సాక్షి, అమరావతి: అంతర్జాతీయ డిమాండ్ ఉన్న ఎర్రచందనం విక్రయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల రూ.182 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లడంతో అనుకున్న దానికంటే ఎక్కువ ఆదాయం వచ్చింది. గత ప్రభుత్వాల హయాంలో అమ్మగా మిగిలిన 318 మెట్రిక్ టన్నుల దుంగలకు ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధిసంస్థ (ఏపీఎఫ్‌డీసీ) ద్వారా కొద్దిరోజుల కిందట విడతల వారీగా గ్లోబల్ టెండర్లు పిలిచి వేలం నిర్వహించారు. గతం కంటే డిమాండ్ బాగుండడంతో సుమారు రూ.100 కోట్ల ఆదాయం లభిస్తుందని మొదట అధికారులు భావించారు. చైనా ఇతర దేశాల మార్కెట్‌లో ఈ దుంగలకు మంచి ధర ఉండడంతో 80 శాతం ఎక్కువ ఆదాయం లభించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం పదేళ్ల కిందట రాష్ట్రానికి ఇచ్చిన ఎర్రచందనం అమ్మకాల కోటా పూర్తయింది.
10 ఏళ్లలో 8,498 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం అమ్మకం
ఎర్రచందనం అమ్మకానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఆయా రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న సరుకును బట్టి కేంద్రం రాష్ట్రాలకు అమ్మకపు కోటా నిర్దేశిస్తుంది. 10 సంవత్సరాల కిందట రాష్ట్ర కోటా కింద 8,498 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం అమ్మకానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. 2019 వరకు విడతల వారీగా గత ప్రభుత్వాల హయాంలో 8,180 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం దుంగలను విక్రయించారు. ఈ అమ్మకాలతో సుమారు రూ.1,700 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ తర్వాత కేంద్రం నిర్దేశించిన కోటాలో మిగిలిన 318 టన్నుల్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల రూ.182 కోట్లకు అమ్మారు. దీంతో కేంద్రం ఇచ్చిన కోటా పూర్తయింది. ప్రస్తుతం అటవీశాఖ ఆధీనంలో ఇంకా 5,376 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం ఉంది.
శేషాచలం అడవుల్లో అక్రమంగా నరికి స్మగ్లింగ్ చేస్తున్న ఎర్ర చందనం దుంగల్ని అటవీశాఖ ఇటీవల కాలంలో భారీఎత్తున పట్టుకుని సీజ్ చేసింది. ఈ సరుకును అటవీశాఖ ఆధీనంలోని తిరుపతి సెంట్రల్ గోడౌన్‌లో భద్రపరిచారు. కేంద్రం కొత్త కోటా నిర్దేశిస్తే ఈ సరుకును కూడా అమ్మడానికి అటవీశాఖ సిద్ధంగా ఉంది. ఇప్పటికే తమ వద్ద ఉన్న ఎర్ర చందనం నిల్వల గురించి చెప్పి అమ్మకానికి అనుమతి ఇచ్చే కొత్త కోటా నిర్దేశించాలని కేంద్ర అటవీ మంత్రిత్వశాఖను కోరింది. గతంలో కేటాయించిన కోటాకు సంబంధించిన వివరాలను మిగిలిన రాష్ట్రాలు పూర్తిగా ఇవ్వకపోవడంతో కొత్త కోటాను నిర్దేశించడానికి కేంద్రం జాప్యం చేస్తోంది. ఈ నేపథ్యంలో గత కోటా ప్రకారం పారదర్శకంగా విక్రయాలు జరిపిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాలకు కొత్త కోటా ఇవ్వాలని ఏపీ అటవీశాఖ కోరింది.
318 టన్నుల ఎర్రచందనం.. రూ.182 కోట్ల ఆదాయం
Published Wed, Jul 14 2021 4:53 AM | Last Updated on Wed, Jul 14 2021 4:53 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment