red sandal wood
-
318 టన్నుల ఎర్రచందనం.. రూ.182 కోట్ల ఆదాయం
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ డిమాండ్ ఉన్న ఎర్రచందనం విక్రయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల రూ.182 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లడంతో అనుకున్న దానికంటే ఎక్కువ ఆదాయం వచ్చింది. గత ప్రభుత్వాల హయాంలో అమ్మగా మిగిలిన 318 మెట్రిక్ టన్నుల దుంగలకు ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధిసంస్థ (ఏపీఎఫ్డీసీ) ద్వారా కొద్దిరోజుల కిందట విడతల వారీగా గ్లోబల్ టెండర్లు పిలిచి వేలం నిర్వహించారు. గతం కంటే డిమాండ్ బాగుండడంతో సుమారు రూ.100 కోట్ల ఆదాయం లభిస్తుందని మొదట అధికారులు భావించారు. చైనా ఇతర దేశాల మార్కెట్లో ఈ దుంగలకు మంచి ధర ఉండడంతో 80 శాతం ఎక్కువ ఆదాయం లభించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం పదేళ్ల కిందట రాష్ట్రానికి ఇచ్చిన ఎర్రచందనం అమ్మకాల కోటా పూర్తయింది. 10 ఏళ్లలో 8,498 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం అమ్మకం ఎర్రచందనం అమ్మకానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఆయా రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న సరుకును బట్టి కేంద్రం రాష్ట్రాలకు అమ్మకపు కోటా నిర్దేశిస్తుంది. 10 సంవత్సరాల కిందట రాష్ట్ర కోటా కింద 8,498 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం అమ్మకానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. 2019 వరకు విడతల వారీగా గత ప్రభుత్వాల హయాంలో 8,180 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం దుంగలను విక్రయించారు. ఈ అమ్మకాలతో సుమారు రూ.1,700 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ తర్వాత కేంద్రం నిర్దేశించిన కోటాలో మిగిలిన 318 టన్నుల్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల రూ.182 కోట్లకు అమ్మారు. దీంతో కేంద్రం ఇచ్చిన కోటా పూర్తయింది. ప్రస్తుతం అటవీశాఖ ఆధీనంలో ఇంకా 5,376 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం ఉంది. శేషాచలం అడవుల్లో అక్రమంగా నరికి స్మగ్లింగ్ చేస్తున్న ఎర్ర చందనం దుంగల్ని అటవీశాఖ ఇటీవల కాలంలో భారీఎత్తున పట్టుకుని సీజ్ చేసింది. ఈ సరుకును అటవీశాఖ ఆధీనంలోని తిరుపతి సెంట్రల్ గోడౌన్లో భద్రపరిచారు. కేంద్రం కొత్త కోటా నిర్దేశిస్తే ఈ సరుకును కూడా అమ్మడానికి అటవీశాఖ సిద్ధంగా ఉంది. ఇప్పటికే తమ వద్ద ఉన్న ఎర్ర చందనం నిల్వల గురించి చెప్పి అమ్మకానికి అనుమతి ఇచ్చే కొత్త కోటా నిర్దేశించాలని కేంద్ర అటవీ మంత్రిత్వశాఖను కోరింది. గతంలో కేటాయించిన కోటాకు సంబంధించిన వివరాలను మిగిలిన రాష్ట్రాలు పూర్తిగా ఇవ్వకపోవడంతో కొత్త కోటాను నిర్దేశించడానికి కేంద్రం జాప్యం చేస్తోంది. ఈ నేపథ్యంలో గత కోటా ప్రకారం పారదర్శకంగా విక్రయాలు జరిపిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాలకు కొత్త కోటా ఇవ్వాలని ఏపీ అటవీశాఖ కోరింది. -
రాబడి పెరగాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ‘నవరత్నాలు’, సంక్షేమ పథకాల అమలుతోపాటు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వంపై ఉన్నందున ఆదాయ మార్గాల పెంపుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగానికి సూచించారు. ప్రజలపై భారం మోపకుండా రాబడి పెంచడానికి ఉన్న ప్రతి అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఆదాయ ఆర్జన శాఖలు, సంస్థల అధికారులతో గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఎక్కడెక్కడ దృష్టి పెడితే ఆదాయం పెరుగుతుందో ఆలోచించుకుని తరచూ సమీక్షించుకుంటూ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకుని ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు. సంక్షేమ పథకాల ద్వారా పేదలు, అల్పాదాయ వర్గాల ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులు మెరుగు పరచాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని నొక్కి చెప్పారు. వీటితోపాటు అభివృద్ధి పనులకు కూడా నిధులు అవసరమైనందున ఆదాయ మార్గాలు అన్వేషించాలన్నారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. బొగ్గు, మైనింగ్‌పై ప్రత్యేక దృష్టి ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్ రాష్ట్రాల్లో టెండర్ల ద్వారా కైవసం చేసుకున్న బ్రహదిహ, సులియారీ, మదన్‌పూర్ సౌత్ బొగ్గు బ్లాకుల్లో నిర్ణీత సమయంలో మైనింగ్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రణాళికా బద్ధంగా చర్యలను వేగవంతం చేయాలి. – రాష్ట్రానికి అధిక ఆదాయం వచ్చే మైనింగ్ కార్యకలాపాలపై మరింత అధికంగా దృష్టి నిలపాలి. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ), ఇతర విభాగాలను సమన్వయం చేసుకుని త్వరితగతిన సిలికా శాండ్ కార్యకలాపాలు ప్రారంభించాలి. పారదర్శకంగా ఎర్రచందనం విక్రయం – రాష్ట్రంలో ఉన్న ఎర్రచందనం నిల్వలను విక్రయించేందుకు త్వరితగతిన కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చేందుకు ప్రయత్నించాలి. ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా ఎర్రచందనం విక్రయించాలి. – ఇందుకు సంబంధించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. ప్రజలపై భారం వేయకుండా ఆదాయ వనరులను పెంచుకునేందుకు అవసరమైన ప్రణాళికలతో అధికారులు సిద్ధంగా ఉండాలి. – ఆదాయం వచ్చే అంశాలపై అధ్యయనం చేసి, మరింత శ్రద్ధతో పని చేయాలి. నిరంతరం సమీక్షలు నిర్వహించుకుంటూ ఎప్పటికప్పుడు అంచనాలు సిద్ధం చేసుకోవాలి. – గత ఆర్థిక ఏడాది కంటే ఈ ఏడాది రూ.1,800 కోట్ల ఆదాయం తగ్గినప్పటికీ, పరిస్థితి మెరుగు పడుతోందని అధికారులు సీఎంకు వివరించారు. గత ఏడాది ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల్లో కోవిడ్ కారణంగా ఆదాయం తగ్గినప్పటికీ, ఆగస్టు నుంచి ఆదాయం పెరిగిందన్నారు. రెండు మూడు నెలల్లో లక్ష్యం మేరకు ఆదాయం వస్తుందని చెప్పారు. – ఈ సమీక్షలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజిత్ భార్గవ, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, అటవీ శాఖ కార్యదర్శి విజయ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. గత ఆర్థిక ఏడాదితో పోలిస్తే ఈ ఆర్థిక ఏడాది కోవిడ్ కారణంగా రూ.1,800 కోట్లకుపైగా ఆదాయం తగ్గింది. మరో వైపు వివిధ పథకాల అమలు వల్ల ఖర్చు పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలపై భారం వేయకుండానే రాబడి పెరిగేలా మార్గాలన్నింటినీ అన్వేషించాలి. దిశ చట్టం విప్లవాత్మక పరిణామం: సీఎం జగన్ విశాఖ ఉక్కుపై ప్రధానికి సీఎం జగన్ లేఖ -
రూ.37 లక్షల ఎర్రచందనం స్వాధీనం
సాక్షి, చిత్తూరు(కేవీబీపురం) : రెండు వాహనాలతో సహా రూ.37 లక్షలు విలువచేసే 33 ఎర్రచందనం దొంగలను కేబీపురం పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. పుత్తూరు డీఎస్పీ మురళీధర్ మీడియాకు తెలిపిన వివరాలు..మండలంలోని జ్ఞానమ్మకండ్రిగ, బంగారమ్మ కండ్రిగ గ్రామాల నడుమ మారుమూల ప్రాంతం నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నట్టు స్థానిక పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు నిఘా ఉంచారు. వేకువ జామున టీఎన్ 07 బీవీ 6699 నంబరు కలిగిన ఇన్నోవా వాహనంపై ఎస్ఐ గోపి తన సిబ్బందితో దాడి చేశారు. ఇన్నోవాను, తమిళనాడుకు చెందిన ఇన్నోవా డ్రైవర్ కార్తీక్ అదుపులోకి తీసుకున్నారు.అలాగే ఆ వాహనానికి పైలెట్లుగా వ్యవహరిస్తున్న కేవీబీపురానికి చెందిన కరుపారెడ్డి బాలా(23), పురుషోత్తం(20) నుంచి రెండు బైక్‌లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇన్నోవాను పరిశీలించగా అందులో 33 ఎర్రచందనం దుంగలు ఉన్నట్టు గుర్తించారు. ఎర్ర దుంగల స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న మరికొందరి పేర్లను ప్రాథమిక విచారణలో నిందితుల నుంచి తెలుసుకున్నారు. వ్యసనాలు, జల్సాలకు అలవాటు పడిన యువకులు స్మగ్లర్ల ప్రలోభాలకు లొంగిపోయి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని, ముఖ్యంగా మండలంలోని కొన్ని గ్రామాల నుంచి ఎర్రచందనం స్మగ్లర్లకు సహకారం అందుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని డీఎస్పీ చెప్పారు. వారిపై ఇప్పటికే నిఘా ఉంచినట్లు పేర్కొన్నారు. దాడుల్లో ఎస్ఐతోపాటు పాల్గొన్న హెడ్ కానిస్టేబుల్ జయరామిరెడ్డి, సిబ్బంది నరేష్, రాజా, చిరంజీవి, దాము, గంగాధర్‌ను డీఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో పుత్తూరు రూరల్ సీఐ ఈశ్వర్, ఫారెస్ట్ అధికారులు ఎఫ్ఎస్ఓ చక్రపాణి, ఎఫ్బీఓ వేణుగోపాల్, బీట్ ఆఫీసర్లు మస్తాన్, కేవీబీపురం పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఇదలా ఉంచితే, తొలుత డీఎస్పీ, పోలీస్ స్టేషన్లో రికార్డులను పరిశీలించారు. పుత్తూరులో రూ.18లక్షల ‘ఎర్ర’దుంగలు.. పుత్తూరు : ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న సంఘటన పుత్తూరులో చోటుచేసుకుంది. ఫారెస్ట్ రేంజర్ సుబ్రమణ్యం కథనం... మండలంలో తడుకు ఫారెస్ట్ బీట్ పరిధిలోని మూలకోన నుంచి ఎర్రచందనంను అక్రమంగా తరలించేందుకు స్మగ్లర్లు సిద్ధమవుతున్నారని సమాచారం అందడంతో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గంగాధరం నేతృత్వంలో అటవీశాఖ అధికారులు నిఘా ఉంచారు. మంగళవారం వేకువజామున మూలకోనలో స్మగ్లర్లపై దాడులు చేశారు. అటవీ అధికారులను గమనించిన స్మగ్లర్లు దుంగలను పడేసి పరారయ్యారు. సంఘటన స్థలంలో 40 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పరారైన నిందితులు మండలంలోని నేసనూరుకు చెందిన టి.గంగాధరం, కే.చెంగా రెడ్డి, ఎం.మునిరత్నం, కే.కృష్ణారెడ్డి, కేబీఆర్ పురం గ్రామానికి చెందిన అన్నా లోకనాథం అని ప్రాథమిక విచారణలో గుర్తించారు. స్వాధీనం చేసుకున్న దుంగల బరువు 570 కిలోలు ఉందని, వీటి విలువ దాదాపు రూ.18లక్షలని రేంజర్ చెప్పారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామని ఆయన తెలిపారు. రూ.15లక్షల పైచిలుకు ‘ఎర్ర’దుంగలు... రేణిగుంట : రేణిగుంట మండలం జీవాగ్రం కూడలి వద్ద మంగళవారం తెల్లవారుజామున వాహనం సహా ఎర్రచందనం దుంగలను గాజులమండ్యం పోలీసులు పట్టుకున్నారు. సీఐ అమరనాథరెడ్డి కథనం ... తెల్లవారుజామున 3.30గంటల సమయంలో కూడలి వద్ద వడమాలపేట ఎస్ఐ సునీల్, పోలీసు సిబ్బంది వాహనాలను తనిఖీ చేస్తుండగా చెక్‌పోస్ట్ వైపు నుంచి వస్తున్న టాటా ఏస్ లగేజి ఆటో కొంత దూరంలో ఆగింది. తనిఖీలను గమనించిన ఆటో డ్రైవర్ లగేజి ఆటోను అక్కడే వదిలేసి పరారయ్యాడు. దీంతో పోలీసు సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని ఆటోను పరిశీలించారు. అందులో 44ఎర్రచందనం దుంగలను గుర్తించి వాహనంతో సహా స్వాధీనం చేసుకున్నారు. దుంగలను ఆటోతో సహా ఫారెస్ట్ అధికారులకు అప్పగించి కేసు నమోదు చేశారు. ఎర్రచందనం విలువ రూ.15లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేశారు. ‘ఎర్ర’స్మగ్లర్ల అరెస్ట్ పిచ్చాటూరు : ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు పుత్తూరు డీఎస్పీ మురళీధర్ తెలిపారు. మంగళవారం పిచ్చాటూరు పోలీస్ స్టేషన్లో ఆయన విలేకరులకు తెలిపిన వివరాలు.. గత వారం పిచ్చాటూరు పోలీసులు ముందస్తు సమాచారం మేరకు వెంగళత్తూరులోని కిచ్చా(23) అనే వ్యక్తి ఇంట్లో రవాణాకు సిద్ధంగా ఉంచిన రూ.8 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను దాడి చేసి స్వాధీనం చేసుకోవడం విదితమే. ఆ సమయంలో ఇంట్లో కిచ్చా లేడు. ఈ నేపథ్యంలో అతడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. మంగళవారం కిచ్చాతోపాటు మరో స్మగ్లర్ సంగీతరాజు (27) వేలూరు క్రాస్ వద్ద సంచరిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం సత్యవేడు కోర్టులో వీరిని హాజరు పరచనున్నట్టు డీఎస్పీ చెప్పారు. సమావేశంలో సీఐ ఈశ్వర్, ఎస్ఐ దస్తగిరి, ఏఎస్ఐ సుబ్రమణ్యం నాయుడు, రైటర్ లోకనాథం, హెడ్ కానిస్టేబుల్ సాయిబాబా, కానిస్టేబుళ్లు మురళి, విజయశేఖర్ పాల్గొన్నారు. -
రూ. 4 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం
చిత్తూరు : తమిళనాడులోని కృష్ణగిరి, చిత్తూరు రూరల్ పరిధిలో 196 ఎర్రచందనం దుంగలను పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మూడు వాహనాలను కూడా పోలీసులు సీజ్ చేశారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ. 4 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. -
ఔరా..! ఔషధ పట్టుచీర
సాక్షి, విజయవాడ బ్యూరో: ఎర్రచందనం, శ్రీగంధం నూనె తదితర ఔషధ గుణాల కలయికతో తయారైన పట్టుచీర సింగారించుకుంటే అందం, ఆరోగ్యం కలబోతగా ఉంటుంది. సరిగ్గా ఈ ఆలోచనతోనే అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన డిజైనర్ పెద్దయ్యగారి మోహన్ ఔషధ పట్టు చీర తయారీలో పట్టు సాధించాడు. 10 మంది కార్మికులతో కలసి ఆరు నెలల పాటు శ్రమించి రూ.33 వేల ఖర్చుతో తయారు చేసిన ఈ చేనేత పట్టు చీరను మంత్రి కొల్లు రవీంద్ర సోమవారం విజయవాడలో ఆవిష్కరించారు. రూపకర్త మోహన్ మాట్లాడుతూ.. శేషాచలం అడవుల్లో లభ్యమయ్యే ఎర్రచందనం మొక్కల ముడిసరుకు, శ్రీగంధం నూనెతో పాటు వ్యాధినిరోధక ఔషధాల మిశ్రమాలతో ఈ చీరను తయారుచేసినట్లు వెల్లడించారు. దీనికి ‘సంరక్షణ పట్టుశారీ’గా పేరు పెట్టినట్లు తెలిపారు. -
రూ.కోటి విలువైన ఎర్రచందనం స్వాధీనం
రైల్వేకోడూరు (వైఎస్సార్ జిల్లా) : పోలీసులు, అటవీ అధికారుల సంయుక్త దాడుల్లో రూ.కోటి విలువైన ఎర్ర చందనం దుంగలు పట్టుబడ్డాయి. రైల్వే కోడూరు మండల కేంద్రంలోని జ్యోతినగర్ సమీపంలో శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో పోలీసులు, అటవీ శాఖ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యానును సోదా చేయగా రూ. కోటి విలువైన 109 ఎర్రచందనం దుంగలు కనిపించాయి. వాహన సంబంధీకులు సంఘటన స్థలం నుంచి పరారయ్యారు. ఈ మేరకు వాహనాన్ని, దుంగలను సీజ్ చేశారు. కేసు నమోదు చేసి, పోలీసులకు అప్పగించనున్నట్లు అటవీ రేంజి అధికారి రెడ్డి ప్రసాద్ తెలిపారు. -
చిత్తూరులో భారీగా ఎర్రచందనం స్వాధీనం
-
వెంటాడి.. తుపాకులు ఎక్కుపెట్టి..
ప్రొద్దుటూరు క్రైం : భారీ కంటైనర్‌లో తరలిస్తున్న 120 బీ గ్రేడ్ ఎర్రచందనం దుంగలను ప్రొద్దుటూరు అటవీశాఖ డివిజన్ పరిధిలోని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అటవీశాఖ అధికారులను పసిగట్టిన స్మగ్లర్లు కంటైనర్‌ను వేగంగా నడుపుకుంటూ తీసుకెళ్లారు. అయినప్పటికీ అధికారులు వెంటాడి చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల మేరకు.. సోమవారం వేకువజామున 4.30 గంటలకు మైదుకూరు వైపు నుంచి కేఏ 09 ఏ2742 న ంబరు గల కర్ణాటక రాష్ట్రానికి చెందిన భారీ కంటైనర్ కడప వైపునకు బయల్దేరింది. అందులో దుంగలను తరలిస్తున్నారని సమాచారం రావడంతో ఎఫ్ఎస్ఓ గుర్రప్ప, ఎఫ్‌బీఓలు హసన్‌బాష, మల్లికార్జునుడు, శ్రీనివాసులు తమ సిబ్బందితో కలిసి జీపులో వెంటాడారు. అటవీశాఖాధికారులు వెంబడిస్తున్నారని తెలుసుకున్న డ్రైవర్ జీపునకు సైడ్ ఇవ్వకుండా వేగంగా ముందుకు కదిలాడు. ఎట్టకేలకు కంటైనర్‌ను వెనకేసి వెళ్లిన అటవీ శాఖాధికారులు చెన్నూరు దాటిన తర్వాత పుష్పగిరి క్రాస్ రోడ్డు వద్ద తుపాకులు ఎక్కుపెట్టి రోడ్డుకు అడ్డంగా నిలబడ్డారు. డ్రైవర్ 20 మీటర్ల దూరంలో కంటైనర్‌ను ఆపగానే.. అందులో ఉన్న స్మగ్లర్లందరూ పక్కనే ఉన్న చెరకు తోటల్లోకి పారిపోయారు. కాగా, స్మగ్లర్లు కర్ణాటకకు చెందిన వారుగా అటవీ శాఖాధికారులు అనుమానిస్తున్నారు. వారి కోసం గాలింపు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు సుమారు 3 టన్నులు ఉంటాయని అధికారులు తెలిపారు. ఇవన్నీ బీ గ్రేడ్ కిందికి వస్తాయని చెప్పారు. -
తిరగబడ్డ ‘ఎర్ర’ కూలీలు
చంద్రగిరి: శేషాచలంలో ఎర్రచందనం చెట్లును కూల్చి దుంగలు తరలించడానికి వచ్చిన కూలీలు పోలీసులపై దాడికి యత్నించారు. పోలీసులు అప్రమత్తం కావడంతో వారిని చాకచక్యంగా పట్టుకోగలిగారు. ఈ ఘటన మామండూరు వద్ద ఉన్న అబ్బాలి రామానాయుడు మామిడితోట సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలను శనివారం పోలీసులు విలేకరులకు తెలిపారు. ఎస్ఐ జయచంద్ర మాట్లాడుతూ మామండూరు సమీపంలోని అబ్బారి రామానాయుడు మామిడి తోట సమీపంలో ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణా చేస్తున్నట్టు శుక్రవారం రహస్య సమాచారం అందిందన్నారు. సీఐ మల్లికార్జున గుప్తా ఆదేశాల మేరకు ఎస్టీఎఫ్ సిబ్బందితో అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించామన్నారు. కూలీలు గొడ్డళ్లు, కర్రలు, రాళ్లతో ఒక్కసారిగా దాడికియత్నించారన్నారు. అప్రమత్తమైన పోలీసులు చాకచక్యంతో 17మంది ఎర్రకూలీలను పట్టుకున్నట్టు తెలిపారు. అయితే మరో ఇద్దరు కూలీలు పరారయ్యారన్నారు. పట్టుబడిన వారినుంచి ఓ టాటా సుమో, 20 ఎర్రచందనం దుంగలు,దాడికియత్నించిన గొడ్డళ్లు, కర్రలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కూలీలు తమిళనాడు రాష్ట్రం తిరుత్తణి, ధర్మపురి జిల్లాలకు చెందినవారుగా గుర్తించామన్నారు. అనంతరం కూలీలపై కేసు నమోదు చేసి కోర్టుకుతరలించినట్టు ఆయన వెల్లడించారు. -
స్వామి సొమ్మును ఇతర పనులకెలా....
-
దాwood
-
ఎర్రచందన కలకలం
గుంటూరు రూరల్: ఎర్రచందనం అక్రమ రవాణాదారులు అధికారులకు ఏమాత్రం అనుమానాలు రాకుండా తమ పని చక్కబెట్టుకుంటున్నారు. ఇది మామిడికాయల సీజన్ కావడంతో మామిడికాయల లోడు మాటున ఎర్రచందనం దుంగలను తరలించేందుకు అక్రమార్కులు అనువైన మార్గంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం పది గంటల సమయంలో పొన్నూరు వైపు మామిడికాయల లోడుతో వెళుతున్న టాటా ఏస్ గుంటూరు రూరల్ మండలం బుడంపా డు గ్రామ శివారులో ఇంజినీరింగ్ కాలేజీ వద్ద లారీని ఓవర్టేక్ చేయిబోయి బోల్తాపడడంతో ఎర్రచందనం అక్ర మ రవాణా గుట్టు బయటపడింది. ఈ వాహనంలో మామిడికాయలు రవాణా అవుతున్నట్లుగా పైకి కనిపిస్తున్నప్పటికీ వాటి అడుగున 22 ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నా రు. దీంతో టాటా ఏస్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ట్రాఫిక్ నిలిచిపోవడంతో హైవే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. వెంటనే సమాచారాన్ని పోలీసు, అటవీ అధికారులకు తెలియజేశారు. ఫారెస్టు రేంజ్ అధికారి (గుంటూరు) కె.రామకొండారెడ్డి, అర్బన్ జిల్లా అదనపు ఎస్పీ బి.శ్రీనివాసులు, రూరల్ సీఐ వై.శ్రీనివాసరావులు తమ సిబ్బందితో కలిసి సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఎర్రచందనం దుంగల విలువ రూ. నాలుగు లక్షల వరకు ఉంటుందని ఫారెస్టు రేంజ్ అధికారి తెలిపారు. ఇవి మూడో రకం ఎర్రచందనంగా గుర్తించారు. వాహనాన్ని, ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తునకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఏఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. టాటా ఏస్‌లో లభ్యమైన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనానికి నంబర్ ఏపీ07 టీఈ 0939 ప్లేటు ఉంది. ఈ నంబర్‌పై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టాటా ఏస్ పొన్నూరు ఆటోస్టాండ్‌కు చెందిందిగా గుర్తిం చారు. పొన్నూరుకు చెందిన ఆటోడ్రైవర్ చందు శ్రీనివాస్ నిన్ననే చెరుకుపల్లి మండలం పొన్నపల్లికి చెందిన పిట్టు గోపిరెడ్డి అనే వ్యక్తికి ఈ వాహనాన్ని విక్రయించినట్లు రికార్డులను బట్టి తెలుస్తోంది. గత మూడు రోజుల్లో ఈ వాహనం తణుకు, వేంపాడు, కలపర్రు టోల్గేట్ల వద్ద కట్టిన టోల్‌ప్లాజా బిల్లులను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక నుంచి నగర శివారు ప్రాంతాల్లో కలిసి చెక్‌పోస్టుల వద్ద వాహన తనిఖీలు ముమ్మరం చేస్తామని ఫారెస్టు రేంజ్ అధికారి రామకొండారెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా కేంద్రంగా... ఎర్రచందనం దుంగలను నెల్లూరు, కడప, గిద్దలూరు, కర్నూలు అడవుల నుంచి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీ వల కాలంలో ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తుండగా ఫారెస్ట్ అధికారులు దాడులు చేసిన సమయంలో స్మగ్లర్లు ఇద్దరు సిబ్బందిని హతమార్చిన విషయం విదితమే. ఫారెస్ట్, పోలీస్ అధికారుల నిఘా పెరగడంతో ఆయా ప్రాంతాల్లో ఎర్రచందనం అక్రమ రవాణాకు వీలులేకపోవడంతో గుంటూరు జిల్లాను కేంద్రంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ మొక్కుబడిగా వాహన తనిఖీలు నిర్వహిస్తుండడం వల్లే అక్రమార్కులకు అడ్డులేకుండా పోయిందనే విమర్శులు వెల్లువెత్తుతున్నాయి. ఎర్రచందనం దుంగలను అక్రమంగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆటోలు, ఇన్నోవా, నీళ్ల ట్యాంకర్, స్కార్పియో, అంబులెన్స్ వాహనాల్లో అక్రమంగా రవాణా చేస్తున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. గత ఆరేళ్లలో పట్టుకున్న ఎర్రచందనం వివరాలు.. జిల్లాలో గత ఆరేళ్లలో వివిధ ప్రాంతాల్లో అటవీ అధికారులు తనిఖీలు నిర్వహించి అక్రమంగా రవాణా అవుతున్న ఎర్రచందనం దుంగలను పట్టుకున్న వివరాలు.. 2008 జనవరి 28న పొన్నూరు రోడ్డు నుంచి తెనాలి వైపు వెళుతున్న లారీలో 264 ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. ఆరు టన్నుల 561 కేజీల బరువు ఉన్న వీటి విలువ రూ.10.36 లక్షలు. అదే ఏడాది నవంబర్ 10న పేరేచర్ల బ్రిడ్జి వద్ద ఓ లారీలో రూ. 7.40లక్షల విలువైన 179 దుంగలు, 2010 మార్చి 15న యడ్లపాడు వద్ద ఓ లారీలో రూ. 2.69 లక్షల విలువైన 104 దుంగలు. నవంబర్ 17న గామాలపాడు వద్ద లారీలో రూ.5.50 లక్షల విలువైన 120 దుంగలు, 2011 ఆగస్టు 3న బాపట్ల- చీరాల మధ్య ఆగి ఉన్న లారీలో రూ. 13.50 లక్షల విలువైన 244 దుంగలు, 2013 జూలై 29న కిష్కిందపాలెం వద్ద లారీలో రూ.9.29 లక్షల విలువైన 230 ఎర్రచందనం దుంగలను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
ఎర్రచందనం పట్టివేత
ఆళ్లగడ్డ రూరల్, న్యూస్‌లైన్ : నల్లమల్ల నుంచి అక్రమంగా తరలిపోతున్న ఎర్రచందనం దుంగలను సోమవారం తెల్లవారుజామున ఆళ్లగడ్డ రూరల్ పోలీసులు సుమోతో సహా పట్టుకున్నారు. పోలీసుల వివరాల మేరకు.. అనంతపురం బసవతారకం నగ ర్కు చెందిన రాజు నరసింహ స్వామి దర్శనార్థం సుమో బాడుగకు తీసుకుని అహోబిలం వచ్చాడు. అదివారం అహోబిలం చేరుకుని స్థాని కులు రామాంజీ, బాలు, నగేష్, ఓబులేసును పరిచ యం చేసుకున్నాడు. రాత్రి అడవిలోని గండ్లేరు ప్రాంతానికి వెళ్లి ఎనిమిది ఎర్రచందనం దుంగల ను నరికి సుమోకు ఎక్కించారు. ఇం దుకు డ్రైవర్ గోవిందు అభ్యంతరం చెప్పగా బాడుగ అధికంగా ఇస్తామని నచ్చజెప్పారు. వీరు సుమోతో ఆళ్లగడ్డ వైపు వస్తుండగా అప్పటికే సమాచా రం తెలుసుకున్న పోలీసులు బాచ్చాపురంమెట్ట వద్ద వల పన్ని పట్టుకున్నా రు. బైకులో ముందు వస్తున్న ముగ్గు రు సుమోలోని ఇద్దరు పారిపోగా డ్రైవ ర్ గోవిందు పట్టుబడ్డాడు. సుమో., అందులో ఉన్న రూ. 5లక్షల విలువైన దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ విజయలక్ష్మి తెలిపారు. కేసు నమోదు చేశామన్నారు. -
కిరణ్‌కు పీలేరు సీఐ పూర్తి సహకారం: భూమన
హైదరాబాద్: సీఎం కిరణ్, ఆయన కుటుంబ సభ్యులు అటవీ సంపదను కొల్లగొడుతున్నారని వైఎస్ఆర్ సీపీ నేత, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. సీఎం తమ్ముడు కిశోర్‌కుమార్ రెడ్డి ఎర్రచందనాన్ని దోచుకుంటున్నారని అన్నారు. వీరి అక్రమాలకు పీలేరు సీఐ పూర్తి సహకారం అందిస్తున్నారని తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల వెనక సీఎం హస్తముందని అంతకుముందు అన్నారు. సీఎం సోదరుడి ప్రోత్సాహం వల్లే స్మగ్లర్లు చెలరేగిపోతున్నారని ఆరోపించారు. -
2 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం
తిరుపతి : చిత్తూరు జిల్లాలో ఎర్ర చందనం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. చిన్నగొట్టిగల్లు మండలం చెరుకువారిపల్లి వద్ద భాకరాపేట పోలీసుల తనిఖీల్లో భారీగా ఎర్రచందనం బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన నలుగురు స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ ఎర్రచందనం విలువ సుమారు రూ.రెండు కోట్లు ఉంటుందని అంచనా. ఓ మినీలారీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.