కౌంటర్ దాఖలు చేయండి
ఎన్‌కౌంటర్‌పై ఏపీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఏఓబీలో మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఉమ్మడి హైకోర్టు బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ఎన్‌కౌంటర్‌పై ఏపీ పౌరహక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారించింది. ఏపీ అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం ఏపీ పరిధిలో లేదని, అందువల్ల మృతదేహాలను ఇక్కడకు తరలించలేదని, కాబట్టి వాటిని భద్రపరిచే ప్రశ్నే తలెత్తదని చెప్పారు.
ఈ సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాది వి.రఘునాథ్ స్పందిస్తూ.. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏపీ పోలీసులు కూడా పాల్గొన్నారని ఏపీ డీజీపీ చెప్పారన్నారు. ఈ ఎన్‌కౌంటర్ ఘటనలో గాయపడిన ఓ పోలీసును అధికారులు విశాఖ ఆస్పత్రికి తరలించారని, అయితే చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను భద్రపరచలేదని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, ఒడిశాలో ఎన్‌కౌంటర్ జరిగిన నేపథ్యంలో ఈ వ్యాజ్యాన్ని విచారించే పరిధి ఉమ్మడి హైకోర్టుకు ఉందా? అంటూ సందేహం వ్యక్తం చేసింది. చట్ట ప్రకారం పోలీసులకు అరెస్ట్ చేసే అధికారం ఉందే తప్ప చంపే అధికారం లేదని వ్యాఖ్యానించింది. ఎన్‌కౌంటర్లలో పాల్గొన్న పోలీసులపై కేసు నమోదు చేయాలంటూ హైకోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు నిలుపుదల చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ వ్యాజ్యంలో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చి చెప్పింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.