రాజకీయ పార్టీలకు మరో దెబ్బ
రాజకీయ పార్టీలకు మరో దెబ్బ
Published Sat, Dec 24 2016 1:59 PM | Last Updated on Thu, Jul 11 2019 8:55 PM
ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగబోతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల తరుణంలో రాజకీయ పార్టీలకు మరో షాకింగ్ అనుభవం ఎదురవుతోంది. విరాళాల రూపంలో వచ్చే నగదు భారీగా తగ్గిపోతోంది. దీంతో రాజకీయ పార్టీలు ఆర్థికంగా కుప్పకూలుతున్నాయి. డెమొక్రాటిక్ రిఫార్మ్స్ అసోసియేషన్(ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ వెలువరిచిన రిపోర్టులో ఈ సంచలనకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజకీయ పార్టీలకు అందే విరాళాలు 84 శాతం కుప్పకూలాయని రిపోర్టులు వెల్లడించాయి.
2015-16లో కేవలం 16 శాతం మాత్రమే రాజకీయ పార్టీలు విరాళాలుగా సేకరించాయని రిపోర్టు తెలిపింది. ఎన్నికల సమయంలో పార్టీలకు భారీ మొత్తంలో విరాళాలు అందుతుంటాయి. ప్రచారాలకు, ఓటర్లను ప్రలోభపెట్టడానికి ఈ నగదును పార్టీలు ఎక్కువగా ఖర్చు చేస్తుంటాయి. కానీ బ్లాక్మనీకి పోరాటంగా ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడం అనంతరం పార్టీల ఖర్చులపై ఎన్నికల సంఘం ఎక్కువగా దృష్టిసారించడం వారి రెవెన్యూలకు గండికొట్టింది.
దీంతో ఈసారి జరుగబోతున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ముందస్తు కంటే నగదు ఖర్చు తక్కువగానే ఉండబోతుందని తెలుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీ, టీఎంసీ, సీపీఎం, సీపీఐ పార్టీల విరాళాలను ఈ రిపోర్టు ఎక్కువగా ఫోకస్ చేసింది. ఈ పార్టీలు 1,744 మంది ప్రజల నుంచి రూ.102.02 కోట్లు మాత్రమే విరాళాలు స్వీకరించినట్టు తెలిసింది. వీటిలో 74 శాతం అంటే రూ.77.28 కోట్లు కార్పొరేట్ సంస్థల నుంచి వచ్చాయని తేలింది.
జాతీయ పార్టీల్లో తమదైన హవా సాగిస్తున్న బీజేపీ, కాంగ్రెస్లకు కూడా విరాళాలు దెబ్బకొట్టాయట. బీజేపీ విరాళాలు రూ.76.85 కోట్లకు పడిపోగా, కాంగ్రెస్కు రూ.20.42 కోట్లకు క్షీణించాయని తెలిసింది. ఎన్నికల సంఘం ప్రకారం రూ.20వేల కంటే ఎక్కువ విరాళాలు అందుకునే రాజకీయ పార్టీలన్నీ వాటికి సంబంధించిన వివరాలను పాన్ కార్డుతో సహా సమర్పించాల్సి ఉంటుంది.
Advertisement
Advertisement