ఎన్నికలకు జయహే | election festival | Sakshi
Sakshi News home page

ఎన్నికలకు జయహే

Published Mon, Mar 31 2014 12:46 AM | Last Updated on Thu, Sep 19 2019 8:28 PM

election festival

సాక్షి, సిటీబ్యూరో: ఉగాది వేళ.. ఎన్ని‘కల’ పండగ సందడి చేస్తోంది. రాజకీయ ఆశావహులు కొత్త సంవత్సరం తమ జీవితాలకు కొత్త కళ తెస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే  తేలని పొత్తులు.. ప్రత్యర్థుల ఎత్తులు.. స్వపక్షంలో విపక్షాలు.. టికెట్‌పై సందేహాలు.. ప్రజా మద్దతుపై అనుమానాలు.. వెరసి ‘గ్రేటర్’ నేతలకు తీపి కంటే చేదు అనుభవాలే అధికంగా ఎదురవుతున్నాయి.

జయ నామ సంవత్సరం నగరవాసులకు కోటి ఆశలు, కొత్త ఊసులు మోసుకొస్తుండగా.. నగరానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సిట్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యేల్లో చాలామందికి ‘చేదు’నే పంచే అవకాశాలున్నాయన్నది రాజకీయ పంచాంగ పండితుల అంచనా.  టికెట్ ఖరారైన నేతలు తీపి కబురుతో ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతుండగా.. మిగతావారు మాత్రం పలు సంశయాలు, సందేహాలతో ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో..’ అనుకుంటూ పండగ ఆనందాన్ని ఆస్వాదించ లేకపోతున్నారు.
    
ఆయా రాజకీయ పార్టీల మధ్య ఎన్నికల పొత్తులు కొలిక్కి రాకపోవటం, ఆశించిన స్థానం నుంచి టికెట్ దక్కుతుందో లేదోనన్న సందేహం, ఒకవే ళ టికెట్ వచ్చినా జనాభిమానం పొందుతామో లేదోనన్న అనుమానం నగర నేతల్ని తొలుస్తోంది. గత ఎన్నికల్లో నగరంలో మెజారిటీ స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితినే తీసుకుంటే.. తండ్రుల బదులు తనయులు టికెట్ల కోసం క్యూ కట్టడం ఈసారి ప్రత్యేకతగా నిలుస్తోంది. టికెట్లు దక్కే అవకాశం ఉన్న నేతలు సైతం సురక్షితమైన నియోజకవర్గాల కోసం వెతుకులాడటం విశేషం. గోషామహల్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తాజా మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ ఈ మారు ముషీరాబాద్ స్థానం నుంచి పోటీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఒకవేళ స్థానం మారకుండా గోషామహల్ స్థానం నుంచి పోటీ చేయాల్సి వస్తే తన కుమారుడు విక్రంగౌడ్‌ను బరిలోకి దించే అవకాశం కనిపిస్తోంది. ముషీరాబాద్ ఎమ్మెల్యే మణెమ్మ తన కుమారుడు శ్రీనివాసరెడ్డిని బరిలోకి దింపాలని భావిస్తున్నారు. మరో తాజా మాజీ మంత్రి దానం నాగేందర్ సైతం ఖైరతాబాద్, నాంపల్లి స్థానాలపై ఊగిసలాడుతున్నారు.

అంబర్‌పేట స్థానం నుంచి పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్న ఎంపీ హన్మంతరావుకు రాజ్యసభ పదవీ కాలం ఇంకా రెండేళ్లు ఉండటంతో చాన్స్ దొరకటం కష్టమనే చెబుతున్నారు. మిగిలిన చోట్ల సిట్టింగ్‌లకు టికెట్లు దక్కుతాయా? దక్కితే విజయం సాధించటం ఎలా? తదితర సందేహాలు చుట్టుముట్టాయి. తాజాగా మారిన పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ టికెట్‌పై విజయం సులువు కాదన్న విషయంతో ఇప్పటికే మల్కాజిగిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ టీఆర్‌ఎస్‌లో చేరిపోగా.. మరో ఇద్దరు ఎమ్మెల్యేలూ పార్టీ మారే అంశాన్ని సీరియస్‌గా పరిశీలిస్తున్నారు.

 బీజేపీ,‘దేశం’లలో గందరగోళం
 కొత్త ఏడాది తెలుగుదేశం పార్టీని రాహువు వీడే పరిస్థితి కనిపించటం లేదు. పొత్తులో భాగంగా సిటీలో మెజారిటీ సీట్లను బీజేపీ డిమాండ్ చేస్తుండటం టీడీపీకి నష్టదాయకం కాబోతుం ది. దీంతో ఆ పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న నాయకులు సగానికి పైగా నియోకజవర్గాల్లో ఇతర పార్టీల్లో చేరబోతున్నారు. బీజేపీ పరిస్థితీ ఇలాగే ఉంది. ఇక వైఎస్సార్‌సీపీ ఉగాది రోజు నుంచి మరింతగా దూసుకుపోయే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మెజారిటీ స్థానాల్లో పార్టీ సమన్వయకర్తలు ‘గడపగడపకూ..’ దూసుకు వెళుతున్నారు. టీఆర్‌ఎస్ సిటీలో అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలిపే అవకాశం ఉన్నా.. ఆశిం చిన స్థాయిలో సానుకూల ఫలితాలు రాకపోవచ్చని విశ్లేషకుల అభిప్రాయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement