కారు జోరు | muncipal elections to win the trs party | Sakshi
Sakshi News home page

కారు జోరు

Published Tue, May 13 2014 2:24 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

కారు జోరు - Sakshi

కారు జోరు

ఉద్యమ ఖిల్లాలో కారు వేగంగా దూసుకెళ్లింది.
పురపాలక ఎన్నికల్లో అనూహ్య ఫలితాలను నమోదు చేసింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అంచనాలను తలకిందులు చేసింది. మోడీ హవాతో పుంజుకున్న బీజేపీ సైతం బోణీ కొట్టింది. ఫలితంగా కాంగ్రెస్ చేతిలో ఉన్న మున్సిపాలిటీలన్నీ ఈసారి చెల్లాచెదురయ్యాయి. జిల్లాలో టీడీపీ అడ్రస్ గల్లంతైంది.
 
 సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, నాలుగు మున్సిపాలిటీలు, ఐదు నగర పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో ఆరు చోట్ల టీఆర్‌ఎస్ ఆధిక్యత చాటుకుంది. మూడు చోట్ల కాంగ్రెస్ పార్టీ పట్టు నిలుపుకుంది. మరో చోట రెండు పార్టీలు సమ ఉజ్జీలుగా నిలదొక్కుకున్నాయి. ఒక చోట బీజేపీ తమ సత్తా చాటుకుంది. టీఆర్‌ఎస్ పుంజుకోవటంతో పాటు బీజేపీ సత్తా చాటడంతో మిశ్రమ ఫలితాలు వెలువడ్డాయి. రెండు కార్పొరేషన్లతో పాటు నాలుగు మున్సిపాలిటీలు, అయిదు నగర పంచాయతీల్లో స్పష్టమైన ఆధిక్యతను చాటుకోవటంలో మూడు పార్టీలు విఫలమయ్యాయి.

ఎనిమిది పట్టణాల్లో మేజిక్ ఫిగర్‌కు సరిపడే మెజారిటీ స్థానాలు ఏ పార్టీ దక్కించు కోలేకపోయింది. జమ్మికుంట, హుస్నాబాద్ నగర పంచాయతీలను టీఆర్‌ఎస్  కైవశం చేసుకోగా, జగిత్యాల మున్సిపాలిటీని అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. మిగతా ఎనిమిది చోట్ల హంగ్ ఫలితాల కారణంగా ఛైర్మన్లు, మేయర్ల ఎంపిక ఉత్కంఠ రేపటం ఖాయమైంది. ఉద్యమ ప్రభావంతో పాటు తెలంగాణ తెచ్చిన క్రెడిట్‌ను టీఆర్‌ఎస్ ఖాతాలో వేసేందుకు పట్టణ ఓటర్లు మొగ్గు చూపారు. అందుకే జిల్లా మొత్తంలో అత్యధిక స్థానాలను ఆ పార్టీ తమ ఖాతాలో వేసుకుంది.

- మొత్తం 326 డివిజన్లు, వార్డులకు ఎన్నికలు జరిగితే 121 స్థానాల్లో టీఆర్‌ఎస్ విజయ కేతనం ఎగరేసింది. 111 స్థానాలతో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. బీజేపీ 25 స్థానాలను గెలుచుకోగా, టీడీపీ 11 సీట్లకు పరిమితమైంది. మిగతా 58 స్థానాల్లో ఇండిపెండెంట్లు, ఇతర పార్టీల అభ్యర్థులు గెలుపొందారు.
- టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, ఈటెల రాజేందర్, విద్యాసాగర్‌రావు, కేటీఆర్ తమ సెగ్మెంట్లలో అభ్యర్థుల ఎంపిక మొదలు ఎన్నికలను సవాలుగా స్వీకరించటంతో ఫలితాలు గులాబీ గుప్పిట్లో చేరాయి. కరీంనగర్‌తో పాటు హుజూరాబాద్, జమ్మికుంట, హుస్నాబాద్, సిరిసిల్ల, మెట్‌పల్లి పట్టణాల్లో టీఆర్‌ఎస్ మెజారిటీ స్థానాలు కైవశం చేసుకుంది.
- ముఖ్య నేతల మధ్య గ్రూపు తగాదాలు, అభ్యర్థుల ఎంపికలో ఒంటెత్తు పోకడలు కాంగ్రెస్ పార్టీని దెబ్బతీశాయి. అన్నీ తానై అన్నట్లుగా అభ్యర్థుల ఎంపికలో చక్రం తిప్పిన కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు పుర ఫలితాలు షాక్ ఇచ్చాయి.
- టిక్కెట్ల కేటాయింపులో మిగతా నేతలతో పెరిగిన విభేదాలు కరీంనగర్‌లో పార్టీ ఓట్లకు గండి కొట్టాయి.
- తెలంగాణ ఇచ్చిన ఘనత తమకే దక్కుతుందని, అభివృద్ధి పనులన్నీ తమ హయాంలోనే జరిగాయని కాంగ్రెస్ చేపట్టిన ప్రచారానికి నగరాల్లో ఆశించిన స్పందన లభించలేదు.
- రామగుండం కార్పొరేషన్‌తో పాటు మాజీ మంత్రి జీవన్‌రెడ్డికి పట్టు ఉన్న జగిత్యాల, మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు ప్రాబల్యమున్న కోరుట్ట పట్టణాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను ప్రదర్శించింది.
- పుర ఫలితాల్లో టీడీపీ పత్తా లేకుండా పోయింది. ఒక్కచోట కూడా ఎక్కువ స్థానాలు గెలుచుకోలేకపోయింది. కనీసం పరువు నిలబెట్టుకునే సంఖ్యలో వార్డులు, డివిజన్లను సాధించుకోలేపోయింది. పార్టీ ఎన్నికల కమిటీ అధ్యక్షుడు ఎల్.రమణ సొంత సెగ్మెంట్ జగిత్యాలలో 5 వార్డులు, పార్టీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు ప్రాతినిథ్యం వహిస్తున్న పెద్దపల్లిలో 3 వార్డులకు పరిమితమైంది. తెలంగాణపై అనుసరించిన ద్వంద్వ వైఖరితోనే ఆ పార్టీ చావుదెబ్బ తింది. పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకని విచిత్ర పరిస్థితిని చవిచూశారు. చివరకు బీజేపీతో పొత్తు, సీట్ల సర్దుబాటుతో కొన్ని చోట్ల అభ్యర్థులను పోటీకి దింపినప్పటికీ.. ఫలితాల్లో ఘోరంగా దెబ్బతిన్నారు.
-  పొత్తులో భాగంగా టీడీపీకి ఊపిరి పోసేందుకు ప్రయత్నించిన బీజేపీ జిల్లాలో బోణి కొట్టింది. టీడీపీతో పోలిస్తే రెండింతలకు మించి 25 స్థానాలు గెలుచుకుంది. ఎక్కువ దృష్టి కేంద్రీకరించిన వేములవాడలో అత్యధికంగా తొమ్మిది వార్డులను గెలుచుకొని నగర పంచాయతీకి గురి పెట్టింది.
- కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రాబల్యమున్న ఎంఐఎంకు ఈ సారి ఫలితాలు షాక్‌కు గురి చేశాయి. జిల్లా కేంద్రంలో ఆ పార్టీకి కేవలం రెండు డివిజన్లు దక్కాయి. ఏకంగా ఆ పార్టీ ముఖ్య నాయకులు పోటీ చేసిన డివిజన్లలోనూ ఓటమి తప్పించుకోలేకపోయింది. జిల్లాలో తొలిసారిగా 22 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దింపిన వైఎస్సార్‌సీపీ ఒక్క సీటును గెలుచుకోలేకపోయింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement