విజయమ్మ
అనంతపురం: వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ నుంచి బయలుదేరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ
జనపథం ఎన్నికల ప్రచారం యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. జిల్లాలో అడుగడుగున ఆమెకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. కదిరి, పుట్టపర్తి, హిందూపురంలలో విజయమ్మ రోడ్ షో జరిగింది. ఈ విధంగా ఆమె మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. రాత్రి 8.30 గంటలకు హిందూపురం బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. కదిరిలో ఇస్మాయిల్ కుటుంబాన్నిఆమె పరామర్శించారు. కదిరి, కుటగుల్ల, నల్లమాడలలో విజయమ్మకు అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. పలుగ్రామాలలో ప్రజలు ఆమెపై అభిమానంతో పూలవర్షం కురిపించారు. పుట్టపర్తి ప్రజలు ఆమెకు నీరాజనాలు పలికారు. పుట్టపర్తి జనసంద్రమైంది. ఆమెను చూసేందుకు జనం పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. పుట్టపర్తిలో సత్యసాయి సమాధికి విజయమ్మ నివాళులర్పించారు.
కదిరి వేదికగా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాలనను విజయమ్మ ఎండగట్టారు. చంద్రబాబు ప్రజలకు చీకటి పాలన అందిస్తే వైఎస్ స్వర్ణయుగాన్ని అందిచ్చారని విజయమ్మ తేల్చి చెప్పారు. తొమిదేళ్ల కాలంలో చంద్రబాబు చేసిన మంచిపని ఒకటి చెప్పాలని సవాల్ విసిరారు. ప్రజలను మోసం చేయడానికి ఉచిత హామీలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. ఊరూరా బెల్టు దుకాణాలను ప్రోత్సహించిన చంద్రబాబు ఇప్పుడు మద్యపాన నిషేధం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. విద్యుత్ చార్జీలు పెంచి రైతుల నడ్డి విరిచిన బాబు ఇప్పడు ఉచిత విద్యుత్ ఇస్తానంటున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు హామీల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. వైఎస్‌ఆర్ భావాలకు వారసత్వంగా పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు.
నల్లమాడలో విజయమ్మ మాట్లాడుతూ వైఎస్ఆర్ స్వర్ణయుగాన్ని తీసుకొచ్చే సత్తా ఒక్క జగన్కు మాత్రమే ఉందని చెప్పారు. వచ్చే ఎన్నికలలో జగన్ను ఆశీర్వదించమని కోరారు. కూడు, గూడు, గుడ్డ ప్రతి మనిషికి కావలసిన కనీస అవసరాలు నూటికి నూరు శాతం సామాన్యుడికి అందించిన నేత వైఎస్‌ఆరేనన్నారు. ఆహార, ఆరోగ్య భద్రత కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ఆమె వివరించారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా ఐదేళ్లలో 50 లక్షల గృహాలను నిర్మించారని చెప్పారు.
పేదవాడికి ఉచితంగా చదువు అందించిన నాయకుడు వైఎస్‌ఆర్ అని అన్నారు. వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో సమాజంలోని ప్రతి ఒక్కరూ లబ్ది పోందారని చెప్పారు. మానవీయ కోణంలో సంక్షేమ రంగాన్ని ప్రవేశపెట్టి అభివృద్ధికి బాటలు వేసారని విజయమ్మ తెలియజేశారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి పట్టించుకోని నేతలు ఇప్పుడు బీసీలపై ప్రేమ నటిస్తున్నారన్నారు. బీసీల సంక్షేమం కోసం అందరూ మాటలు చెబితే వైఎస్ చేతల్లో చూపారని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో బాల,బాలికలకు ప్రత్యేక వసతి గృహాలు నిర్మించిన నాయకుడు వైఎస్‌ఆర్ అని ఆమె కొనియాడారు.
విజయమ్మ రేపు మడకశిర, ధర్మవరం, అనంతపురంలో రోడ్డు షోలలో పాల్గొంటారు.