సాక్షి, హైదరాబాద్: అటవీ సంపదను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అడుగులు వేస్తోంది. స్మగ్లింగ్, అటవీ భూముల ఆక్రమణ, వన్యసంపద పరిరక్షణకు అటవీ శాఖతోపాటు పోలీస్ శాఖ కూడా రంగంలోకి దిగాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. దీనితో పోలీస్ ఉన్నతాధికారులు ఆమేరకు కార్యాచరణను రూపొందిస్తున్నారు.
జాయింట్ చెక్‌పోస్టులు..
రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రధానంగా అటవీ ప్రాంతం ఎక్కువగా విస్తరించి ఉంది. కలప స్మగ్లింగ్, వన్యప్రాణుల వధ జరుగుతున్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లో జాయింట్ యాక్షన్ ప్లాన్ రూపొందించాలని నిర్ణయించారు. ఆటవీ శాఖ–పోలీస్ శాఖ సంయుక్తంగా చెక్‌పోస్టులు నిర్వహించేందుకు ప్రణాళిక తయారుచేశారు. ఇందులో భాగంగా ప్రస్తుతమున్న చెక్‌పోస్టుల్లో నిర్వహణ లోపాలు, సిబ్బంది కొరత ఉండటంతో పోలీస్ శాఖ ద్వారా వాటిని మానిటరింగ్ చేయాలని నిర్ణయించారు. వరంగల్, హైదరాబాద్ పోలీస్ జోన్ పరిధిలో 54 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోబోతున్నారు.
జాయింట్ చెక్ పోస్టులు
ప్రస్తుతం అటవీ శాఖ నేతృత్వంలో ఉన్న చెక్‌పోస్టుల్లో కేవలం ఇద్దరు లేదా ఒకరు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. టోల్ విధుల్లో కొన్నిచోట్ల ప్రైవేట్ సిబ్బంది ఉండటంతో స్మగ్లర్లకు అవకాశం కలిసివస్తోంది. అయితే ఇక నుంచి ఆధునీకరించబోతున్న చెక్‌పోస్టుల్లో సాయుధ బలగాల సిబ్బంది విధుల్లో ఉండనున్నారు. టోల్ వ్యవహారమంతా అటవీ శాఖ పర్యవేక్షించనుండగా, తనిఖీలు చేయడం, స్మగ్లర్లను గుర్తించి అదుపులోకి తీసుకోవడం మాత్రం పోలీస్ శాఖ చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రతీ చెక్‌పోస్టుకు ముగ్గురు సాయుధ బలగాల సిబ్బంది కాపలా కాయనున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఇంటర్‌సెప్టార్ వాహనాలను సైతం రంగంలోకి దించాలని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇలా ప్రతి జిల్లాలో జాయింట్ చెక్‌పోస్టుల భద్రత కోసం 35మంది సిబ్బందితో రాష్ట్ర వ్యాప్తంగా 400మందిని కేటాయించాలని పోలీస్ శాఖ యోచిస్తోంది.
స్మగ్లర్లు ఎంతమంది?
ఇప్పటివరకు రాష్ట్రంలో స్మగ్లింగ్ కార్యకలాపాలు చేస్తున్న వారు ఎంతమంది? వారి వివరాలు ఏంటన్న దానిపై అటవీ శాఖ వద్ద వివరాలు లేకపోవడం రాష్ట్ర ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించినట్టు తెలిసింది. కనీసం డేటా బేస్ లేకపోవడం ఏంటన్న దానిపై ప్రభుత్వ వర్గాలు అటవీ శాఖ అధికారులను మందలించినట్టు తెలిసింది. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు నమోదు చేసిన కేసుల ఆధారంగా డేటా బేస్ సిద్ధం చేయాలని పోలీస్ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల పోలీసులను ఆదేశించారు. అదేవిధంగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల నుంచి గోదావరి నది దాటి రాష్ట్రం మీదుగా కలప స్మగ్లింగ్ చేస్తున్నట్టు గుర్తించారు. ఆ రెండు రాష్ట్రాల అటవీ, పోలీస్ శాఖల నుంచి కూడా స్మగ్లర్ల వివరాలను కోరుతున్నట్టు సీనియర్ ఐపీఎస్ అధికారి ఒకరు సాక్షితో అభిప్రాయపడ్డారు. దీని ద్వారా అంతర్రాష్ట్ర స్మగ్లర్లతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉంటూ ఇక్కడ కార్యకలాపాలు సాగించే వారి వివరాలు ఇంటిగ్రేటెడ్ చేసేందుకు సులభంగా ఉంటుందని తెలిపారు. గుర్తించిన స్మగ్లర్లపై పీడీ యాక్ట్ పెట్టేందుకు కూడా పోలీస్ శాఖ ప్రభుత్వం నుంచి అనుమతి పొందినట్టు తెలిసింది. కేవలం స్మగ్లింగ్ మాత్రమే కాకుండా అటవీ భూములను ఆక్రమిస్తున్న వారు, వన్యప్రాణులను వేట పేరుతో వధిస్తున్న వారిపై అటవీ యాక్ట్ కేసులతో పాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టంచేశారు.
ఈ ప్రాంతాలే కీలకం...
కాగజ్‌నగర్, జిన్నారం, బెల్లంపల్లి, మంథని, నిర్మల్, ఖానాపూర్, మహదేవపూర్, కాళేశ్వరం, భూపాలపల్లి, ములుగు, వాజేడు, కొత్తగూడెం, పాల్వంచ, ఏటూరునాగారం, నాగర్‌కర్నూల్, నర్సాపూర్ డివిజన్లలో చెక్‌పోస్టులు ఏర్పాటుచేయడం, ఉన్న వాటిని ఆధునీకరించి సీసీటీవీలు, కమాండ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది. అదే విధంగా ఆయా డివిజన్లలోని అటవీ శాఖ అధికారులతోపాటు స్థానిక సబ్‌ఇన్‌స్పెక్టర్లు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, డీఎస్పీలు నేరుగా రంగంలోకి దిగేలా ఆదేశాలిస్తున్నట్టు తెలుస్తోంది. అడవుల్లో స్పెషల్ పార్టీ పోలీసులతో పాటు ఇంటెలిజెన్స్ బృందాలు స్మగ్లర్ల వివరాలను గుర్తించి ఈ బృందాలను అప్రమత్తం చేసేలా సమాచార వ్యవస్థ, ఈ వ్యవస్థను మాని టరింగ్ చేసేందుకు జిల్లా అటవీ శాఖాధికారి, జిల్లా ఎస్పీ పనిచేయనున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment