సాక్షి, అమరావతి: ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ‘నవరత్నాలు’, సంక్షేమ పథకాల అమలుతోపాటు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వంపై ఉన్నందున ఆదాయ మార్గాల పెంపుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగానికి సూచించారు. ప్రజలపై భారం మోపకుండా రాబడి పెంచడానికి ఉన్న ప్రతి అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఆదాయ ఆర్జన శాఖలు, సంస్థల అధికారులతో గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఎక్కడెక్కడ దృష్టి పెడితే ఆదాయం పెరుగుతుందో ఆలోచించుకుని తరచూ సమీక్షించుకుంటూ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకుని ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు. సంక్షేమ పథకాల ద్వారా పేదలు, అల్పాదాయ వర్గాల ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులు మెరుగు పరచాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని నొక్కి చెప్పారు. వీటితోపాటు అభివృద్ధి పనులకు కూడా నిధులు అవసరమైనందున ఆదాయ మార్గాలు అన్వేషించాలన్నారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే..
బొగ్గు, మైనింగ్‌పై ప్రత్యేక దృష్టి
ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాల్లో టెండర్ల ద్వారా కైవసం చేసుకున్న బ్రహదిహ, సులియారీ, మదన్‌పూర్ సౌత్ బొగ్గు బ్లాకుల్లో నిర్ణీత సమయంలో మైనింగ్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రణాళికా బద్ధంగా చర్యలను వేగవంతం చేయాలి.
– రాష్ట్రానికి అధిక ఆదాయం వచ్చే మైనింగ్ కార్యకలాపాలపై మరింత అధికంగా దృష్టి నిలపాలి. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ), ఇతర విభాగాలను సమన్వయం చేసుకుని త్వరితగతిన సిలికా శాండ్ కార్యకలాపాలు ప్రారంభించాలి.
పారదర్శకంగా ఎర్రచందనం విక్రయం
– రాష్ట్రంలో ఉన్న ఎర్రచందనం నిల్వలను విక్రయించేందుకు త్వరితగతిన కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చేందుకు ప్రయత్నించాలి. ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా ఎర్రచందనం విక్రయించాలి.
– ఇందుకు సంబంధించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. ప్రజలపై భారం వేయకుండా ఆదాయ వనరులను పెంచుకునేందుకు అవసరమైన ప్రణాళికలతో అధికారులు సిద్ధంగా ఉండాలి.
– ఆదాయం వచ్చే అంశాలపై అధ్యయనం చేసి, మరింత శ్రద్ధతో పని చేయాలి. నిరంతరం సమీక్షలు నిర్వహించుకుంటూ ఎప్పటికప్పుడు అంచనాలు సిద్ధం చేసుకోవాలి.
– గత ఆర్థిక ఏడాది కంటే ఈ ఏడాది రూ.1,800 కోట్ల ఆదాయం తగ్గినప్పటికీ, పరిస్థితి మెరుగు పడుతోందని అధికారులు సీఎంకు వివరించారు. గత ఏడాది ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల్లో కోవిడ్ కారణంగా ఆదాయం తగ్గినప్పటికీ, ఆగస్టు నుంచి ఆదాయం పెరిగిందన్నారు. రెండు మూడు నెలల్లో లక్ష్యం మేరకు ఆదాయం వస్తుందని చెప్పారు.
– ఈ సమీక్షలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజిత్ భార్గవ, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, అటవీ శాఖ కార్యదర్శి విజయ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
- గత ఆర్థిక ఏడాదితో పోలిస్తే ఈ ఆర్థిక ఏడాది కోవిడ్ కారణంగా రూ.1,800 కోట్లకుపైగా ఆదాయం తగ్గింది. మరో వైపు వివిధ పథకాల అమలు వల్ల ఖర్చు పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలపై భారం వేయకుండానే రాబడి పెరిగేలా మార్గాలన్నింటినీ అన్వేషించాలి.
Comments
Please login to add a commentAdd a comment