నకిలీ పత్రాలతో కాజేసేందుకు యత్నం
50 మంది రౌడీలతో వచ్చి రాత్రికి రాత్రే నిర్మాణాల కూల్చివేత
మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అల్లుడు దౌర్జన్యం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు
సాక్షి టాస్క్‌ఫోర్స్: తిరుపతి మండలం శ్రీనివాసపురానికి చెందిన తన భూమిని కాజేసేందుకు టీడీపీ నాయకులు కుట్ర పన్నారని, అందులో నిర్మాణంలో ఉన్న దుకాణాన్ని 50 మంది రౌడీలతో వచ్చి అర్ధరాత్రి కూల్చివేశారని రిటైర్డ్ డీఎస్పీ భాస్కర్‌నాయుడు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం భాస్కర్‌నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. శ్రీనివాసపురానికి చెందిన తాను 2012లో జిలకర సూర్యనారాయణ వద్ద సర్వే నంబర్ 255/1బిలో 21 సెంట్లను కొనుగోలు చేశానని తెలిపారు.
అయితే, అప్పటి మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ బినామీ పాండురంగ మొదలియార్ నకిలీ పత్రాలతో భూమిని కాజేసేందుకు కుట్రపన్నాడని తెలిపారు. ఆ భూమిపై 1974లో ఒక కేసు, 1991లో రెండు కేసులు, 2013లో ఒక కేసు కోర్టులో వేశారని, ఆ కేసుల్లో తీర్పు తమకే అనుకూలంగా వచ్చిందని భాస్కర్‌నాయుడు తెలిపారు.
ఆపై మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అల్లుడు సంజయ్, అతని తమ్ముడు చాణక్య హైకోర్టులో తప్పుడు పత్రాలతో స్టేటస్‌కో తెచ్చారన్నారు. అధికారులను తప్పుదోవ పట్టించి ఇదే సర్వే నంబర్‌పై తప్పుడు పట్టాను పొందడంతో వీరితో పాటు అప్పటి ఇనాం డీటీ వరప్రసాద్, ఆర్డీవో బాబయ్యపై చిత్తూరు 2టౌన్లో క్రిమినల్ కేసులు సైతం నమోదైనట్టు తెలిపారు.
అర్థరాత్రి అక్రమంగా కూల్చివేత
కాగా.. ఆ స్థలంలో దుకాణం నిర్మాణాన్ని చేపట్టగా.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అల్లుడు సంజయ్, అతని తమ్ముడు చాణక్య, విజయ్ (విజ్జు) నిర్మాణాల వద్దకు వచ్చారని భాస్కర్‌నాయుడు తెలిపారు. ఆ భూమి తమదంటూ దౌర్జన్యానికి దిగడంతో పోలీసులను ఆశ్రయించినట్టు చెప్పారు. పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులు పత్రాలను పరిశీలించి ఆ భూమి తనదేనని తేల్చిచెప్పారన్నారు. ఈ క్రమంలో మంగళవారం మరోసారి టీడీపీ నాయకులు అక్కడకు చేరుకుని దౌర్జన్యానికి పాల్పడినట్టు బాధితుడు తెలిపారు.
మంగళవారం అర్ధరాత్రి సుమారు 50 మంది రౌడీలతో సంజయ్, చాణక్య, విజయ్ ఆ స్థలంలో నిర్మాణాన్ని అక్రమంగా కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. డయల్ 100కు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకోకుండా వారికే వత్తాసు పలికారని ఆరోపించారు. కాగా, జరిగిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు తిరుపతి రూరల్ ఇన్‌స్పెక్టర్ చిన్న గోవింద్ తెలిపారు.
‘టీడీపీ వాడినైనా గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టలేదు’
తాను డీఎస్పీగా పనిచేస్తున్నప్పటికీ మొదటినుంచీ తాను టీడీపీకి మద్దతుదారుడిగా ఉన్నానని రిటైర్డ్ డీఎస్పీ భాస్కర్‌నాయుడు చెప్పారు. టీడీపీ అంటే ఎంతో అభిమానం అని.. పసుపు చొక్కా వేసుకోకపోయినా టీడీపీ కోసం పనిచేసినట్టు తెలిపారు. 1992 నుంచి టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్న తనకు ప్రస్తుతం టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అల్లుడు సంజయ్, చాణక్య, విజయ్ మంచి బహుమతి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తాను ప్రహరీ నిర్మాణం, దుకాణ నిర్మాణం, త్రీఫేజ్ విద్యుత్ కనెక్షన్లు పొందానని, అప్పటి అధికార పార్టీ నాయకులు ఏనాడూ తనను ఇబ్బంది పెట్టలేదని చెప్పారు. టీడీపీ మద్దతుదారుడిగా ఉన్నప్పటికీ తన భూమిని టీడీపీ నాయకులే కబ్జా చేసేందుకు యత్నించడం దారుణమన్నారు. తనకు ప్రభుత్వం, అధికారులు న్యాయం చేయాలని వేడుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment