
వెంటాడి.. తుపాకులు ఎక్కుపెట్టి..
ప్రొద్దుటూరు క్రైం : భారీ కంటైనర్‌లో తరలిస్తున్న 120 బీ గ్రేడ్ ఎర్రచందనం దుంగలను ప్రొద్దుటూరు అటవీశాఖ డివిజన్ పరిధిలోని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అటవీశాఖ అధికారులను పసిగట్టిన స్మగ్లర్లు కంటైనర్‌ను వేగంగా నడుపుకుంటూ తీసుకెళ్లారు. అయినప్పటికీ అధికారులు వెంటాడి చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల మేరకు.. సోమవారం వేకువజామున 4.30 గంటలకు మైదుకూరు వైపు నుంచి కేఏ 09 ఏ2742 న ంబరు గల కర్ణాటక రాష్ట్రానికి చెందిన భారీ కంటైనర్ కడప వైపునకు బయల్దేరింది. అందులో దుంగలను తరలిస్తున్నారని సమాచారం రావడంతో ఎఫ్‌ఎస్‌ఓ గుర్రప్ప, ఎఫ్‌బీఓలు హసన్‌బాష, మల్లికార్జునుడు, శ్రీనివాసులు తమ సిబ్బందితో కలిసి జీపులో వెంటాడారు.
అటవీశాఖాధికారులు వెంబడిస్తున్నారని తెలుసుకున్న డ్రైవర్ జీపునకు సైడ్ ఇవ్వకుండా వేగంగా ముందుకు కదిలాడు. ఎట్టకేలకు కంటైనర్‌ను వెనకేసి వెళ్లిన అటవీ శాఖాధికారులు చెన్నూరు దాటిన తర్వాత పుష్పగిరి క్రాస్ రోడ్డు వద్ద తుపాకులు ఎక్కుపెట్టి రోడ్డుకు అడ్డంగా నిలబడ్డారు. డ్రైవర్ 20 మీటర్ల దూరంలో కంటైనర్‌ను ఆపగానే.. అందులో ఉన్న స్మగ్లర్లందరూ పక్కనే ఉన్న చెరకు తోటల్లోకి పారిపోయారు. కాగా, స్మగ్లర్లు కర్ణాటకకు చెందిన వారుగా అటవీ శాఖాధికారులు అనుమానిస్తున్నారు. వారి కోసం గాలింపు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు సుమారు 3 టన్నులు ఉంటాయని అధికారులు తెలిపారు. ఇవన్నీ బీ గ్రేడ్ కిందికి వస్తాయని చెప్పారు.