* అధికారాన్ని చేపట్టేది మేమే
* తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ధీమా
సాక్షి, హైదరాబాద్: మరికొద్ది గంటల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితికి మెజారిటీ స్థానాలు దక్కుతాయని సర్వే ఫలితాలు, ఎగ్టిట్‌పోల్స్ చెబుతుండగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం కొత్త రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీ కాంగ్రెస్సేనని ధీమాతో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సోనియాగాంధీకి ప్రజలు ఓట్ల ద్వారా కృతజ్ఞత తెలిపారని చెబుతున్నారు.
ఎగ్జిట్‌పోల్స్, సర్వే నివేదికలను ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదని, గత ఎన్నికల్లో వెల్లడైన ఎగ్జిట్‌పోల్స్ ఇందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మొదలు తెలంగాణ ముఖ్యమంత్రి రేసులో ఉన్న ప్రముఖులంతా అధికారం తమదేననే ఆశల్లో ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తోపాటు మరే ఇతర పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశమే లేదని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
హంగ్ ఏర్పడినా 45 నుంచి 50 స్థానాలు దక్కించుకుని అతిపెద్ద పార్టీగా అవతరించేది కాంగ్రెస్సేననే ధీమాతో ఉన్నారు. తమకు గట్టి పోటీదారుగా ఉన్న టీఆర్‌ఎస్ 35 నుంచి 45 స్థానాలకే పరిమితం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన అవకాశం ఉండదని బల్లగుద్ది చెబుతున్నారు. మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మరింత మెరుగైన ఫలితాలు రావడం ఖాయమని భావిస్తున్నారు.
ఎన్నికల ఫలితాల తరువాత మజ్లిస్, సీపీఐలు కాంగ్రెస్‌కే మద్దతిచ్చేందుకు అంతర్గత ఒప్పందం జరిగిందని కూడా చెబుతున్నారు. ఒకవేళ తమ అంచనాలు తప్పి టీఆర్‌ఎస్ అతిపెద్ద పార్టీగా అవతరించినా ఆ రెండు పార్టీలు టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చే అవకాశం ఎంతమాత్రమూ లేదని అభిప్రాయపడుతున్నారు. సీపీఐ, మజ్లిస్ పార్టీలు కాంగ్రెస్‌కు మద్దతిచ్చినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మరికొన్ని సీట్లు అవసరమైతే ఇతర రాజకీయ పార్టీల సహకారాన్ని కోరేందుకూ వెనుకాడబోమన్నారు.
కేసీఆర్ జాతకాలు చెప్పుకోవాల్సిందే: దానం
టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం అసాధ్యమని మాజీ మంత్రి దానం నాగేందర్ వ్యాఖ్యానించారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇక జాతకాలు చెప్పుకుంటూ తిరగాల్సిందేనని ఎద్దేవా చేశారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తదని కేసీఆర్ కలగంటున్నడు. కేబినెట్ జాబితా కూడా రడీ చేసుకుంటున్నడట. ఆయనకు అంత సీన్ లేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది కాంగ్రెసే’’అని పేర్కొన్నారు.
తెలంగాణలో హంగే!
Published Fri, May 16 2014 1:03 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement