‘భూ మండలంలో యాడా పెరగని చెట్టు మన శేషాచలం అడవుల్లో పెరగుతుండాది. ఈడ నుంచి వేల కోట్ల సరుకు విదేశాలకు ఎళ్తుండాది. గోల్డ్ రా ఇది. భూమిపై పెరిగే బంగారం పేరు ఎర్ర చందనం’ పుష్ప సినిమాలోని ఈ డైలాగ్ ప్రపంచమంతా ట్రెండింగ్ అయ్యింది.
నిజంగా ఎర్ర చందనానికి ఉండే క్రేజ్ అలాంటిది మరి. చైనాలో అయితే.. ఎర్ర చందనంతో చేసిన కుర్చీ రూ.2 కోట్ల ధర పలుకుతోందట. ఈ మధ్య చైనా వెళ్లిన ఏపీ అటవీ శాఖ అధికారులకు అక్కడ ఎర్ర చందనం ధరలు తెలిసి మతిపోయినంత పనైందట.
ఎర్ర చందనానికి చైనాలో ఉన్న మోజు అంతా ఇంతా కాదు. తమ ఇళ్లలో ఆ కలపతో చేసిన ఫర్నిచర్, గృహాలంకరణ వస్తువులు ఉండటం చాలా గొప్పగా భావిస్తారు. అందుకే ధర ఎంతైనా ఎర్ర చందనంతో తయారు చేసిన వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. బీజింగ్‌లోని ఓ ఫర్నిచర్ షాపులో ఎర్ర చందనంతో చేసిన డైనింగ్ టేబుల్ ధర రూ.7 కోట్లు. ఒక సోఫా సెట్ రేటు రూ.5 కోట్లు. కుర్చీ ధర రూ.2 కోట్లు.
ఎర్ర చందనం మార్కెట్‌పై అధ్యయనం చేసేందుకు ఇటీవల చైనా వెళ్లిన మన రాష్ట్ర అటవీ శాఖాధి కారులు అక్కడి రేట్లు చూసి నివ్వెరపోయారు. మన రాష్ట్రంలో ఎర్ర చందనం అక్రమ రవాణా ఎందుకు జరుగుతుందో, దాని కోసం స్మగ్లర్లు ప్రాణాలకు తెగించి మరీ ఎందుకు రిస్కు తీసుకుంటారో చైనాలోని ఫర్నిచర్ షాపుల్లోని వస్తువుల ధర చూసి అధికారులకు అవగతమైంది.
గ్రేడ్‌లను బట్టి రేటు
అంతర్జాతీయ మార్కెట్‌లో ఎర్ర చెక్క సి గ్రేడ్ అయితే టన్ను రూ.30 లక్షలు ఉంటుంది. మధ్యస్థంగా ఉంటే రూ.45 లక్షలు పలుకుతుంది. నాణ్యమైన ఏ గ్రేడ్ చెక్క అయితే రూ.75 లక్షల నుంచి రూ.కోటి వరకు పలుకుతుంది. చైనా వ్యాపారులు, అంతర్జాతీయ స్మగ్లర్లు ఈ ధరకు ఎర్ర చందనాన్ని కొనుగోలు చేస్తారు.
జపాన్, మయన్మార్ వంటి తూర్పు ఆసియా దేశాల్లో దీనికి డిమాండ్ ఉంది. అందుకే ప్రాణాలకు తెగించి శేషాచలం అడవుల్లో స్మగ్లర్లు ఆ చెట్లు నరకడానికి ప్రయత్నాలు చేస్తారు. గత కొన్నేళ్లుగా అక్రమ రవాణాను అడ్డుకుని సీజ్ చేసిన 8 వేల టన్నుల ఎర్ర చందనం దుంగల్ని గతంలో అటవీ శాఖ వేలం వేసింది.
ఇంకా 5,400 టన్నుల కలప ఉండగా రెండు నెలల క్రితం వేలం వేసి 320 టన్నుల్ని వేలం ద్వారా విక్రయించగా రూ.170 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ఇంకా 5,100 టన్నుల కలపను త్వరలో వేలం వేయనున్నారు.
త్వరలో గ్లోబల్ టెండర్లు పిలుస్తాం
చైనాలో ఎర్ర చందనం వస్తువులకు మహా మోజు ఉంది. అక్కడి మార్కెట్ గురించి అధ్యయనం చేశాం. అందుకు అనుగుణంగా అటవీ శాఖ వద్ద ఉన్న కలపను వేలం వేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. తొలిసారి వేలంలో మంచి రేటు వచ్చింది. వచ్చే నెలలో మిగిలిన 5 వేల టన్నులకుపైగా దుంగల్ని వేలం వేసేందుకు మరోసారి గ్లోబల్ టెండర్లు పిలుస్తాం. ఎంఎస్‌టీసీ ద్వారా ఇంటర్నేషనల్ కాంపిటీటివ్ బిడ్డింగ్ నిర్వహిస్తాం. మంచి రేటు వచ్చే అవకాశం ఉంది.
– మధుసూదన్‌రెడ్డి, అటవీ దళాల అధిపతి, పీసీసీఎఫ్
ఎంత ఎర్రగా ఉంటే అంత నాణ్యం
ఈ డిమాండ్‌కు అనుగుణంగా ఆ చెట్లను ఇష్టానుసారం నరికి అక్రమంగా రవాణా చేస్తుండటంతో ఎర్ర చందనం వృక్షాలు అంతరిస్తున్న జాబితాలోకి చేరాయి. అందుకే మన ప్రభుత్వం అడవుల్లో చెట్లను నరకడం చట్ట విరుద్ధంగా పేర్కొంది. అయినా అది సరిహద్దులు దాటిపోతూనే ఉంది.
శేషాచలం అడవుల్లో సుమారు 5 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఎర్ర చందనం చెట్లు ఉన్నాయని అంచనా. అవి ఎక్కడపడితే అక్కడ పెరగవు. వాటికి అంతా అనుకూలంగా ఉన్నచోట తొలి మూడేళ్లు వేగంగా పెరుగుతాయి. ఆ తర్వాత నెమ్మదిగా పెరుగుతుంటాయి. కనీసం 30 సంవత్సరాలకు గానీ మధ్యలోని చెక్క రంగు ఎరుపు రంగులోకి మారదు.
అదే వంద నుంచి రెండు వందల సంవత్సరాలపాటు పెరిగితే లోపలి భాగం మరింత ఎర్రగా, వెడల్పుగా ఉంటుంది. కాబట్టి చెట్టుకు ఎన్నేళ్లుంటే అది అంత ఖరీదు. శేషాచలం అడవుల నేలలో అమ్ల శాతం, పోషకాలు, నీరు ఈ చెట్లు పెరగడానికి సరిపోతాయి.
ఆ నేలలో ఉండే క్వార్ట్జ్ రాయి కూడా ఈ చెట్లు పెరగడానికి దోహదపడుతుంది. ఇక్కడ నేలలో ఉన్న సమ్మేళనం మరెక్కడా ఉండదని, నేలతోపాటు వాతావరణం అవి పెరగడానికి దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు.
– సాక్షి, అమరావతి
Comments
Please login to add a commentAdd a comment