
ములుగు: కొడిశాల అటవీ ప్రాంతంలో వేటగాళ్లు ఏర్పాట్లు చేసిన ఉచ్చుకు పులి బలైంది. ములుగు జిల్లా ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం కొడిశాలకు చెందిన ఐదుగురు వేటగాళ్లు అటవీప్రాంతంలో ఉచ్చులను ఏర్పాటు చేశారు. రెండువారాల క్రితం ఏర్పాటు చేసిన ఉచ్చుకు చిక్కుకొని గేదె మృతి చెందింది. అయినా అటవీ అధికారులు స్పందించలేదు. అదే ఉచ్చుకు తాజాగా పులి బలి అయినట్లుగా సమాచారం.
రెండురోజుల క్రితం కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో పోలీసులకు పులి కళేబరం కనిపించింది. దీంతో కూపీ లాగిన పోలీసులు వేటగాళ్లను గుర్తించడంతోపాటు వారి నుంచి పులిచర్మం, ఎనిమిది గోర్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇటీవల జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాలోని దట్టమైన అటవీప్రాంతంలో సంచరించిన పులి ఇదేనని స్థానికులు చర్చించుకుంటున్నారు. అటవీశాఖ అధికారులు ఉచ్చులు వేసిన వేటగాళ్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై వివరణ కోరేందుకు ప్రయత్నించినా అటవీ, పోలీస్ అధికారులు స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment