సాక్షి, అమరావతి : అక్రమంగా రవాణా అవుతూ ఇతర రాష్ట్రాల్లో పట్టుబడిన ఎర్రచందనం దుంగలు ఏపీలోనివే కాబట్టి వాటిలో తమకూ వాటా ఉంటుందని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. స్మగ్లింగ్ చేస్తుండగా వివిధ రాష్ట్రాల్లో పట్టుకున్న ఎర్రచందనాన్ని వేలం వేసినప్పుడు వచ్చిన సొమ్ములో సగం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. దీనిపై ఇప్పటికే కేంద్ర అటవీ శాఖ, ఇతర రాష్ట్రాల అటవీ శాఖాధికారులతో సంప్రదింపులు జరిపింది. కేంద్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 14న తిరుపతిలో జరిగే అన్ని రాష్ట్రాల ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్టŠస్ (పీసీసీఎఫ్)ల సమావేశంలో దీనిపై చర్చ జరగనుంది.
శేషాచలం అడవుల్లో పెరిగే ఎర్ర చందనం చెట్లు ప్రపంచంలో మరెక్కడా ఉండవు. ప్రత్యేకమైన వాతావరణంలో పెరిగే ఈ వృక్షాలు అత్యంత అరుదైనవి. ఇతర ప్రాంతాల్లోనూ ఎర్రచందనం పెరుగుతుంది. కొన్ని చోట్ల తోటల్లో కూడా పెంచుతారు. అయితే, శేషాచలం చెట్లతో పోల్చితే అవి నాసిరకం. వీటిని సి గ్రేడ్‌గా పిలుస్తారు. అత్యంత నాణ్యంగా ఉండే ఎ గ్రేడ్ ఎర్రచందనం శేషాచలంలోనిదే. దీనికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది.
అందుకే ఈ చెట్లను అక్రమంగా నరికి విదేశాలకు, ముఖ్యంగా చైనా, థాయ్‌లాండ్ తదితర దేశాలకు స్మగ్లింగ్ చేస్తారు. ఈ వేలంలో విదేశీ కంపెనీలు కూడా పాల్గొంటాయి. వీటి ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంది. ఈ ఎర్రచందనం ఏపీలో పెరిగిన అరుదైన వృక్షజాతి కాబట్టి అది దేశంలో ఎక్కడ దొరికినా అందులో సగం ఇవ్వాలని రాష్ట్రం కోరుతోంది. అవసరమైతే వేలం వేసే దుంగల్ని పరిశీలించి ఎక్కడివో నిర్ధారించాలని సూచించింది.
దుంగలను చూడగానే అది ఎక్కడిదో చెప్పవచ్చని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏ గ్రేడ్ సరుకు అయితే ఎక్కువ వెడల్పు, ఎక్కువ బరువుతోపాటు లోపల ఎర్ర రంగు ఉంటుంది. ప్రస్తుతం మన రాష్ట్రం వద్ద 5,376 టన్నుల ఎర్రచందనం దుంగలు ఉండగా, ఇతర రాష్ట్రాలు, సంస్థల వద్ద సుమారు 8 వేల టన్నులు ఉంది. బయట ఉన్న సరుకులో సగం వాటా మనకు వస్తే దాదాపు రూ. 2 వేల కోట్ల ఆదాయం లభించే అవకాశం ఉంది.
50 శాతం వాటా అడుగుతున్నాం
ఇతర రాష్ట్రాల్లో సీజ్ చేసిన ఎర్రచందనంలో సగం ఏపీకి ఇవ్వాలని కేంద్ర అటవీ శాఖను కోరుతున్నాం. త్వరలో జరిగే జాతీయ స్థాయి సమావేశంలో దీనిపై గట్టిగా పట్టుబడతాం. దేశంలో అక్రమంగా రవాణా అవుతూ దొరికిన సరుకంతా ఇక్కడిదే. దాన్ని చూడగానే చెప్పొచ్చు. అందుకే దానిపై మన రాష్ట్రానికి హక్కు ఉంటుంది.
– మధుసూదన్ రెడ్డి, అటవీదళాల అధిపతి, పీసీసీఎఫ్
Comments
Please login to add a commentAdd a comment