నవ శకానికి నాంది | trs josh in elections | Sakshi
Sakshi News home page

నవ శకానికి నాంది

Published Sun, May 18 2014 12:03 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

నవ శకానికి నాంది - Sakshi

నవ శకానికి నాంది

 మెతుకు సీమలో దశాబ్దాలుగా కొనసాగిన కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యానికి ఈ ఎన్నికల్లో గండిపడింది. గతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా జిల్లాలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీ సాటిలేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చింది. జిల్లా రాజకీయ చరిత్రను తిరగేసి చూస్తే అంతా కాంగ్రెస్ హవానే కనిపిస్తుంది. 2009 సార్వత్రిక ఎన్నికల వరకు చెక్కు చెదరని ఈ ఆధిపత్యానికి ఈ ఎన్నికల్లో ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్ అడ్డుకట్ట వేసింది.  రెండు లోక్‌సభ, 8 అసెంబ్లీ స్థానాలల్లో విజయం సాధించడం ద్వారా టీఆర్‌ఎస్ ప్రభంజనం సృష్టించింది. దీంతో జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్ మునుపటి ప్రభావాన్ని కోల్పోగా, టీఆర్‌ఎస్ శకం ఆరంభమైందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.  
 
 సాక్షి, సంగారెడ్డి: ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సామెతను ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తిరగరాసింది. రచ్చ గెలిచి ఇంట గెలవచ్చని రుజువు చేసి చూపింది. తాజా సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో జిల్లాపై ఆ పార్టీ  సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించి ‘పురిటిగడ్డపై టీఆర్‌ఎస్ బలహీనం’ అనే విమర్శలకు చెక్ పెట్టింది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో కేవలం మెదక్ లోక్‌సభ, సిద్దిపేట అసెంబ్లీ స్థానంతో సరిపెట్టుకున్న ఉద్యమ పార్టీ.. ఈ ఎన్నికల్లో మెదక్, జహీరాబాద్ లోక్‌సభ స్థానాలతో పాటు జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో 8 స్థానాలను కైవసం చేసుకుని  జిల్లా రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలికింది.
 
 నడిపించే నాయకుడు లేకే..
 2009 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రమంతా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గాలి వీచడంతో కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ లోక్‌సభతో పాటు జిల్లాలోని 8 అసెంబ్లీ స్థానాలను సునాయాసంగా గెలుచుకోగలిగింది. వైఎస్ మరణం తర్వాత ఆ లోటును పూడ్చే నేతలెవరూ లేక కాంగ్రెస్ బలహీనపడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే  తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయడం ద్వారా జిల్లాలో టీఆర్‌ఎస్ అనూహ్యంగా పుంజుకుంది. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం  తెలంగాణ  ఏర్పాటుపై ఏళ్లతరబడి తమ నిర్ణయాన్ని నాన్చుతూ వచ్చింది. ఎట్టకేలకు సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు పచ్చ జెండా ఊపినా, అప్పటికే పరిస్థితులు ‘చెయ్యి’ దాటిపోయాయి. తెలంగాణ ఇచ్చింది తెచ్చింది తామేననే నినాదంతో ఆ పార్టీ అభ్యర్థులు ఈ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసుకున్నా ఓటర్లు మాత్రం నమ్మలేదనే తెలుస్తోంది.
 
టీ-కాంగ్రెస్ ‘ముఖ్య’నేతగా గుర్తింపు తెచ్చుకున్న మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డితో పాటు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డిలతో సహా జిల్లాలో ఆ పార్టీకి చెందిన 6 మంది సిట్టింగ్ శాసన సభ్యులు ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్  చేతిలో మట్టి కరవడం దీనికి అద్దం పడుతోంది.  బొటాబొటి ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ జిల్లాలోని రెండు అసెంబ్లీ స్థానాలను నిలుపుకున్నా..ఆ రెండు చోట్ల కూడా టీఆర్‌ఎస్ అభ్యర్థుల నుంచి హోరాహోరీ పోటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. జహీరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి మాజీ మంత్రి జెట్టి గీతారెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థి కే మాణిక్ రావుపై 842 ఓట్ల స్వల్ప మెజారిటీతో నెగ్గి బతుకు జీవుడా అంటూ గట్టెక్కారు.
 
 ఓట్లు రాల్చిన ‘ప్రత్యేక’ పోరాటం
 టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని టీఆర్‌ఎస్ అభ్యర్థులు చేసుకున్న ప్రచారం ఓట్ల వర్షాన్ని కురిపించింది. మెతుకు సీమ ఓటర్లు సైతం తెలంగాణవాదానికే ఓటేయడంతో గెలుపొందిన టీఆర్‌ఎస్ అభ్యర్థులందరూ రికార్డు మెజారిటీని సాధించారు.
 
 తుడిచిపెట్టుకుపోయిన పచ్చపార్టీ
 ఇక 2009 ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ స్థానాన్ని దక్కించుకున్న టీడీపీ ఈ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయింది. టీడీపీ-బీజేపీ కూటమిని సైతం జిల్లా ఓటర్లు తిరస్కరించడంతో ఎన్నికల్లో ఇరు పార్టీల అభ్యర్థులు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. మొత్తానికి 2014 ఎన్నికలు జిల్లా రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేశాయని చెప్పవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement