యువతకు ఉపాధి.. రైతులకు లాభం | APIIC has developed Wood Park in 490 acres | Sakshi
Sakshi News home page

యువతకు ఉపాధి.. రైతులకు లాభం

Published Sat, Feb 24 2024 4:24 AM | Last Updated on Sat, Feb 24 2024 4:24 AM

APIIC has developed Wood Park in 490 acres - Sakshi

సాక్షి, అమరావతి: ఓవైపు యువతకు ఉపాధి.. మరోవైపు రైతులకు ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ జిల్లా బద్వేలు నియోజకవర్గం గోపవరంలో పారిశ్రామిక పార్క్‌­ను అందుబాటులోకి తెచ్చింది. కలప ఆధారిత పరిశ్రమల కోసమే ప్రత్యేకంగా ఈ పారిశ్రామిక పార్క్‌ను అభివృద్ధి చేసింది. ఈ వుడ్‌ పార్క్‌లో ప్రధాన (యాంకర్‌) కంపెనీగా అగ్రగామి సంస్థ సెంచురీ ప్యానల్స్‌ భారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది.

రూ.1,000 కోట్ల పెట్టుబడితో 100 ఎకరాల్లో నెలకొల్పిన సెంచురీ ప్యానల్స్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నెల రోజుల క్రితం లాంఛనంగా ఉత్పత్తిని ప్రారంభించారు. సెంచురీ ప్యానల్స్‌కు డిసెంబర్‌ 23, 2021లో సీఎం వైఎస్‌ జగన్‌ భూమి పూజ చేయగా రాష్ట్ర ప్రభుత్వ చొరవతో కేవలం రెండేళ్లలోనే వా­ణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించడం విశేషం.

ఈ యూనిట్‌ ద్వారా 2,266 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుండగా అంతకు రెట్టింపు సంఖ్యలో పరోక్ష ఉపాధి లభించనుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే రెండో దశ విస్తరణ పనులను ప్రారంభించడానికి సెంచురీ ప్యానల్స్‌ ప్రణాళికలు సిద్ధం చేసింది.

పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు.. 
ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తున్న సమయంలో సుబాబుల్, జామాయిల్‌ సాగు చేసే రైతులు గిట్టుబాటు ధరలు లేక గుట్టలుగా పేరుకుపోయిన కలప లాట్లను చూపించి ఆయనకు తమ గోడును వెళ్లబోసుకున్నారు.

ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చాక 2021 జూలైలో బద్వేలు నియోజకవర్గ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గోపవరం పారిశ్రామిక పార్క్‌ను అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వేగంగా భూసేకరణ పూర్తి చేసిన ఏపీఐఐసీ గోపవరం వద్ద 490.36 ఎకరాల్లో కలప ఆధారిత పరిశ్రమల కోసం ప్రత్యేకంగా పారిశ్రామిక పార్క్‌ను అభివృద్ధి చేసింది. 

రైతులకు సబ్సిడీ ధరలకే 50 లక్షల విత్తన మొక్కలు..
సెంచురీ ప్యానల్స్‌లో హై ప్రెజర్‌ లామినేట్స్‌ (హెచ్‌పీఎల్‌), మీడియం డెన్సిటీ ఫైబర్‌ బోర్డ్స్‌ (ఎండీఎఫ్‌) తయారవుతాయి. రోజుకు 950 ట­న్ను­ల సామర్థ్యం గల ఎండీఎఫ్‌లను తయా­రు­చేస్తారు. ఇందుకోసం భారీ సంఖ్యలో కలప అవ­సరమవుతుంది. ఈ నేపథ్యంలో 150 కి.మీ పరిధిలో వైఎస్సార్, అన్నమయ్య, నంద్యాల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల రైతుల నుంచి సెంచురీ ప్యానల్స్‌ జామా­యిల్‌ను సేకరించనుంది. ఇందుకోసం సుమా­రు 80,000 ఎకరాల్లో జామాయిల్‌ పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు సెంచురీ ప్యానల్స్‌ జనరల్‌ మేనేజర్‌ రమేష్‌కుమార్‌ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.

ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధరకు తక్కువ కాకుండా జామాయిల్‌ను కొనుగోలు చేస్తామన్నారు. దీనివల్ల సుమారు 25,000 రైతు కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఇప్పటికే రైతులకు 50 లక్షల విత్తన మొక్కలను సబ్సిడీ ధరలకు అందించినట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఉద్యోగ నియామకాల్లో 80% మంది స్థానిక యు­వతనే తీసుకుంటున్నామన్నారు. తొలుత గోప­వరం, బద్వేలు మండలాలకు ప్రాధాన్యత ఇస్తు­న్నా­మ­ని చెప్పారు. వీటి తర్వాత వైఎస్సార్‌ జిల్లా­తో­పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ప్రా­ధా­న్యత ఉంటుందన్నారు.

అలాగే ఈ యూ­నిట్‌కు అవసరమైన ముడి సరుకును అందించే రీసిన్‌ త­యారీ యూనిట్‌ను నాయుడుపేట వద్ద రూ.50 కోట్లతో ఏర్పాటు చేస్తున్నామని తెలి­పారు. ఈ యూనిట్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరి నా­టికి అందు­బాటులోకి వస్తుందన్నారు. యాంకర్‌ యూనిట్‌ ఏర్పడటంతో దీనికి అనుబంధంగా అనేక కలప ఆధారిత పరిశ్రమలు ఇక్కడకు రా­నున్నాయని పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. 

ఇక ఉద్యోగం రాదనుకున్నా..
ఐటీఐ ఎలక్ట్రికల్‌ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఐదేళ్లపాటు ఎదురుచూశాను. ఇక ఉద్యోగం రాదనుకున్నా. సెంచురీ ప్యానెల్స్‌ ఏర్పాటుతో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వడంతో నన్ను ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చింది. దీంతో మా కుటుంబం ఆనందానికి అవధులు లేవు. – గుడి మెగురయ్య కలసపాడు, వైఎస్సార్‌ జిల్లా 

నిరుద్యోగులకు ఉద్యోగాలు.. రైతులకు మేలు..
సెంచురీ ప్యానెల్స్‌కు అవసరమయ్యే రా మెటీరియల్‌ కోసం జామాయిల్‌ సాగు చేసుకునేందుకు పరిశ్రమ వారు రైతులను ప్రోత్సహిస్తున్నారు. ఎలాంటి రవాణా ఖర్చు లేకుండా మొక్కలను సబ్సిడీ ద్వారా నేరుగా రైతు పొలాల వద్దకే తెచ్చిస్తా­మ­న్నారు. దళారీ వ్యవస్థ లేకుండా కనీస మ­ద్దతు ధరకు వారే కొనుగోలు చేస్తా­మ­న్నా­రు. జామాయిల్‌ సాగుపై ఇప్పటికే రైతు­లకు అవగాహన కల్పించారు. ఈ ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటు వల్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు, కూలీలకు ఉపాధితో పాటు రైతులకు మేలు జరుగుతుంది.  – రూకల దేవదాసు గోపవరం ప్రాజెక్టు కాలనీ, వైఎస్సార్‌ జిల్లా 

వెనుకబడిన ప్రాంతంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
బాగా వెనుకబడిన ప్రాంతమైన బద్వేలులో యూనిట్‌ ఏర్పాటు చేయడానికి సెంచురీ ప్యానల్స్‌ ముందుకు రావడంతో రాష్ట్ర ప్రభు­త్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. బ్రహ్మంసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి 0.07 టీఎంసీల నీటిని కేటాయించడంతోపాటు 132 కేవీ విద్యుత్‌ సరఫరా, రహదారుల నిర్మాణం వంటి మౌలిక వసతులను కల్పించాం. పరిశ్రమలకు ఇచ్చే రాయితీలతోపాటు సబ్సిడీ ధరపై విద్యుత్‌ అందించాం. స్థానిక యువతకు ఉపాధి కల్పించడానికి రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ అందిస్తున్నాం. – ఎన్‌.యువరాజ్, కార్యదర్శిరాష్ట్ర పరిశ్రమలు, మౌలిక వసతుల శాఖ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement