దోపిడీపై తిరుగుబాటు
మౌలిక వసతులు.. గిట్టుబాటు ధరల విషయంలో దళారుల దోపిడీ.. బాక్సైట్ తవ్వకాలు వంటి అంశాల్లో ప్రభుత్వాలు గిరిజనులను పట్టించుకోకపోవడమే వారిని మావోయిస్టు ఉద్యమం వైపు ఆకర్షితులయ్యేలా చేసింది. ప్రభుత్వాల తీరుతో దశాబ్దాలుగా తీవ్రంగా నష్టపోయి.. అభివృద్ధికి దూరంగా కారడవుల్లో మగ్గిపోయిన గిరిజనులు మావోయిస్టులకు ఆశ్రయమిచ్చేవారు.. క్రమంగా ఉద్యమంలో భాగస్వాములయ్యారు. దశాబ్దాల క్రితం ఏజెన్సీలో దళారీ వ్యవస్థ ఆధిపత్యం చెలాయించేది. గిరిజనుల పంటలకు మదుపుల పేరుతో అడ్వాన్సులు ఇచ్చి.. పంట ఉత్పత్తులను తమకే అమ్మాలని దళారులు షరతులు పెట్టేవారు.
పంట అమ్మే సమయంలో తమకు నచ్చిన రేటు కట్టి గిరిజనులను దోపిడీ చేసేవారు. ఇక దళారులతోపాటు గ్రామాల్లోకి వచ్చే పోలీసుల దౌర్జన్యాలకు, గిరి మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడేవారు. ఇవేవీ ప్రభుత్వాల దృష్టికి వెళ్లేవికావు. ఒకవేళ వెళ్లినా చర్యలు ఉండేవి కావు. విద్య, వైద్యం, రవాణా, తాగునీరు వంటి కనీస సౌకర్యాల కల్పన విషయంలో ప్రభుత్వాలు గిరి పల్లెలను అసలు పట్టించుకోలేదు. ఫలితంగా విద్య, ఉపాధి అవకాశాలకు దూరమైన గిరిజన యువత మావోయిస్టు ఉద్యమం వైపు మొగ్గు చూపారు.
బలిమెల రిజర్వాయర్‌లో ముంపునకు గురైన వేలాది ఎకరాల భూములకు బదులు ప్రభుత్వం ఇచ్చిన అటవీ భూములు పంటల సాగుకు పనికి రాకపోగా.. అందుకు ప్రభుత్వం నుంచీ ఎటువంటి సహకారం లభించలేదు. దీంతో పెద్దగా పెట్టుబడి లేకుండానే వేలాది రూపాయల ఆదాయం సమకూర్చే గంజాయి సాగు వైపు గిరిజనులు మొగ్గుచూపారు. అలాగే బాక్సైట్ తవ్వకాల వల్ల అడవులు నాశనమవుతాయని..గిరిజనుల మనగడకే ముప్పు వస్తుందని గిరిజనులతోపాటు పర్యావరణవేత్తలు చేస్తున్న ఆందోళనలు అరణ్యరోదనగానే మిగిలాయి. ఈ పరిస్థితులన్నింటినీ అవకాశంగా తీసుకున్న మావోయిస్టులు అడవుల్లోకి చొచ్చుకుపోయి.. గిరిజనులతో మమేకమవుతూ.. వారి పక్షాన పోరాటాలు చేస్తూ.. ఏవోబీని బలమైన కోటగా మలచుకున్నారు.