చెట్టుకు బెరడు ఒలిచిన దృశ్యం, చెట్టు మొదలును నరికేసిన దృశ్యం (ఫైల్)
శేషాచల అడవుల్లో ఎర్ర స్మగ్లర్లు చెలరేగిపోతున్నారు. పోలీసుల కళ్లుగప్పి ఇష్టారాజ్యంగా అడవుల్లోకి చొరబడుతున్నారు. ఎర్రచందనం దుంగల నాణ్యత పరిశీలించేందుకు మొదట వాటి బెరడు తీసేస్తున్నారు. ఆపై నాణ్యత లేకుంటే అలాగే వదిలేస్తున్నారు. బెరడ తీసేయడంతో వందలాది వృక్షాలు నిలువునా ఎండిపోతున్నాయి. వీటి సంరక్షణ కోసం అధికారులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతుండడం విమర్శలకు తావిస్తోంది.
సాక్షి, తిరుపతి జిల్లా: శేషాచలం అడవుల్లో గొడ్డళ్ల చప్పుడు ఆగనంటోంది. తమిళ కూలీలు ఇష్టారాజ్యంగా చొరబడుతూ ఎర్రచందనం చెట్లను నేలకూల్చుతున్నారు. వాటిని గుట్టుచప్పుడు కాకుండా సరిహద్దు దాటించి జేబులు నింపుకుంటున్నారు. ఇందులో బడా స్మగ్లర్ల హస్తం కూడా ఉన్నట్టు సమాచారం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసుల కళ్లుగప్పుతున్నట్టు తెలుస్తోంది.
క్వాలిటీ కోసం చంపేస్తున్నారు
గతంలో ఎర్రచందనం వృక్షాలకు చిన్న పాటి రంధ్రం వేసి నాణ్యతను పరీక్షించేవారు. క్వాలిటీ ఉన్న చెట్లును నరికి తరలించేవారు. ఇప్పుడు కొత్త పంథాలో నాణ్యతను పరిశీలిస్తున్నారు. చెట్టును నరకకుండా పైన ఉన్న బెరడును తొలిచి నాణ్యతను చూస్తున్నారు. నాణ్యత లేకుంటే అలానే వదలేస్తున్నారు. బెరడు తీసేయడంతో ఎర్రచందనం చెట్లు నిలువునా ఎండిపోతున్నాయి. శేషాచలం మొత్తంగా కొన్నివందల చెట్లు ఇలా చనిపోయి ఉన్నట్టు తెలుస్తోంది.
చదవండి: నెరవేరబోతున్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కల..
టన్ను రూ.1.5 కోట్లు
ఎర్ర స్మగ్లర్లు నం.1 క్వాలిటీకే మెుదట ప్రాధాన్యత ఇస్తున్నారు. అడవిలో ఎన్ని కిలోమీటర్లు అయినా వెళ్లి నాణ్యమైన దుంగలు ఎంచుకుంటున్నారు. బహిరంగ వేలంలో నం.1(గ్రేడ్–1) ఎర్ర దుంగలు టన్ను రూ.1.5 కోట్లు పలుకుతున్నట్టు సమాచారం.
ఆయుధాలతో ఎదురుదాడి
అటవీ ప్రాంతంలో కూంబింగ్‌కు వెళ్లిన వారిపై తిరుగుబాటుకు సైతం కూలీలు లెక్కచేయడంలేదు. తమ వద్ద ఉన్న ఆయుధాలతో దాడికి దిగుతున్నారు. కొన్ని సందర్భాల్లో రాళ్ల వర్షం కురిపిస్తున్నారు. దట్టమైన అటవీప్రాంతం కావడంతో ఎర్రకూలీలను పూర్తిస్థాయిలో ఎదుర్కోవడం కొంత ఇబ్బందిగా ఉన్నట్టు తెలుస్తోంది.
కాపాడుకుంటాం
ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తాం. ఇప్పటికే ప్రభుత్వ, డిపార్టుమెంట్ ఆదేశలను పాటిస్తూ నిఘా పెట్టాం. వివిధ శాఖలతోపాటు అటవీసరిహద్దు గ్రామాల ప్రజల సహకారంతో ఎర్రచందనాన్ని కాపాడుకుంటాం.
– పట్టాభి, రేంజర్, భాకరాపేట ..
Comments
Please login to add a commentAdd a comment