సాక్షి, ముంబై: మహిళలకు అన్ని రంగాల్లో తగిన ప్రాధాన్యత.. మహిళా బిల్లుకు త్వరలో ఆమోదం.. మహిళలకు అన్ని రంగాల్లోనూ 50 శాతం రిజర్వేషన్లు.. అంటూ ఊదరగొడుతున్న రాజకీయ పార్టీలు, నాయకులు చట్టసభల విషయానికి వచ్చేసరికి మహిళలకు ప్రాధాన్యతనివ్వడం మరిచిపోయారు.
ప్రత్యక్ష రాజకీయాల్లో స్త్రీ పాత్రను ప్రచారానికే పరిమితం చేస్తున్నారు తప్ప సీట్లు కేటాయించి చట్టసభలకు పంపేందుకు సుముఖత చూపడంలేదు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలను పరిశీలించినట్లయితే రాష్ట్రంలో 48 సీట్లకు గాను అన్ని పార్టీలనుంచి కేవలం 14 మంది మహిళలకు బరిలో ఉన్నారు. ఇందులోనూ సగం సీట్లు వారికి వారసత్వంగా లభించినవే తప్ప స్వచ్ఛందం ఎవరికీ సీట్లు కేటాయించలేదంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రంలో లోకసభ ఎన్నికలు మూడు విడతల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. 48 లోకసభ నియోజకవర్గాలకుగాను మొదటి విడత ఏప్రిల్ 10వ తేదీన, రెండవ విడత 17వ తేదీన, మూడవ విడత ఎన్నికలు 24వ తేదీన జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించారు.
ఒక వైపు మొదటి విడతలోని 10, రెండవ విడతలోని 19 లోకసభ నియోజక వర్గాల్లో నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తి అయింది.ఇదిలా ఉండగా దేశంలోనే మొట్టమొదటిసారిగా లోకసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ‘ఆమ్ ఆద్మీపార్టీ’ (ఆప్) ఇతర పార్టీలకంటే కొంతమేర మహిళలకు ప్రాధాన్యం ఇచ్చిందని చెప్పవచ్చు. 17 శాతం మంది అనగా 8 మంది మహిళ అభ్యర్థులను లోకసభ ఎన్నికల్లో బరిలోకి దింపింది. ఇలా రాష్ట్రంలో అత్యధికంగా మహిళ అభ్యర్థులను దింపిన పార్టీగా మారిందని చెప్పవచ్చు. దీన్ని మినహాయిస్తే.. రాష్ట్రంతోపాటు అటు కేంద్రంలోనూ అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీలు మహిళలకు మొండిచేయి చూపించాయి.
ఇటీవలే భివండీలో జరిగిన లోకసభ ఎన్నికల ప్రచారంలో స్వయానా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మహిళలకు 33 శాతం కాకుండా 50 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్టు చెప్పారు. కాని టికెట్లు కేటాయింపునకు వచ్చేసరికి కాంగ్రెస్ కేవలం ఒకే ఒక్క మహిళ అభ్యర్థిని ఈసారి లోక్‌సభ బరిలో దింపింది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పోటీ చేస్తున్న మొత్తం 27 మంది అభ్యర్థులలో ప్రియాదత్ ఒక్కరే మహిళ. ఆమె కూడా వారసత్వ రాజకీయాల్లో భాగంగానే టికెట్ పొందగలిగారు. మరోవైపు ఎన్సీపీ పరిస్థితి చూస్తే.. ఆ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ సైతం మహిళలకు తమ పార్టీలో ప్రాధాన్యమిస్తున్నట్లు పదేపదే చెబుతుంటారు.
కాని వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎన్సీపీ మొత్తం 21 సీట్లలో పోటీ చేస్తుండగా వీరిలో కేవలం ఇద్దరు మహిళా అభ్యర్థులే ఉన్నారు. వీరిలో ఒకరు స్వయానా శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే కాగా మరొకరు ఎన్సీపీ ఎమ్మెల్యే సతీమణి నవనీత్ కౌర్ రాణా ఉన్నారు. దీన్నిబట్టి వీరికి కూడా వారసత్వంగా ఈ సీట్లు లభించాయే తప్ప ఒక కార్యకర్తగా, రాజకీయ నాయకురాలుగా లభించనవి కావని పలువురు పేర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేసేందుకు సుప్రియా సూలే ఎన్సీపీ మహిళా విభాగాన్ని కూడా ప్రారంభించారు. అయినప్పటికీ ఒక్క మహిళ కార్యకర్తకు కూడా ఈసారి లోక్‌సభ బరిలో నిలబెట్టకపోవడం గమనార్హం. ఇక కాషాయ కూటమి విషయానికి వస్తే.. మహిళలకు పెద్దపీట వేస్తామని అందరి మాదిరిగానే చెప్పుకునే బీజేపీ, శివసేనలు కూడా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వలేదు.
ముఖ్యంగా బీజేపీ బరిలో దింపిన ఇద్దరిలో ఒకరు దివంగత బీజేపీ నాయకుడు ప్రమోద్ మహాజన్ కుమార్తె పూనం మహాజన్ కాగా మరొకరు ఎన్సీపీ మంత్రి కూతురైన హీనా గావిత్. వీరిద్దరికి కూడా వారసత్వంగానే ఈ సీట్లు లభించాయి. మరోవైపు శివసేన కూడా భావనా గావ్లీ అనే ఒకే ఒక్క అభ్యర్థిని బరిలోకి దింపింది.
మాటే మరిచారే..
Published Sat, Mar 29 2014 11:14 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement