ఆంధ్రా, ఒడిశా బోర్డర్ అటవీ ప్రాంతంలో సీలేరు పరీవాహక ప్రదేశంలో విస్తృతంగా
పోలీసులు, మావోయిస్టుల పరస్పర ఆరోపణలు
మల్కన్‌గిరి నుంచి సాక్షి ప్రత్యేక బృందం: ఆంధ్రా, ఒడిశా బోర్డర్ అటవీ ప్రాంతంలో సీలేరు పరీవాహక ప్రదేశంలో విస్తృతంగా సాగుతున్న గంజాయి సాగుపై పోలీసులు, మావోయిస్టులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. మన్యంలో దాదాపు 6 వేల ఎకరాల్లో గంజాయి పంట సాగు చేస్తున్నారు. లెక్కల్లోకి రాని మరిన్ని వేల ఎకరాల్లో కూడా గంజాయి సాగవుతోందని అధికారులంటున్నారు. ఏటా దాదాపు రూ.500 కోట్ల గంజాయి వ్యాపారం జరుగుతోందని అంచనా. ఏవోబీ నుంచి రాష్ట్రం, దేశం నలుమూలలతో పాటు విదేశాలకు సైతం గంజాయి రవాణా అవుతుండగా పోలీసులకు పట్టుపడుతున్న పరిమాణం నామమాత్రమే.
ఇంతటి భారీ స్థాయిలో గంజాయి సాగు జరగడానికి, రవాణా సక్రమంగా సాగడానికి గంజాయి స్మగ్లర్లతో మావోయిస్టులకు ఉన్న సత్సంబంధాలే కారణమని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు స్మగ్లర్ల నుంచి కూడా మావోయిస్టులు సొమ్ములు వసూలు చేస్తున్నారని అంటున్నారు. పోలీసుల కథనాలకు భిన్నంగా మావోయిస్టుల వాదనలు ఉంటున్నాయి. పలు సందర్భాల్లో బహిరంగ లేఖలు విడుదల చేసిన మావోయిస్టు అగ్రనేతలు గంజాయి స్మగ్లింగ్‌లో పోలీసులు పాత్ర కీలకంగా ఉందని ఆరోపించారు. స్మగ్లర్లతో పోలీసులు కుమ్మక్కయి మామూళ్లు తీసుకుని వదిలేస్తున్నారని చెబుతున్నారు.