సాక్షి, సెంట్రల్ డెస్క్: కొత్త సంవత్సరం వచ్చేసింది.. ఇది అలాంటి ఇలాంటి సంవత్సరం కాదు.. ఎన్నికల సంవత్సరం... ఈ ‘మే’ నెలలో మనం తీసుకోబోయే నిర్ణయం రాజకీయ నేతల గతినేకాదు, దేశ గతిని, రాష్ట్ర గతినీ కూడా మలుపు తిప్పుతుంది. ఆ గతి ఏ దిశగా అన్నది ఇప్పు డు చెప్పలేంగానీ.. ఎన్నికల్లో ప్రజలు తీసుకోబోయే నిర్ణయం ఎలాంటి కీలక పరిణామాలకు వేదిక కానుందో ఓ లుక్కేద్దాం!
న.మో. మంత్రం
వరుసగా మూడు దఫాలు గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోడీకి.. 2013 సంవత్సరం మొత్తం ఎన్డీయే భాగస్వామ్య పక్షాలను మచ్చికచేసుకోవడానికి, నాయకత్వ పోటీని తప్పించుకోవడానికి, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల మెప్పు పొంది ప్రధాని అభ్యర్థిగా (కనీసం ఎన్నికలు పూర్తయ్యేవరకైనా) నిలవడానికే సరిపోయింది. ఇప్పుడు ఎన్నికల ప్రచారం మొత్తం మోడీ చేతిలో ఉంది. బీజేపీ కూడా భారీ ఆశలు పెట్టుకుంది.. అంతేస్థాయిలో శ్రేణుల్లో అంచనాలకు మించిన ఆశలు కల్పించింది. మే నెలలో ప్రజలు వేసే ఓటుతో బీజేపీకి 200 కంటే ఏమాత్రం తక్కువ సీట్లు వచ్చినా.. పార్టీ శ్రేణుల్ని అది తీవ్ర నిరాశలోకి నెట్టేసే ప్రమాదముంది. పార్టీ తిరిగి కోలుకోవడం కూడా కష్టమే కావచ్చు.
రాహుల్ గాంధీతో పార్టీ ఢమాల్!
ఓవైపు అధ్యక్ష ఎన్నికల తరహాలో బీజేపీ ప్రచారం జోరుగా సాగిస్తోంటే... దానికి దీటుగా తప్పనిసరి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ తెరమీదకొచ్చారు. అయితే ఆయన ప్రచార పగ్గాలు తీసుకునే సమయానికే.. కాంగ్రెస్ కష్టాల్లో కూరుకుపోయింది. తిరుగుబాటు నేతలపై చర్యలకు యత్నాలు, సంస్కరణల విషయంలో రాహుల్ గాంధీ వైఖరి.. పార్టీ ప్రచారం విషయంలో నేతలకు తగిన స్పష్టతనివ్వలేదు. ఇలా అసమర్థ నిర్వహణతో సాగే ఎన్నికల ప్రచారం.. పార్టీ అంతానికి శ్రీకారం చుడుతుందన్నది విశ్లేషకుల వ్యాఖ్య.
ఏపీ ఉంటుందా..విడిపోతుందా!
ఈ ఏడాది లోక్‌సభతోపాటు ఆరు రాష్ట్ర శాసనసభలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. అవి హర్యానా, మహారాష్ట్ర, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్. ఈ ఏడాది ఎన్నికల ఫలితాలతో ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉంటుందా.. విడిపోతుందా అన్నది కూడా తేలిపోనుంది. సమైక్యమే తమ అభిమతమంటున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్‌కే అత్యధిక శాతం సీట్లు వస్తాయని సర్వేలన్నీ తేల్చిచెబుతున్న సంగతి తెలిసిందే.
ఆమ్ ఆద్మీ పార్టీ..
2013 ఢిల్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించింది. హంగ్‌తో వచ్చిన ట్విస్టుల మధ్య దేశ రాజధానిలో పాగా వేసింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలతో తమ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించడానికి చూస్తోంది. ఈ ఎన్నికల్లో ఇతర రాష్ట్రాల్లో సీట్లు గెలుచుకోగలిగితేనే ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుందని, లేదంటే ఇక సోదిలోనే ఉండదని విశ్లేషకులు అంటున్నారు. మరి ప్రజలు ఎలా ఓటేస్తారో చూడాలి.
సీబీ‘ఐ’ ఎవరిపై?
కాంగ్రెస్‌కు అడ్డొచ్చినవారిని కేసుల్లో ఇరికించడానికి సీబీఐ ఒక ఆయుధంగా మారిందన్న ఆరోపణలే నిజమైతే.. ఈ ఎన్నికల ఫలితాలు ఆ ఏజెన్సీపై కూడా ప్రభావం చూపనున్నాయి. కోల్‌గేట్ కుంభకోణంలో సీబీఐ విచారణ ప్రారంభించి ఏడాదిన్నర అవుతోంది. ఇప్పటికే 14 కేసులను ఏజెన్సీ నమోదు చేసింది. చాలా మంది ప్రముఖులను నిందితులుగా తమ ఎఫ్‌ఐఆర్‌లలో పేర్కొన్నప్పటికీ.. ఎవరిపైనా చార్జిషీటు దాఖలు చేయలేదు. మరి ఈ ఏడాది సీబీఐ ఎవరినైనా కటకటాల్లోకి నెడుతుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.
ఒకవైపు న.మో. మంత్రం.. మరోవైపు రా.గా. గానం.. మధ్యలో ప్రాంతీయ పార్టీల దూకుడుతో ఈ ఏడాది ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. మూడో, నాలుగో ఫ్రంట్ దిశగా ఎన్నికల వరకు ప్రయత్నాలు కొనసాగే అవకాశముంది. అయితే ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిలో కీలకమవుతాయన్న విశ్లేషకుల అభిప్రాయం నేపథ్యంలో..
ఏ ఫ్రంట్ ఏమవుతుందో మరి!
2014లో ‘కీ’లకం
Published Thu, Jan 2 2014 1:56 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement