ఏమప్పా ...ఊరికొచ్చి ఎన్నిరోజులైంది... అందరూ అడుగుతున్నారు.. ఓ సారి వచ్చిపో.. ఆ మరచిపోయిన రేపు ఊల్లో ఎలచ్చన్లు ఉన్నాయి. పిల్లలను కూడా తీసుకురా... కావాలంటే నేను బస్సు చార్జీ రానుపోను ఇస్తాలే...గుర్తుపెట్టుకో... అందరూ రావాల... ఏం రామన్నా...హైదరాబాద్‌లో ఏం జేచ్చొండావ్.. సర్పంచ్ ఎన్నికలు... గుర్తున్నాయా... నేనే నిలబడినా... మనకీడ బాగా ప్రిస్టేజీ... మీ ఇంట్లో నాలుగు ఓట్లుండాయి...నువ్వు, వదిన, తమ్ముడు, అమ్మ అందరూ రావాలా... నేనే కారు పంపుతాలే. మళ్లీ ఆడ ఇడ్సబెట్టమంట... తప్పకుండా అందరూ రండి.. నేను సర్పంచ్ అయితే మీరైనట్టే కదా...
తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న చాలా పంచాయతీల్లో ప్రస్తుత పరిస్థితి ఇది. ఒక్క ఓటు కూడా కీలకం కావడంతో ఓట్లు రాబట్టుకునేందుకు అభ్యర్థులంతా పడరానిపాట్లు పడుతున్నారు. ఓటర్ల లిస్టు తీసుకుని ఉద్యోగ రీత్యా సుదూర ప్రాంతాల్లో ఉంటున్న వారికి ఫోన్లు చేస్తున్నారు. రానుపోను చార్జీలిస్తామని, అవసరమైతే కారే పంపుతామని ఓటర్లకు గాలం వేస్తున్నారు.
సాక్షి, అనంతపురం: సాధారణ ఎన్నికల్లో అయితే ఒక్కో అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గానికి లక్షల సంఖ్యలో ఓట్లుంటాయి. సొంత ఊళ్ల నుంచి ఉపాధి, ఉద్యోగ రీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి అవసరం పెద్దగా ఉండదు. ఆయా పార్టీల నాయకులు కూడా వలస వెళ్లిన ఓటర్ల గురించి పెద్దగా ఆలోచించే పరిస్థితి ఉండదు. పంచాయతీ ఎన్నికలు ఇందుకు భిన్నం. పార్టీలకు అతీతంగా జరిగే ఈ ఎన్నికలు సాధ్యమైనంత వరకు బరిలో నిలిచే అభ్యర్థులను బట్టి ఓట్లు వేస్తారు. సేవాభావం కల్గిన వారికే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం పరిపాటి. పంచాయతీలకు 500 మొదలుకుని వేలల్లో ఓట్లు ఉంటాయి. చాలా పంచాయతీల్లో వార్డు సభ్యులకైతే 200 లోపు ఓట్లున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రతి ఓటూ చాలా ముఖ్యమే. అందుబాటులో ఉన్న ఓటర్లతో పాటు బయట ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బరిలో నిలిచిన అభ్యర్థులు తంటాలు పడుతున్నారు.
తొలి విడతలో ఆరు ఏకగ్రీవం
జిల్లాలో 1,044 పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వగా కోర్టు, ఇతరత్రా కారణాలతో 5 పంచాయతీల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. తక్కిన 1,039 పంచాయతీలకు గాను తొలివిడత జరిగే కదిరి రెవెన్యూ డివిజన్‌లో ఆరు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 1,033 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. 10,744 వార్డు స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేసినా వివిధ కారణాల వల్ల 60 వార్డులకు ఎన్నికలు జరగడం లేదు. తక్కిన 10,644 వార్డులకు గాను తొలివిడత పంచాయతీల్లో 715 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. అంటే 9,929 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 2, 3, 4 విడతల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమైతే ఈ సంఖ్య మరింత తగ్గుతుంది.
వినూత్న ప్రచారాలతో సందడి..
గ్రామాల్లో ప్రచార సందడి హోరెత్తుతోంది. తొలివిడత పంచాయతీలకు ఆదివారంతో ప్రచార గడువు ముగిసింది. మూడు రోజుల పాటు సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు గ్రామాల్లో కలియ తిరిగారు. తమకు కేటాయించిన గుర్తు నమూనాలను ప్రదర్శిస్తూ వినూత్న ప్రచారాలతో ఓటర్లను ఆకట్టునే ప్రయత్నం చేశారు.
బయటి ప్రాంతాల్లో ఉన్న ఓటర్లకు గాలం..
ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారికి గాలం వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వివిధ పట్టణాలు, జిల్లా కేంద్రంతో పాటు హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో చాలామంది వివిధ పనులు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఏదో పెద్దపెద్ద పండులు, శుభ కార్యాలకు మాత్రమే సొంతూళ్లకు రావడం పరిపాటి. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు రావడంతో ప్రతి ఓటూ అమూల్యమే. ఈ క్రమంలో ఇలాంటి వారిని రప్పించేందుకు అభ్యర్థులు పాట్లు పడుతున్నారు. గ్రామస్తులు, బంధువులు, స్నేహితుల ద్వారా సెల్‌నంబర్లు సేకరించి ఫోన్లు చేస్తున్నారు. మరి కొందరైతే ఏకంగా పని చేస్తున్న ప్రాంతాలకు వెళ్లి మరీ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
రవాణా ఖర్చులు భరిస్తామని హామీ..
ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లను పిలిపించే క్రమంలో వచ్చి వెళ్లేందుకు రవాణా ఖర్చులు సైతం తామే భరిస్తామంటూ అభ్యర్థులు హామీ ఇస్తున్నారు. కొందరికైతే బస్సు, రైలు చార్జీలు చెల్లిస్తుండగా, మరికొందరికి కార్లను సైతం సమకూరుస్తున్నారు. దీంతో ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారు పైసా ఖర్చు లేకుండానే సొంతూళ్లకు వచ్చి బంధువులను చూసి ఓట్లేసి పోవచ్చనే భావనలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment