
ఔరా..! ఔషధ పట్టుచీర
సాక్షి, విజయవాడ బ్యూరో: ఎర్రచందనం, శ్రీగంధం నూనె తదితర ఔషధ గుణాల కలయికతో తయారైన పట్టుచీర సింగారించుకుంటే అందం, ఆరోగ్యం కలబోతగా ఉంటుంది. సరిగ్గా ఈ ఆలోచనతోనే అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన డిజైనర్ పెద్దయ్యగారి మోహన్ ఔషధ పట్టు చీర తయారీలో పట్టు సాధించాడు.
10 మంది కార్మికులతో కలసి ఆరు నెలల పాటు శ్రమించి రూ.33 వేల ఖర్చుతో తయారు చేసిన ఈ చేనేత పట్టు చీరను మంత్రి కొల్లు రవీంద్ర సోమవారం విజయవాడలో ఆవిష్కరించారు. రూపకర్త మోహన్ మాట్లాడుతూ.. శేషాచలం అడవుల్లో లభ్యమయ్యే ఎర్రచందనం మొక్కల ముడిసరుకు, శ్రీగంధం నూనెతో పాటు వ్యాధినిరోధక ఔషధాల మిశ్రమాలతో ఈ చీరను తయారుచేసినట్లు వెల్లడించారు. దీనికి ‘సంరక్షణ పట్టుశారీ’గా పేరు పెట్టినట్లు తెలిపారు.