మంత్రి కొండా సురేఖ ఆదేశాలు
బీఆర్‌ఎస్ హయాంలో అనర్హులకు కేటాయించినట్టు ఆరోపణలు
కొత్తగా పోడు భూములు ఆ«దీనంలో తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
పోడు భూముల సమస్యపై సమీక్షా సమావేశం
హాజరైన మరో మంత్రి సీతక్క
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏళ్ళుగా పోడు సాగు చేసుకుంటున్న రైతు కుటుంబాల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని అటవీ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ భరోసానిచ్చారు. అయితే చట్టాలకు విరుద్ధంగా కొత్తగా పోడు భూములను ఆ«దీనంలోకి తీసుకున్నట్లయితే కఠినచర్యలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ హయాంలో అనర్హులకు పోడు భూముల కేటాయింపు జరిగిన విషయం తమ దృష్టికి వచి్చన నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన పోడు భూముల పంపిణీపై నివేదికను సమరి్పంచాలని అటవీశాఖ ఉన్నతాధికారులను మంత్రి సురేఖ ఆదేశించారు.
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కాల్పోల్ గ్రామంలో ఎఫ్‌ఆర్‌ఓ, సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్‌లపై గిరిజనులు చేసిన దాడిని మంత్రి ప్రస్తావించారు. పోడు సాగుచేసుకుంటున్న రైతు కుటుంబాలు అటవీశాఖ అధికారులకు ఎలాంటి హానీ తలపెట్టవద్దని, దాడులకు దిగితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. శనివారం సచివాలయంలో మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో పోడు భూముల సమస్యలపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. పోడు సమస్యకు పరిష్కారం వెదకాలని సీతక్క పలుమార్లు చెప్పగా, అదే విషయాన్ని మంత్రి కొండా సురేఖ ప్రస్తావిస్తూ ఏళ్ళుగా కొనసాగుతున్న పోడు భూముల చిక్కు సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు ఈ సమావేశాన్ని ప్రాథమిక సమావేశంగా భావిస్తున్నామని వ్యాఖ్యానించారు.
ఛత్తీస్‌గఢ్ నుంచి వలసలను నివారించండి
ఛత్తీసగఢ్ నుంచి రాష్ట్రంలోకి వస్తున్న గిరిజనులు అటవీ భూములను ఆక్రమించుకుంటున్న విషయాన్ని అధికారులు మంత్రులకు వివరించారు. దీనికి మంత్రులు స్పందిస్తూ, ‘‘పక్క రాష్ట్రాల నుంచి గిరిజనులు మన ప్రాంతానికి వస్తే ఇక్కడ ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటాయి. భవిష్యత్‌లో ఇలాంటి వలసలు కొనసాగకుండా కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి కచి్చతమైన మార్గదర్శకాలను రూపొందించాలి. ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలు దెబ్బతినకుండా చూడాలి’’అని అధికారులను ఆదేశించారు.
అభివృద్ధి పనులు కొనసాగించండి: సీతక్క
అటవీ ప్రాంతాల్లో కొత్తగా వెలుస్తున్న గ్రామాల్లో అభివృద్ధి పనులకు అటవీశాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసినా, ఏళ్ళుగా కొనసాగుతున్న గ్రామాల్లో అభివృద్ధి పనులను కొనసాగించేలా అధికారులకు ఆదేశాలివ్వాలని మంత్రి కొండా సురేఖను మంత్రి సీతక్క కోరారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, పథకాల అమలులో అటవీశాఖ మార్గదర్శకాలు ప్రతిబంధకాలుగా మారుతున్న నేపథ్యంలో... ఈ దిశగా కేంద్రంతో సంప్రదింపులు జరిపి పోడు భూముల సమస్యపై పరిష్కారాన్ని రాబట్టేలా చర్యలు చేపట్టాలని కోరారు.
అటవీ భూములను కాపాడుకుంటూనే, పోడు రైతులకు ప్రయోజనం కలిగేలా పోడు భూముల్లో ఉద్యానవన శాఖ మొక్కల పెంపకం వంటి కార్యక్రమాలు చేపట్టి వారికి ప్రయోజనాలను కలిగించాలని ఆమె కోరారు. ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా పలు రకాల మొక్కలను పెంచడం, పామాయిల్ చెట్ల సాగు వంటి చర్యల ద్వారా పోడు రైతులకు ప్రయోజనాలను కలిగించవచ్చని సురేఖ అధికారులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment