హనుమాన్‌జంక్షన్ : బాపులపాడు మండలం మల్లవల్లిలో సుమారు 80 ఎకరాల అటవీ భూమి ఆక్రమణకు గురైంది. ఆర్‌ఎస్ నంబర్ 11లోని ఈ భూమిని ఆక్రమించిన బడాబాబులు రాత్రి సమయాల్లో పొక్లెయిన్‌తో భూమిని చదును చేయించారు. నాలుగు అడుగుల వరలతో మూడు అడుగుల నీటితొట్టెలు 50 మీటర్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేశారు. మామిడి మొక్కలు కూడా నాటారు. ఒకవైపు ఫెన్సింగ్ కూడా పూర్తిచేశారు. మిగిలిన మూడువైపుల గుంతలు తీసి ఫెన్సింగ్ పూర్తిచేసేందుకు ఏర్పాట్లు చేశారు. పక్షం రోజులుగా ఈ తంతు జరుగుతున్నా రెవెన్యూ అధికారులు మాత్రం స్పందించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలిలా వున్నాయి.. ఆర్‌ఎస్ నంబరు 11లో 1,460 ఎకరాల అటవీ భూమి ఉంది. అందులో వంద ఎకరాలు గతంలో ఉద్యానశాఖ వన నర్సరీకి కేటాయించగా, మిగిలిన భూమి ఆక్రమణలకు గురైంది. గత కాంగ్రెస్ సర్కారు హయాంలో నిరుపేదలకు కొంత భూమి కేటాయించి బడాబాబుల ఆక్రమణలో ఉన్న భూమిని స్వాధీనం చేసుకున్నారు.
నిరుపేదల ఆక్రమణలకు సంబంధించి వివరాలు సేకరించారు. ఆక్రమణలు జరిగిన, మొక్కలు నాటని భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నట్లుగా ప్రకటించారు. అలా ఉన్న భూమి నిరుపేదల ఆధీనంలో ఉండడంతో ఇటీవల ఇద్దరు ఆక్రమణదారులు కొంత సొమ్ము ఇచ్చి స్వాధీనం చేసుకున్నారు. ఇవ్వనివారిని కూడా బెదిరించి మరికొంత భూమి స్వాధీనం చేసుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మంగళవారం ఉదయం విలేకరుల బృందం ఈ అటవీ భూములను పరిశీలించగా ఇక్కడ జరుగుతున్న బాగోతం బట్టబయలైంది. గ్రామ వీఆర్వో ఏసుపాదంను ‘సాక్షి’ వివరణ కోరగా నైజాం ప్రభుత్వం నుంచి ఆ భూములు కొనుగోలు చేసినట్లు ఆక్రమణదారులు చెబుతున్నారని తెలిపారు.
రెవెన్యూ అధికారుల హడావుడి
ఈ సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించారు. హుటాహుటిన ఆక్రమిత స్థలం వద్దకు చేరుకొని ట్రాక్టర్‌తో ఫెన్సింగ్, నీటి తొట్టెలను ధ్వంసం చేశారు. ఆక్రమణలపై మండల తహశీల్దారు కె.గోపాలకృష్ణ వివరణ ఇస్తూ.. మల్లవల్లి గ్రామంలో అటవీ భూములు ఆక్రమణకు గురైనట్లు తెలిసిందన్నారు. గొల్లపల్లికి చెందిన పొట్లూరి గోపాలకృష్ణ, పంతం కామరాజు సుమారు 80 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించి ఫెన్సింగ్ వేసినట్లు గ్రామ రెవెన్యూ అధికారి చెప్పారని వివరించారు. వారిద్దరిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భూమిని స్వాధీనం చేసుకున్నామని వివరించారు.