పక్కా వ్యూహం! | Perfect strategy! | Sakshi
Sakshi News home page

పక్కా వ్యూహం!

Published Thu, Oct 27 2016 3:21 AM | Last Updated on Thu, Mar 28 2019 5:07 PM

పక్కా వ్యూహం! - Sakshi

పక్కా వ్యూహం!

- 24 గంటల్లో రెండు ఎన్‌కౌంటర్లంటూ పోలీసుల ప్రచారం  
- మారణకాండను సమర్థించుకునే ప్రయత్నం
 
 సాక్షి, విశాఖపట్నం: ఎన్‌కౌంటర్ జరిగి 24 గంటలు గడిచాక కూడా సంఘటనా స్థలంలోనే మావోయిస్టులు తలదాచుకుంటారా? వేలాది మంది పోలీసులను చూసిన తర్వాత కూడా ఎదురు కాల్పులు జరపాలనే ఆలోచన నలుగురు మావోయిస్టులకు వస్తుందా? ఎన్‌కౌంటర్‌పై పోలీసులు చేస్తున్న తప్పుడు ప్రచారానికి ఇంతకంటే మరో నిదర్శనం ఉంటుం దా? అని మావోయిస్టు నేతలు, ప్రజాసంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఎన్‌కౌంట ర్ జరిగిన తర్వాత తప్పించుకున్న మావోయిస్టులు సంఘటనా స్థలంలోనే గడిపే అవకాశం కచ్చితంగా ఉండదు. 24 గంటల పాటు అక్క డే ఉండి, తమపై ఎదురుకాల్పులు జరిపారని పోలీసులు చెబుతున్న మాటల్లో వాస్తవం కనిపించడం లేదు. నిజంగా మావోయిస్టులు అక్కడే పొదల్లో దాక్కొని ఉంటే వందలాది పోలీసుల గాలింపులో ముందే కనిపించేవారు. అంతేకాకుండా ప్రాణభయంతో తప్పించుకున్న వారు భారీ సంఖ్యలో ఉన్న పోలీసులను చూసి ఎదురుదాడికి దిగాలనుకోరు. లొంగిపోవడానికే మొగ్గుచూపుతారు.

 24 గంటల్లో రెండు ఎన్‌కౌంటర్లు
 కటాఫ్ ఏరియాలో సోమవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో వాటి నుంచి తప్పించుకునేందుకు పోలీసులు మరో ఎన్‌కౌంటర్‌ను తెరపైకి తెచ్చారు. ఒకేసారి 28 మందిని కాల్చిచంపి, రెండు విడతలుగా కాల్పులు జరిగినట్లు చిత్రీకరిస్తున్నారు. నిజానికి మంగళవారం ఎలాంటి ఎదురు కాల్పులు జరగకపోగా సోమవారం నాటి కాల్పుల ఘటనలోనూ మావోయిస్టులు ఏ విధంగానూ ప్రతిఘటించలేదు. పోలీసులు మాత్రం తొలిరోజు ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలోనే రెండో రోజూ ఎన్‌కౌంటర్ జరిగిందని చెప్పి మరిన్ని అనుమానాలకు తావిచ్చారు. కటాఫ్ ఏరియాలో మావోయిస్టులను గుర్తించి లొంగిపొమ్మని చెప్పినా వారు వినకుండా తమపై కాల్పులు జరపడంతో గత్యంతరం లేక ఎదురుకాల్పులు జరిపామని, ఫలితంగా 24 మంది మావోయిస్టులు హతమయ్యారని సోమవారం సాయంత్రం పోలీసులు వెల్లడించారు. కొందరు మావోయిస్టులు తీవ్రంగా గాయపడి తప్పించున్నారని, ఘటనా స్థలంలో మృతదేహాల కోసం వెతుకుతున్నామని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అన్నారు. సరిగ్గా ఇరవై నాలుగు గంటల తర్వాత మరో ఎన్‌కౌంటర్ జరిగిందంటూ లీకులిచ్చారు.

 సెలైన్సర్ గన్‌తో సెంట్రీని చంపేసి..
 ఎన్‌కౌంటర్ అంటూ 28 మందిని హతమార్చిన పోలీసులు దాడికి పన్నిన వ్యూహాన్ని పక్కాగా అమలు చేశారు. ఇన్‌ఫార్మర్లు ఇచ్చి న సమాచారంతో ప్లీనరీ ప్రదేశానికి రెండు రోజుల ముందుగానే చేరుకున్నారు. సెంట్రీగా ఉన్న 14 ఏళ్ల బాలుడిని సెలైన్సర్ గన్‌తో కాల్చి చంపినట్లు తెలిసింది. అనంతరం నిద్రలో ఉన్న మావోయిస్టులను చుట్టుముట్టి కాల్చేశారని సమాచారం. మావోయిస్టులను పట్టుకుని అతి దగ్గరగా కాల్చినట్లుగానే బుల్లెట్ గాయాలున్నట్లు మృతదేహాల పోస్టుమార్టంలో వైద్యులు గుర్తించినట్లు సమాచారం. ఆశ్చర్యం నుంచి తేరుకునేలోపే ప్రాణాలు వదిలినట్లు మావోయిస్టుల మృతదేహాలన్నీ కళ్లు, నోరు తెరుచుకుని ఉండటం కూడా పట్టుకుని కాల్చేశారనే వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. చనిపోయిన 28 మంది మావోయిస్టుల్లో ఇప్పటివరకు 18 మందిని గుర్తించినట్లు ఒడిశా హోంశాఖ కార్యదర్శి అసిత్ త్రిపాఠి చెప్పారు.
 
 మృతుల్లో 20 మంది గుర్తింపు
 ఏఓబీలో ఎన్‌కౌంటర్ సృష్టించిన భయాందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. కూంబింగ్ దళాలు ఘటనా ప్రాంతం నుంచి వెనుతిరుగుతున్నాయి. వారి స్థానంలో కొత్త బలగాలు రంగంలోకి దిగుతున్నాయి. భద్రతా సిబ్బంది హెలికాప్టర్లలో టార్గెట్ ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ఎన్‌కౌంటర్‌లో మొత్తం 28 మంది మావోయిస్టులు చనిపోగా, బుధవారం సాయంత్రానికి మృతుల్లో 18 మందినే గుర్తించామని పోలీసులు అధికారికంగా చెబుతున్నారు. అయితే, 20 మంది వివరాలు బయటకొచ్చాయి. మంగళవారం 14 మందిని గుర్తించగా, బుధవారం ఆరుగురిని గుర్తించినట్లు సమాచారం.  

 బుధవారం గుర్తించిన మావోయిస్టుల వివరాలు: 1. కిరణ్, డీవీసీఎం, పశ్చిమగోదావరి జిల్లా, 2. రమేష్, డీసీఎం, మర్రిగెడ్డ గ్రామం, మల్కన్‌గిరి, ఒడిశా, 3. దావీద్, ఏసీఎం, పశ్చిమగోదావరి జిల్లా, 4. ఎర్రాలు, ఏసీఎం, సౌత్ బస్తర్, 5. మంజుల, ఏసీఎం, దర్భ ఏరియా, చత్తీస్‌గఢ్, 6. రమి, దళం మెంబర్, మల్కన్‌గిరి, ఒడిశా
 
 సింహాచలం మృతదేహానికి అంత్యక్రియలు

 తెర్లాం రూరల్: ఏఓబీ ఎన్‌కౌంటర్‌లో మరణించిన విజయనగరం జిల్లా తెర్లాం మండ లం చిన నందబలగ గ్రామానికి చెందిన మావోయిస్టు యామలాపల్లి సింహాచలం అలియాస్ పెద్దమురళి అలియాస్ హరి మృతదేహానికి బుధవారం కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.సింహాచలం మృతదే హాన్ని చూసి అతని భార్య మహాలక్ష్మి, తండ్రి సత్యంనాయుడు, ఇతర బంధువులు బోరున విలపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement