అది ఆర్కే అడ్డా | It is RK Adda | Sakshi
Sakshi News home page

అది ఆర్కే అడ్డా

Published Sun, Oct 30 2016 2:29 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

అది ఆర్కే అడ్డా - Sakshi

అది ఆర్కే అడ్డా

మల్కన్‌గిరి అటవీ ప్రాంతం మావోయిస్టు కే ంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ(ఆర్కే) అడ్డా లాంటిది. మల్కన్‌గిరి జిల్లాలో 1,430 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం ఉంది. దట్టమైన ఆ రిజర్వు ఫారెస్టును స్థావరంగా చేసుకుని దశాబ్దాల తరబడి అక్కడ నుంచే ఆయన తన కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఆర్కేకు మూడంచెల భద్రత ఉంటుంది. పది నుంచి 20 కిలోమీటర్ల దూరంలో మావోయిస్టు దళ సభ్యులు ఆయనకు రక్షణగా ఉంటారు. దట్టమైన అటవీ ప్రాంతంలో వీరిని దాటుకుని వెళ్లడం పోలీసులకు కత్తిమీద సాములాంటిది. ఆ అటవీ ప్రాంతంలో ఎక్కడికక్కడే మందుపాతర్లను అమర్చి ఉంటారు.

ఒకవేళ పోలీసులు ప్రమాదాన్ని ఊహించి తప్పించుకుని వద్దామన్నా బలిమెల రిజర్వాయరును దాటుకుని రావాల్సి ఉంటుంది. లాంచీల్లో వచ్చేద్దామన్నా ఎగువన ఉన్న కొండపై నుంచి మావోలు కాల్పులు జరపడానికి అనువుగా ఉంటుంది. 2008లో బలిమెల రిజర్వాయరులో కూంబింగుకు వెళ్లి వస్తున్న గ్రేహౌండ్స్ దళాల లాంచీపై రాకెట్ లాంఛర్లతో ఇలాగే దాడి చేసి 38 మందిని బలి తీసుకున్న విషయం తెలిసిందే. అటవీ ప్రాంతంలో పలుమార్లు జరిగిన ఎన్‌కౌంటర్లలో కొందరు మావోలు మరణించినా ఆర్కే తప్పించుకోగలగడానికి ఈ పరిస్థితులే కారణం.
 
 మావోల కంచుకోట ఏవోబీ
 ఏవోబీ పేరు వినగానే ముందు గుర్తొచ్చేది మావోయిస్టులు.. తర్వాత గంజాయి సాగు. ఇక్కడి కొండలు, గుట్టలు, దట్టమైన అటవీ ప్రాంతం, కనీస సదుపాయాలకు నోచుకోని గిరిజన తండాలు. అక్కడి వారికి ఉపాధి లేని పరిస్థితులు ఉద్యమానికి ఊపిరి పోశాయి. తూర్పు కనుమల్లోని ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 9 జిల్లాల పరిధిలో విస్తరించిన ఏవోబీ జోన్ ఉద్యమానికి పెట్టని కోట. దీని పరిధిలో ఉన్న ఆంధ్రకు చెందిన తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు.. ఒడిశాకు చెందిన గంజాం, గజపతి, రాయగడ, కొరాపుట్, మల్కన్‌గిరి జిల్లాల్లోని అటవీ ప్రాంతాలు మావోయిస్టులకు ఆయువుపట్లు. ఈ ప్రాంతాలను విభజించి కార్యకలాపాలు సాగిస్తున్నారు.

 పట్టున్న ప్రాంతాలు: సీలేరు నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న విశాఖ జిల్లాలోని దుర్గం, జాజిపాలెం, గడ్డిబంద, కాకులగెడ్డ, మల్కన్‌గిరి జిల్లాలోని  బిర్సింగి, గొంది, గుమ్మాబ్లాక్, చిత్రకొండ, కలిమెల, బలిమెల, ఎంపర్ల మెట్ట, టెక్ పొదర్, కొరాపుట్ జిల్లాలోని నారాయణపట్న, బందుగాం, చినబురిగి, పెదబురిగి, మంగళపురం బ్లాక్‌లు, విజయనగరం జిల్లా పార్వతీపురం, కొమరాడ, సాలూరు, మక్కువ, విశాఖ జిల్లాలోని జీకేవీధి, చింతపల్లి, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో మావోలకు మంచి పట్టుంది.

 కాలినడకే శరణ్యం: ఆంధ్రతోపాటు ఒడిశాలోని చాలా ఏజెన్సీ గ్రామాలకు కాలి నడకే శరణ్యం. ముఖ్యంగా ఒడిశాలోని చిత్రకొండ నుంచి బలిమెల రిజర్వాయర్‌కు ఆనుకుని ఉన్న దర్లవాడ, పనసపుట్టు, పంపరుమెట్ట, జనభ, ఆండ్రపల్లి పంచాయతీల పరిధిలోని గ్రామాలకు వెళ్లాలంటే చిత్రకొండ నుంచి లాంచీల్లో ప్రయాణం చేయాల్సిందే. ఈ గ్రామాలకు అంబులెన్స్ వంటి అత్యసర సేవలను అసలు ఊహించలేం. వ్యాధులు వస్తే మరణం తప్ప నివారణం లేదు. ఈ వెనుకబాటుతనమే గిరిజనులను మావోయిస్టు ఉద్యమం వైపు నెడుతోంది. వందల మంది గిరిజన యువత మిలిషియా కమిటీల్లో చేరి పనిచేస్తున్నారు. అలాగే చాలా మంది దళాల్లో చేరారు. వారి సాయంతోనే ఈ ప్రాంతాన్ని మావోయిస్టులు తమ గుప్పిట్లో ఉంచుకోగలుగుతున్నారు.
 
 ఏవోబీ పరిధి 9 జిల్లాలు
 ఆంధ్రలో: తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు
 ఒడిశాలో: చెందిన గంజాం, గజపతి, రాయగడ, కొరాపుట్, మల్కన్‌గిరి జిల్లాలు.
 
 బలిమెలకు ఆ పేరు ఎలా వచ్చిందంటే...
 బలిమెలకు ఆ పేరు ఎలా వచ్చిందనే దానిపై చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. స్థానికులు చెబుతున్న ఓ కథనం మేరకు.. ఏదైనా పెద్ద ప్రాజెక్టును నిర్మించాలంటే పూర్వకాలంలో బలి ఇవ్వడం పరిపాటి. బలిమెల రిజర్వాయర్ నిర్మించే సమయంలో మహిళలకు అమ్మవారు పూని రిజర్వాయర్‌లో నీరు ఎప్పుడూ పుష్కలంగా ఉండాలంటే నిర్మాణం పూర్తయ్యేవరకూ తనకు నిత్యం బలి ఇమ్మని కోరారని స్థానికులు చెబుతున్నారు. ఆందోళన చెందిన ప్రజలు నిత్యం నరబలి ఇవ్వలేమని, జంతు బలి ఇచ్చేందుకు తమకు సమ్మతమేనని అమ్మవారికి వేడుకున్నారు. చిత్రకొండ ప్రాంతంలోని బలిమెల రిజర్వాయర్ నిర్మాణం పూర్తయ్యే వరకూ ఇక్కడి గిరిజనులు, మైదాన ప్రాంతంలోని జనం నిత్యం ఎక్కడో ఒక దగ్గర జంతు బలి ఇచ్చేవారని.. అందుకే ఈ రిజర్వాయర్‌కు బలిమెల రిజర్వాయర్ అని పేరు పెట్టినట్టు చెబుతున్నారు.
 
 ‘గురుప్రియ’ వంతెన నిర్మాణం జరిగితే..
 మావోయిస్టులకు అత్యంత అనుకూలంగా ఉన్న ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని మల్కన్‌గిరి అటవీ ప్రాంతంపై పట్టుకోసం అటువైపు ఉన్న ఒడిశా ప్రభుత్వం ఎప్పట్నుంచో ప్రయత్నిస్తోంది. అక్కడ ఏం జరుగుతుందో పోలీసులకు ఇసుమంతైనా సమాచారం లభించే అవకాశం ఉండదు. ఈ అడవుల్లో మావోయిస్టులు తుపాకుల కర్మాగారంతో పాటు పేలుడు పదార్థాల తయారీ యూనిట్‌ను ఏళ్ల తరబడి నడుపుతున్నట్టు గతేడాది సెప్టెంబర్ 18న పోలీసులు గుర్తించారు. అనంతరం దానిని నిర్మూలించారు. ఇంతటి పటిష్టమైన మావో సామ్రాజ్యంలోకి ప్రవేశించేందుకు వీలుగా మల్కన్‌గిరి జిల్లాలో బలిమెల రిజర్వాయరుకు సమీపంలో గురుప్రియ నదిపై రూ. 188 కోట్లతో 910 మీటర్ల పొడవైన వంతెన నిర్మాణంతోపాటు రోడ్ల నిర్మాణాలకు 1982లోనే ఒడిశా సీఎం బిజూ పట్నాయక్ పునాది రాయి వేశారు.

ఆ వంతెన నిర్మాణం జరిగితే కటాఫ్ ఏరియాలోని 154 గిరిజన గ్రామాలకు రాకపోకలు సాగించడానికి వీలవుతుంది. దీంతో మావోయిస్టు కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయవచ్చన్నది కేంద్రం, ఒడిశా ప్రభుత్వాల వ్యూహం. ఈ ఎత్తుగడను గమనించిన మావోయిస్టులు గురుప్రియ వంతెన నిర్మాణం జరగకుండా ఎదురు దాడులు చేస్తూ వస్తున్నారు. గతేడాది ఆగస్టు 29న బీఎస్‌ఎఫ్ జవాన్లపై మావోయిస్టులు కాల్పులు జరపడంతో ఆరుగురు మరణించారు. ఈ బ్రిడ్జి కాంట్రాక్టును దక్కించుకున్న గామన్ ఇండియా కంపెనీ ప్రతినిధులు, కార్మికులను హెచ్చరించడంతో ఆ సంస్థ కాంట్రాక్టును ఉపసంహరించుకుని వెనక్కి వెళ్లిపోయింది. చివరకు కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థకు సరిహద్దు భద్రతా దళాల(బీఎస్‌ఎఫ్) రక్షణగా ఉంచుతామన్న హామీతో కోల్‌కతాకు చెందిన రాయల్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ ముందుకొచ్చింది. వాస్తవానికి ఈ వంతెన ఈ ఏడాదే పూర్తి కావలసి ఉంది. కానీ మావోయిస్టుల దాడులు, హెచ్చరికలతో ఇప్పటిదాకా 20 శాతం పనులు కూడా పూర్తి కాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement