ఆ కాల్పులు వ్యవస్థకే సవాళ్లు..!
అభిప్రాయం
ప్రతి పనిలో స్వంత లాభం ఏమిటి అని ఆలోచించి, దాన్ని సాధించుకోవడమే వ్యక్తిత్వ వికాసమైన స్థితిలో.. తమ సొంతం కోసం కాకుండా పీడిత ప్రజల పక్షాన నిలబడే వారి నిజాయితీని తప్పు పట్టడం కష్టం. అలాంటి వారు దశాబ్దాలుగా మరణిస్తూ ఉండటమూ కలత పెట్టే అంశమే.
ఆంధ్ర ఒడిశా సరిహద్దులో పోలీసు కాల్పుల వల్ల ముప్పై మంది మావోయిస్టులు చనిపోయారన్న విషయం త్వరలోనే వార్తా పత్రికలలో కనిపించదు. అయితే సాయుధ వామపక్ష ప్రతిఘటన ఉద్యమం అనే రాజకీయ పోరాటం మాత్రం మన ప్రజాస్వామ్యంపై ఎక్కుపెట్టిన ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవలసిన అవస రాన్ని, అదే నిజమైన విముక్తి మార్గంగా నమ్మిన వారు కోల్పోయే ప్రాణాల ద్వారా గుర్తు చేస్తూ ఉంటుంది. మనం ప్రజాస్వామ్యంగా పిలుచుకుంటున్న ఈ పాలనా వ్యవస్థ నియమబద్ధతను పాటించి ఇలాంటి కాల్పుల ఘటనలు ఎందుకు జరుగుతున్నాయో మనకు సమాధానం చెప్పే అవకాశం తక్కువ.
ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ ప్రజల మూక పాలన కాదనీ ప్రజలు తమ అనుభవాల వెలుతురులో చర్చించుకొని రూపొందించు కున్న నియమాల అనుసారం సాగే పాలన అనే అర్థం ఉంది. అందుకే వ్యక్తిస్వేచ్ఛకు ప్రాధాన్యతను ఇచ్చే లిబరల్ కాపిటలిస్ట్ సమాజాలు కానీ, సమానత్వానికి ప్రాధాన్యతను ఇచ్చే సోషలిస్ట్ సమాజాలుగానీ తమ పాలనా రూపాలను ప్రజాస్వామిక రూపాలనే పేర్కొంటు న్నాయి. అయితే ప్రజాస్వామిక రాజ్యాలు అని ప్రకటించుకున్నవి తమ పనితీరుతోనే.. సదరు రాజ్య వ్యవస్థ స్వేచ్ఛా సమానత్వాల సమతులనాన్ని పట్టించుకునేటట్టు చూడవలసి ఉంటుంది. ఈ పని చెయ్యడంలో విఫలమైన ప్రతిచోటా ఆ వైఫల్యపు తీవ్రత, అక్కడి ప్రజల స్పందనను బట్టి పోరాటాలు ఉంటాయి.
మన దేశంలోనూ నిరాయుధ, సాయుధ పద్ధతుల్లో పోరాటాలు సాగుతూనే ఉన్నాయి. జమ్మూ కశ్మీరులో ప్రజలపట్ల మన ప్రభుత్వం వ్యవహార శైలి మీద, ఈశాన్య భారత్‌లో మన సైన్యం జులుం పట్ల, ఆదివాసీ ప్రాంతాలల్లో వనరుల కోసం జరుగుతున్న విధ్వంసంపట్ల, గ్రామం నగరం తేడా లేకుండా సాగుతున్న అమానవీయమైన అవి నీతి మీద ప్రతిఘటన సాగుతూనే ఉన్నది. ఆ పోరాటాల శక్తి, వాటికి దొరికే మద్దతు సందేహమే. కానీ పోరాటాలు సాగుతూనే ఉంటాయి.
ఇటువంటి పోరాటాల వరుసలో, వ్యవస్థ సమూల మార్పు కోసం సాగే పోరాటంగా ప్రకటించుకుంటున్న మావోయిస్టు సాయుధ విప్లవ పోరాటం గత 40 ఏళ్ల పైబడి ఉనికిలో ఉన్నది. ‘‘పీడిత వర్గాలు దీర్ఘకాల ప్రజాయుద్ధం ద్వారా ఈ వ్యవస్థను కూలదోసి నిజమైన ప్రజాస్వామ్యాన్ని స్థాపించడం ద్వారానే విమోచన పొందుతారు’’ అనే విశ్వాసంతో వీరు పోరాడుతున్నారు. ఈ సాయుధ పోరాటపు గమనం, వారి విశ్వాసమూ ప్రశ్నలకు అతీతమైనవి కావు. ప్రస్తుతం ఆదివాసీ ప్రాంతాలలో వనరుల మీద దేశీయ, అంతర్జాతీయ పెట్టుబ డులు పట్టు బిగిస్తున్నాయి. ఆదివాసులు మునుపటికంటే ఎక్కువగా జీవన్మరణ పోరాటం చేయక తప్పని పరిస్థితికి వచ్చారు. అందుకే సాయుధ పోరుకు మద్దతు అధికంగా ఉన్నది. అంటే అక్కడ మాత్రమే సమస్యకూ, పోరాటానికి మధ్య బలమైన సంబంధం కనిపిస్తున్నది. మైదాన ప్రాంతాలలో ఒకనాడు ఈ ఉద్యమానికి (కనీసం తెలుగు ప్రాంతాలలో) ఉన్న మద్దతు కూడా ఇప్పుడు కనిపించడం లేదు. మైదాన ప్రాంతాలలో సమస్యలు ఏమీ లేవని అర్థం కాదు.
ప్రతి పనిలో స్వంత లాభం ఏమిటి అని ఆలోచించి, దాన్ని నేర్పుగా సాధించుకోవడమే లక్ష్యమైన స్థితిలో కేవలం తమ సొంత తృప్తి కోసం కాక పీడిత ప్రజల పక్షాన నిలబడే వారి నిజాయితీని పూర్తిగా తప్పుబట్టడం కష్టం. అట్లాంటి వారు దశాబ్దాలుగా మర ణిస్తూ ఉండటమూ కలత పెట్టే అంశమే. పారిన రక్తానికీ, సాధించిన మార్పుకూ మధ్య పొంతన లేకపోవడం కూడా సమస్యనే. స్వాతం త్య్రానికి ముందూ తరువాతా, అటువంటి వారి త్యాగాలు ఒకమేర ప్రభావితం చేయడం ద్వారా రూపొందిన ప్రజాస్వామిక చట్టాలు కూడా అమలు కాని స్థితి భయం పుట్టిస్తోంది. మనం వ్యవస్థీకృత హింస పట్ల భయం వల్లనో, నిస్సహాయత వల్లనో, ఆ హింస ద్వారా మన ప్రయోజనాలు నడిచి పోతున్నాయి అనో.. చల్నేదో అనుకునే స్థితి ఉన్నంత సేపు ఏదో ఒక మూల సాయుధ వామపక్ష రహస్యో ద్యమం.. అది ఎంత అశక్తమైనదీ, పెద్దగా సానుకూల ఫలితాలు సాధించలేనిదీ అయినా సరే... ఒకమేర పీడితులకు, వ్యవస్థాపరమైన అన్యాయాన్ని సహించనివారికీ అది ఒక ఆకర్షణీయమైన పోరాట మార్గంగా కనిపించడాన్ని మాత్రం అసంబద్ధం అనలేము.
వ్యవస్థీకృత హింసను మనం వ్యక్తుల స్థాయిలో, కుటుంబాల స్థాయిలో, కులాల లేదా ఇతర సాంççస్కృతికS సముదాయాల స్థాయిలో గుర్తించి తీరాలి. అట్లనే వాటికి బయట ఉన్న సామాజిక, సాంçస్కృతిక, ఆర్ధిక, రాజ్య సంబంధ నిర్మాణాల పనితీరులో నిరం తరం గుర్తించడం ఎదుర్కోవడం చెయ్యవలసి ఉంటుంది. ఎందు కంటే ఆ హింస మూలాలు మన ఆలోచనల్లో, ప్రవర్తనల్లో, మన చుట్టూ ఉన్న వ్యవస్థల పని తీరులో ఉన్నవి అని గుర్తించాలి. మచ్చుకు, ఆడపిల్లను మనిషిగా గుర్తించకపోవడం, పక్కవాడిని కులంపేరనో మతం పేరనో చిన్న చూపు చూడటం మొదలు అడ్డమైన గడ్డి తిని సంపన్నులవుతున్న వారి అడుగులకు మడుగులొత్తడం వంటి వాటితో మొదలుకొని.. చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష అను కుంటూ ఎవడికి ఏమయితేనేమి నేను బాగుంటే చాలుననే చింతనే వ్యవస్థీకృత హింసకు ఊతమిస్తుందని గుర్తించడం అవసరం. ఇటు వంటి వాతావరణంలో నియమబద్ధ ప్రజాస్వామ్యం బతికి బట్ట కట్టదని గుర్తించడం ప్రస్తుత అత్యవసరం. నిత్య జీవితంలో అన్యా యాన్ని గుర్తించి వ్యతిరేకించే కార్యాచరణ విస్తృత స్థాయిలో నిరం తరం సాగడం మన అవసరం.
వ్యవస్థీకృత హింసనూ, దానిని పెంపొందించే అప్రజాస్వామిక వ్యవస్థను మనం ప్రాణ హాని లేని, లేక తక్కువ ప్రాణహాని ఉండే ప్రయత్నాల ద్వారా లేక ప్రజాస్వామికంగా మార్చుకోగలమా? అన్న కీలకమైన, తప్పించుకోలేని ప్రశ్న ఇటువంటి (మావోయిస్టుల) మర ణాలు సంభవించిన ప్రతిసారీ ముందుకొస్తుంది. ఈ ప్రశ్నను ఎదు ర్కొని దానికి సమాధానం ఎదుర్కునే పయనమే ప్రజాస్వామిక జీవితాన్ని నిలిపే పోరాటమనీ, దాన్ని నిత్య జీవితంలోకి తెచ్చు కోవడం అవసరమనీ మనం గుర్తించాలంటూ ఇలాంటి మరణాలు మనలను మళ్ళీ మళ్ళీ కోరుతున్నాయి అని గ్రహించడం అత్యవసరం.
వ్యాసకర్త హెచ్ వాగీశన్ అసిస్టెంట్ ప్రొఫెసర్, పొలిటికల్ సైన్స్
నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, హైదరాబాద్
మొబైల్ : 9440253089