ఇదీ కటాఫ్ ఏరియా కథ
కటాఫ్ ఏరియా.. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఇప్పుడీ పేరు మార్మోగుతోంది. మావోయిస్టుల చరిత్రలో అతిపెద్ద ఎన్‌కౌంటర్ వారం క్రితం ఇక్కడే జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్‌మడ్ అటవీ ప్రాంతం ఎంతటి దుర్భేద్యమైనదో.. ఏవోబీలోని కటాఫ్ ప్రాంతం అంత దుర్భేద్యమైనది. పక్కా ప్రణాళికతో తొలిసారి ఆ ప్రాంతంలోకి పోలీసు బలగాలు అడుగుపెట్టగలిగాయి. దాంతో కటాఫ్ ఏరియా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇప్పుడెలా చేరుకోగలిగారంటే..
ఇన్నాళ్లూ దుర్లభంగా ఉన్న కటాఫ్ ప్రాంత ప్రవేశాన్ని పక్కా వ్యూహంతో పోలీసు అధికారులు సుగమం చేసుకున్నారు. కటాఫ్ ఏరియాలోని రామగుడ ప్రాంతంలో మావోయిస్టులు భారీ ఎత్తున శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఆ శిబిరాలకు అవసరమైన సరుకులను తరలిస్తున్న విషయాన్ని కూంబింగ్ దళాలు పసిగట్టాయి. వాటిని తరలిస్తున్న వ్యక్తి(కొరియర్)ని అదుపులోకి తీసుకొని మొత్తం సమాచారం రాబట్టారు. దాన్ని ఆధారం చేసుకుని ఆంధ్ర-ఒడిశా పోలీస్ ఉన్నతాధికారులు పరస్పరం చర్చించుకొని పక్కా వ్యూహం రచించారు. జీపీఎస్ తదితర ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థల సాయంతో ముందుకు కదిలారు. టార్గెట్ ప్రాంతానికి సుమారు 10 కిలోమీటర్ల ముందే వాహనాలు నిలిపివేసి, సెల్ సిగ్నళ్లు నిలిపివేసి కాలినడకనే కటాఫ్ ఏరియాకు ఆదివారం సాయంత్రం చేరుకున్నారు. సోమవారం తెల్లవారుజామున మావోయిస్టులు నిద్రలో ఉన్న సమయంలో దాడి ప్రారంభించి ఎన్‌కౌంటర్ చేశారు. వరుసగా మూడురోజులపాటు జరిగిన ఈ కాల్పుల్లో మొత్తం 30 మంది మావోయిస్టులు హతమయ్యారు.
కటాఫ్ అంటే
1980 దశకంలో ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో బలిమెల జలాశయం నిర్మించారు. అయితే సుమారు 142 గ్రామాలు జలాశయం మధ్యలో ఉండిపోయాయి. అక్కడకు చేరుకోవడం చాలా కష్టం. నావలు లేదా లాంచీల్లోనే ప్రయాణం చేయాలి. గ్రామాలన్నీ నీటి మధ్యలో ఉన్న ఎత్తయిన కొండలపై ఉన్నాయి. వీటిలో సుమారు 55 వేల వరకు జనాభా నివసిస్తున్నారు. ఆ ప్రాంతాన్నే కటాఫ్ ఏరియాగా వ్యవహరిస్తున్నారు. స్థానికుల సహకారం, ఆ ప్రాంత భౌగోళిక స్వరూపంపై అవగాహన ఉంటే తప్ప అక్కడికి ప్రవేశించడం దుర్లభం. అందుకే ఈ ప్రాంతాన్ని మావోయిస్టులు షెల్టర్‌జోన్‌గా ఇన్నాళ్లూ ఉపయోగించుకున్నారు.
సమాంతర పాలన నుంచి సంక్షోభంలోకి..
నాలుగు డివిజన్లు, మూడు కేంద్ర ప్రాంత్రీయ కమాండ్లు(సీఆర్‌సీలు), ఎనిమిది వరకు ఏరియా కమిటీలు.. వెరసి పోలీసులను దశాబ్ద కాలంగా ముప్పుతిప్పలు పెట్టిన మావోయిస్టు పార్టీ ఏవోబీ జోన్ కమిటీ ఇప్పుడు కీలక నేతలను కోల్పోయింది. ఏవోబీలో ఒకప్పుడు దట్టమైన అడవి ఉండేది. తరువాత పోడు వ్యవసాయం పెరిగింది. దీంతో దట్టమైన అడవులు పలుచబడ్డాయి. గతంలో రోడ్లు వద్దని చెప్పిన గిరిజనం ఇప్పుడు రోడ్లు కావాలని కోరుతున్నారు. దీంతో మారుమూల ప్రాంతాలకు రోడ్లు వేస్తున్నారు. వాహనాలు వెళ్తున్నాయి. ఇప్పుడు యువత తీరులో మార్పు వచ్చింది. మావోయిస్టు ఉద్యమంలో చేరే వారి సంఖ్య తగ్గుతోంది. దీంతో మావో ఉద్యమం సంక్షోభంలోకి వెళ్లింది.