స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం, వాహనాలతో సహా నిందితుల అరెస్ట్ చూపుతున్న పోలీసులు
సాక్షి, చిత్తూరు(కేవీబీపురం) : రెండు వాహనాలతో సహా రూ.37 లక్షలు విలువచేసే 33 ఎర్రచందనం దొంగలను కేబీపురం పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. పుత్తూరు డీఎస్పీ మురళీధర్ మీడియాకు తెలిపిన వివరాలు..మండలంలోని జ్ఞానమ్మకండ్రిగ, బంగారమ్మ కండ్రిగ గ్రామాల నడుమ మారుమూల ప్రాంతం నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నట్టు స్థానిక పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు నిఘా ఉంచారు. వేకువ జామున టీఎన్ 07 బీవీ 6699 నంబరు కలిగిన ఇన్నోవా వాహనంపై ఎస్‌ఐ గోపి తన సిబ్బందితో దాడి చేశారు. ఇన్నోవాను, తమిళనాడుకు చెందిన ఇన్నోవా డ్రైవర్ కార్తీక్ అదుపులోకి తీసుకున్నారు.అలాగే ఆ వాహనానికి పైలెట్లుగా వ్యవహరిస్తున్న కేవీబీపురానికి చెందిన కరుపారెడ్డి బాలా(23), పురుషోత్తం(20) నుంచి రెండు బైక్‌లు కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఇన్నోవాను పరిశీలించగా అందులో 33 ఎర్రచందనం దుంగలు ఉన్నట్టు గుర్తించారు. ఎర్ర దుంగల స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న మరికొందరి పేర్లను ప్రాథమిక విచారణలో నిందితుల నుంచి తెలుసుకున్నారు. వ్యసనాలు, జల్సాలకు అలవాటు పడిన యువకులు స్మగ్లర్ల ప్రలోభాలకు లొంగిపోయి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని, ముఖ్యంగా మండలంలోని కొన్ని గ్రామాల నుంచి ఎర్రచందనం స్మగ్లర్లకు సహకారం అందుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని డీఎస్పీ చెప్పారు. వారిపై ఇప్పటికే నిఘా ఉంచినట్లు పేర్కొన్నారు. దాడుల్లో ఎస్‌ఐతోపాటు పాల్గొన్న హెడ్ కానిస్టేబుల్ జయరామిరెడ్డి, సిబ్బంది నరేష్, రాజా, చిరంజీవి, దాము, గంగాధర్‌ను డీఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో పుత్తూరు రూరల్ సీఐ ఈశ్వర్, ఫారెస్ట్ అధికారులు ఎఫ్‌ఎస్‌ఓ చక్రపాణి, ఎఫ్‌బీఓ వేణుగోపాల్, బీట్ ఆఫీసర్లు మస్తాన్, కేవీబీపురం పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఇదలా ఉంచితే, తొలుత డీఎస్పీ, పోలీస్ స్టేషన్‌లో రికార్డులను పరిశీలించారు.
పుత్తూరులో రూ.18లక్షల ‘ఎర్ర’దుంగలు..
పుత్తూరు : ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న సంఘటన పుత్తూరులో చోటుచేసుకుంది. ఫారెస్ట్ రేంజర్ సుబ్రమణ్యం కథనం... మండలంలో తడుకు ఫారెస్ట్ బీట్ పరిధిలోని మూలకోన నుంచి ఎర్రచందనంను అక్రమంగా తరలించేందుకు స్మగ్లర్లు సిద్ధమవుతున్నారని సమాచారం అందడంతో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గంగాధరం నేతృత్వంలో అటవీశాఖ అధికారులు నిఘా ఉంచారు. మంగళవారం వేకువజామున మూలకోనలో స్మగ్లర్లపై దాడులు చేశారు. అటవీ అధికారులను గమనించిన స్మగ్లర్లు దుంగలను పడేసి పరారయ్యారు. సంఘటన స్థలంలో 40 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పరారైన నిందితులు మండలంలోని నేసనూరుకు చెందిన టి.గంగాధరం, కే.చెంగా రెడ్డి, ఎం.మునిరత్నం, కే.కృష్ణారెడ్డి, కేబీఆర్ పురం గ్రామానికి చెందిన అన్నా లోకనాథం అని ప్రాథమిక విచారణలో గుర్తించారు. స్వాధీనం చేసుకున్న దుంగల బరువు 570 కిలోలు ఉందని, వీటి విలువ దాదాపు రూ.18లక్షలని రేంజర్ చెప్పారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామని ఆయన తెలిపారు.
రూ.15లక్షల పైచిలుకు ‘ఎర్ర’దుంగలు...
రేణిగుంట : రేణిగుంట మండలం జీవాగ్రం కూడలి వద్ద మంగళవారం తెల్లవారుజామున వాహనం సహా ఎర్రచందనం దుంగలను గాజులమండ్యం పోలీసులు పట్టుకున్నారు. సీఐ అమరనాథరెడ్డి కథనం ... తెల్లవారుజామున 3.30గంటల సమయంలో కూడలి వద్ద వడమాలపేట ఎస్‌ఐ సునీల్, పోలీసు సిబ్బంది వాహనాలను తనిఖీ చేస్తుండగా చెక్‌పోస్ట్ వైపు నుంచి వస్తున్న టాటా ఏస్ లగేజి ఆటో కొంత దూరంలో ఆగింది. తనిఖీలను గమనించిన ఆటో డ్రైవర్ లగేజి ఆటోను అక్కడే వదిలేసి పరారయ్యాడు. దీంతో పోలీసు సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని ఆటోను పరిశీలించారు. అందులో 44ఎర్రచందనం దుంగలను గుర్తించి వాహనంతో సహా స్వాధీనం చేసుకున్నారు. దుంగలను ఆటోతో సహా ఫారెస్ట్ అధికారులకు అప్పగించి కేసు నమోదు చేశారు. ఎర్రచందనం విలువ రూ.15లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేశారు.
‘ఎర్ర’స్మగ్లర్ల అరెస్ట్
పిచ్చాటూరు : ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు పుత్తూరు డీఎస్పీ మురళీధర్ తెలిపారు. మంగళవారం పిచ్చాటూరు పోలీస్ స్టేషన్‌లో ఆయన విలేకరులకు తెలిపిన వివరాలు.. గత వారం పిచ్చాటూరు పోలీసులు ముందస్తు సమాచారం మేరకు వెంగళత్తూరులోని కిచ్చా(23) అనే వ్యక్తి ఇంట్లో రవాణాకు సిద్ధంగా ఉంచిన రూ.8 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను దాడి చేసి స్వాధీనం చేసుకోవడం విదితమే. ఆ సమయంలో ఇంట్లో కిచ్చా లేడు. ఈ నేపథ్యంలో అతడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. మంగళవారం కిచ్చాతోపాటు మరో స్మగ్లర్ సంగీతరాజు (27) వేలూరు క్రాస్ వద్ద సంచరిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం సత్యవేడు కోర్టులో వీరిని హాజరు పరచనున్నట్టు డీఎస్పీ చెప్పారు. సమావేశంలో సీఐ ఈశ్వర్, ఎస్‌ఐ దస్తగిరి, ఏఎస్‌ఐ సుబ్రమణ్యం నాయుడు, రైటర్ లోకనాథం, హెడ్ కానిస్టేబుల్ సాయిబాబా, కానిస్టేబుళ్లు మురళి, విజయశేఖర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment