్రజాతీర్పును గౌరవించ కుండా అభివృద్ధి కార్యక్రమాలకు అవరోధంగా నిలుస్తున్నాయి. తమ వాక్చా తుర్యంతో ప్రజల దృష్టిని మరల్చేందుకు సర్కస్ ఫీట్లు చేస్తున్నాయి.

- మురళీధర్‌రావు
వ్యాసకర్త బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
muralidharrao.p@gmail.com

 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement