'రైతు' చుట్టూ శవరాజకీయాలు
న్యూఢిల్లీ: దేశరాజధాని నగరం ఢిల్లీ నడిబొడ్డున ఓ రైతు అత్మహత్య చేసుకుంటే ... దానికి దారితీసిన తీవ్రమైన పరిస్థితులను అర్థం చేసుకోకుండా రాజకీయ పార్టీలు నిసిగ్గుగా శవ రాజకీయాలకు తెరతీశాయి. రైతులోకంలో అలముకున్న బాధాకరమైన పరిస్థితులకు అద్దం పడుతున్న ఈ సంఘటనను చూడాల్సిన కోణంలో చూడకుండా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఇదంతా పోలీసుల తప్పని, పోలీసుల ఆదిపత్యం తమ చేతుల్లో లేదంటూ ఆప్ పార్టీ ముందుగా తమ పాత రాజకీయ ఎజెండాను ముందుకు తీసుకొచ్చి శవరాజకీయాలకు శ్రీకారం చుట్టగా, కాంగ్రెస్ పార్టీ ఈ దారుణానికి ఆప్ పార్టీయే కారణమంటూ రాజకీయ శంఖారావం పూరించింది.
మధ్యలో భారతీయ జనతాపార్టీ రంగంలోకి దిగి తప్పంతా భూ సేకరణ చట్టానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించిన ఆప్ పార్టీదేనని ఆరోపణల జడివాన కురిపించింది. ఇదంతా ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టిన రాజస్థాన్ రైతు గజేంద్ర సింగ్ ఆస్పత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నప్పుడే జరగడం మరెంత దారుణమో ఆ పార్టీలే గ్రహించాలి. జంతర్ మంతర్ నుంచి ఒక్కసారిగా సీన్ రామ్ మనోహర్ లోహియాకు మారిపోయింది. మృతుడి బంధువులను పలకరించడంలో అక్కడ కూడా రాజకీయ పోటీ రక్తి కట్టించింది. ఈ సంఘటనపై ఎవరేమన్నారో పరిశీలిస్తే రాజకీయ పార్టీల శవ రాజకీయాల గురించి ఎవరూ చెప్పక్కర్లేదు.
అరవింద్ కేజ్రివాల్: మనందరి కళ్ల ముందే రైతు చెట్టెక్కాడు. ఆ మనిషిని రక్షించండి...రక్షించండి! అంటూ మనం పోలీసులకు చెబుతూనే ఉన్నాం. ఢిల్లీ పోలీసులు మన చేతుల్లో లేరనే విషయం మనకు తెల్సిందే. మన మాట వినకపోయినా కనీసం మానవత్వంతోనైనా పోలీసులు ఆ రైతును రక్షించి ఉండాల్సింది. వారు అసలు స్పందించలేదు. ఆ విషయం తాను చూసుకుంటానని కమిషనర్ తాపీగా సమాధానం ఇచ్చారు.
కాంగ్రెస్ నేత సచిన్ పైలట్: రైతును కాపాడాల్సిన ఆప్ నాయకులు అది పట్టించుకోకుండా ర్యాలీని కొనసాగించారు. నేను విన్నది నిజమే అయితే....ఆ రైతును కాపాడేందుకు ఎవరూ ప్రయత్నించలేదు. వారికి ఓ వ్యక్తి ప్రాణాలను రక్షించడంకంటే రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వడమే వారికి ముఖ్యమంది. రైతుల కోసం పోరాడుతామంటున్న వారి మాటల్లో నిజం ఎంతో ఈ సంఘటనతో స్పష్టమవుతోంది.
బీజేపీ నేత సంబితా పాత్ర: ఇది కుట్ర...ఇది జరుతుందని కేజ్రివాల్‌కు ముందే తెలుసు. చెట్టు ఎక్కుతున్న రైతు ఆత్మహత్య చేసుకోబోతున్నాడని మీకు తెలుసు. కానీ మీరు శవరాజకీయాలకు పాల్పడ్డారు. ఓ వ్యక్తి ప్రాణంకన్నా మీకు మీ రాజకీయ భవిష్యత్తు ముఖ్యమైంది. ఓ డాక్టర్‌గా ఆ రైతు ప్రాణం పోవడం ఎంత బాధాకరమో నాకు తెలుసు.
ఆప్‌నేత సోమ్‌నాథ్ భారతి: రైతు ఆత్మహత్యను ఆపేందుకు ఆప్ కార్యకర్తలు ఎంతో ప్రయత్నించినా లాభం లేకపోయింది. చెట్లెక్కడం ఢిల్లీ పోలీసులకు నేర్పకపోవడం దారణం. ఇందులో ఏదో కుట్ర ఉంది. అయితే ఈ సంఘటనతో ర్యాలీని కొనసాగించకుండా ఆపి వేయాల్సింది.