సునీతకు స్వగ్రామంలో ఎదురు దెబ్బ | sunitha defeated in elections | Sakshi
Sakshi News home page

సునీతకు స్వగ్రామంలో ఎదురు దెబ్బ

Published Sun, May 18 2014 12:21 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

సునీతకు స్వగ్రామంలో ఎదురు దెబ్బ - Sakshi

సునీతకు స్వగ్రామంలో ఎదురు దెబ్బ

 నర్సాపూర్, న్యూస్‌లైన్: నర్సాపూర్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు అనుకూల పవనాలు వీచగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీచినట్లు ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. నర్సాపూర్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్రమంత్రిగా బాధ్యతలు నిర్వహించి ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచి ఓటమి చెందిన మాజీ మంత్రి  సునీతారెడ్డికి స్వగ్రామంలో సైతం వ్యతిరేక పవనాలు వీచాయి. గతంలో ఆమె చేతిలో రెండుసార్లు ఓటమి చవిచూసి మూడో సారి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన  చిలుముల మదన్‌రెడ్డి కారు జోరుతో విజయం సాధించారు.

అయితే సునీతారెడ్డి స్వగ్రామమైన గోమారంలో మూడు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా ఒకే పోలింగ్ స్టేషన్‌లో ఆమెకు ఆధిక్యత వచ్చింది. 239 పోలింగ్ స్టేషన్‌లో ఆమెకు 469 ఓట్లు రాగా టీఆర్‌ఎస్ అభ్యర్థి చిలుముల మదన్‌రెడ్డికి 336ఓట్లు వచ్చాయి. 240 పోలింగ్ స్టేషన్‌లో కాంగ్రెస్‌కు 135 ఓట్లు మాత్రమే రాగా టీఆర్‌స్‌కు 366 ఓట్లు,240(ఎ) పీఎస్‌లో కాంగ్రెస్‌కు 284 ఓట్లు, టీఆర్‌ఎస్‌కు 311ఓట్లు రావడంతో అక్కడ సైతం టీఆర్‌ఎస్ హవా కొనసాగిందని స్పష్టమవుతుంది.
 
 అలాగు గోమారం పక్క గ్రామాలైన బిజిలీపూర్‌లో స్వల్ప ఆధిక్యత రాగా నవాబుపేట గ్రామంలో సుమారు నాల్గు వందల ఓట్ల ఆధిక్యత లభించింది. కాగా మండలానికి చెందిన మాజీ జెడ్‌పీటీసీ సభ్యులైన నారాగౌడ్, ఉమాదేవి, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు శ్రీరాంరెడ్డి స్వగ్రామాల్లో టీఆర్‌ఎస్‌కే ఆధిక్యత లభించింది. మదన్‌రెడ్డి స్వగ్రామమైన కౌడిపల్లిలో మూడు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా మూడింటిలో టీఆర్‌ఎస్‌కు 1328ఓట్లు రాగా కాంగ్రెస్‌కు 560 ఓట్లు మాత్రమే వచ్చాయి.  కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సీడీసీ చైర్మన్ చిలుముల దుర్గారెడ్డి కౌడిపల్లికి చెందిన వారే అయినప్పటికీ అక్కడ టీఆర్‌ఎస్‌కు భారీగానే ఓట్లు వచ్చాయి.

కాగా నర్సాపూర్ మాజీ వ్యవసాయ మార్కెట్ కమీటీ చైర్మన్ నారాయణరెడ్డి స్వగ్రామమైన చిట్కుల్‌లో, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు మాణిక్యరెడ్డి స్వగ్రామమైన గౌతాపూర్‌లో, మరో సీనియర్ నాయకుడు విశ్వంబరస్వామి స్వగ్రామమైన సోమక్కపేటలలో సైతం టీఆర్‌ఎస్‌కు ఆధిక్యత లభించింది. నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్‌లో కాంగ్రెస్ సర్పంచ్ ఉన్నప్పటికీ  టీఆర్‌ఎస్‌కు ఆధిక్యత లభించింది. ఇక్కడ కాంగ్రెస్‌కు 3558 ఓట్లు రాగా  టీఆర్‌ఎస్‌కు 4320ఓట్లు లభించాయి. కొన్ని నెలల క్రితం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నర్సాపూర్ పంచాయతీ సర్పంచ్‌గా రమణారావును గెలిపించుకుని పంచాయతీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.

మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆత్మకమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు గౌడ్ స్వగ్రామమైన రెడ్డిపల్లిలో టీఆర్‌ఎస్‌కు సుమారు రెండు వందల ఓట్లు అధికంగా వచ్చాయి.  మాజీ జెడ్‌పీటీసీ సభ్యుడు శ్రీనివాస్‌గుప్తా స్వగ్రామంలో కాంగ్రెస్‌కు టీఆర్‌ఎస్‌కన్నా 94 ఓట్లు ఎక్కువ వచ్చాయి. ఇదిలాఉండగా కొల్చారం మండలంలోని కాంగ్రెస్ నాయకులు ఇంద్రసేనారెడ్డి, మల్లారెడ్డి గ్రామాల్లో టీఆర్‌ఎస్‌కు స్వల్ప ఆధిక్యత రాగా ఇతర నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, రమేష్, నరేందర్‌రెడ్డి తదితరులు తమ  గ్రామాల్లో కాంగ్రెస్‌కు ఆధిక్యత సంపాదించిపెట్టారు.
 
అలాగే వెల్దుర్తి మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు అనంతరెడ్డి స్వగ్రామమైన బండపోసాన్‌పల్లిలో కాంగ్రెస్‌కు 69ఓట్ల ఆధిక్యత లభించింది. రామాయంపేట ఆత్మ కమిటీ చైర్మన్ మోహన్‌రెడ్డి స్వగ్రామమైన రామాంతపూర్‌లో టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ కన్నా  188ఓట్లు అధికంగా వచ్చాయి. మండల కేంద్రమైన వెల్దుర్తిలో కాంగ్రెస్  నాయకుడు శంకర్‌గౌడ్  ఊరిలో ఆరు పీఎస్‌లు ఏర్పాటు చేయగా సుమారు 350ఓట్ల ఆధిక్యత టీఆర్‌ఎస్‌కు లభించింది. హత్నూర మండల కేంద్రంలో కాంగ్రెస్‌కన్నా టీఆర్‌ఎస్‌కు ఐదు వందల ఓట్లు అధికంగా వచ్చాయి. గతంలో హత్నూర జెడ్‌పీటీసీ,ఎంపీపీ అధ్యక్ష పదవులు కాంగ్రెస్ అధీనంలో ఉన్నప్పటికీ టీఆర్‌ఎస్‌కు ఆధిక్యత రావడం గమనార్హం. హత్నూర మాజీ జెడ్‌పీటీసీ ఆంజనేయులు స్వగ్రామమైన బోర్పట్లలో 323 ఓట్లు, మరో  నాయకుడు అళ్వారయ్య స్వగ్రామంలో కాసాలలో టీఆర్‌ఎస్‌కు 288ఓట్లు అధికంగా వచ్చాయి. అదే మండలంలోని  డాక్టర్ గోవర్దన్‌రావు, నర్సింహారెడ్డి స్వగ్రామాల్లో టీఆర్‌ఎస్‌కు స్వల్ప ఆధిక్యత లభించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement