సాక్షి, అమరావతి : పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయడంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పందించింది. మేనిఫెస్టో విడుదలపై వివరణ కోరిన ఎస్‌ఈసీ.. శనివారం టీడీపీకి నోటీసులు జారీచేసింది. ఫిబ్రవరి 2వ తేదీలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కాగా పార్టీ రహిత ఎన్నికలైన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. మేనిఫెస్టో ఎన్నికల నియమావళికి విరుద్ధమని, తక్షణమే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరారు.
పార్టీ రహితంగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని.. పార్టీ గుర్తులు, కరపత్రాలు, ఫ్లెక్సీలు రాజకీయ పార్టీలు వాడకూడదని చట్టం స్పష్టంచేస్తోందని కమిషన్ దృష్టికి వారు తీసుకెళ్లారు. మేనిఫెస్టో ప్రతులను పంచాయతీల్లో పంచేందుకు టీడీపీ చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని.. నిబంధనలు ఉల్లంఘించిన చంద్రబాబు, ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వారి ఫిర్యాదుపై స్పందించిన ఈసీ శనివారం నోటీసులు జారీచేసింది. ‘పల్లె ప్రగతి–పంచసూత్రాలు’ పేరుతో ప్రచురించిన ఎన్నికల మేనిఫెస్టోను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గురువారం విడుదల చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment