రక్షణ గాలికి! | Not caring abount Forest land | Sakshi
Sakshi News home page

రక్షణ గాలికి!

Published Sat, Feb 18 2017 11:39 PM | Last Updated on Tue, Sep 5 2017 4:02 AM

రక్షణ గాలికి!

రక్షణ గాలికి!

సాక్షి, మెదక్‌ : జిల్లాలో అటవీభూముల రక్షణ గాలిలో దీపంలా మారింది. అటవీభూములను సంరక్షించాల్సిన అటవీశాఖ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. అడవులను సంరక్షించాల్సిన అటవీశాఖ భూముల  రక్షణ బాధ్యతలను గాలికి వదిలేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా అటవీభూములు అన్యాక్రాంతం అవుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అటవీ భూముల సంరక్షణ కోసం ప్రభుత్వం కందకాలు తవ్వాలని స్పష్టంగా ఆదేశించినా అటవీశాఖ అధికారులు అమలులో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో ఈ ఏడాది రెండు విడతల్లో 352 కిలోమీటర్ల మేర కందకాలు తవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు 41 కిలోమీటర్ల మేర మాత్రమే కందకాల తవ్వకం పూర్తయ్యింది. ఇంకా 311 కిలోమీటర్ల మేర కందకాలు తవ్వాల్సి ఉంది. కందకాల తవ్వకాల్లో ఇంత జాప్యం జరగడం అటవీభూముల అన్యాక్రాంతానికి దారి తీస్తుంది.

జాప్యంతో భూములు అన్యాక్రాంతం?
అటవీ భూముల చుట్టూ కందకాలు తవ్వకపోవడంతో అటవీ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని 20 మండలాల్లో పదిహేడింటిలో 56,938 హెక్టార్ల మేర అడవులు ఉన్నాయి. మెదక్‌ రేంజ్‌లో 11137 హెక్టార్లు, రామాయంపేటలో 9086 హెక్టార్లు, తూప్రాన్‌లో 13326 హెక్టార్లు, నర్సాపూర్‌లో 11,134 హెక్టార్లు,  కౌడిపల్లిలో 6363 హెక్టార్లు, పెద్దశంకరంపేటలో 5890 హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. ఈ భూములను రక్షించేందుకు ప్రభుత్వం అటవీభూముల చుట్టూ కందకాలు తవ్వించాలని ఆదేశించింది. ఈ మేరకు లక్ష్యం నిర్ధారించి అవసరమైన నిధులను విడుదల చేస్తుంది.

అయితే అధికారులు కందకాల తవ్వకాల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారుల సమాచారం మేరకు గడిచిన రెండేళ్లకు గాను మొత్తం 1123 కిలోమీటర్ల మేర అటవీభూముల చుట్టూ కందకాలు తవ్వాల్సి ఉంది. అయితే అధికారులు 210 కిలోమీటర్లు మాత్రమే కందకాలు తీయించారు. ఇంకా 913 కిలోమీటర్ల కందకాలు అటవీభూముల చుట్టూ తవ్వాల్సి ఉంది.

నర్సాపూర్‌ మండలం కొండాపూర్‌ విలేజ్, చిన్నచింతకుంట, పెద్దచింతకుంట గ్రామాల అటవీభూముల చుట్టూ కందకాలు తవ్వాల్సి ఉండగా ఆ పనులు జరగడం లేదు. ఘనపూర్‌ మండలంలో 11 కిలోమీటర్ల మేర కందకాలు తవ్వాల్సి ఉంది. అయితే ఏడు కిలోమీటర్లు మాత్రమే కందకాలు తవ్వారు. గంగాపూర్‌లో కందకాల తవ్వకం జరగడం లేదు. రామాయంపేట, తూప్రాన్, కౌడిపల్లి, పెద్దశంకరంపేటలో సైతం కందకాల తవ్వకాలు జరగడం లేదు.

రెవెన్యూ, అటవీశాఖ మధ్య సమన్వయలోపం వల్ల కందకాల తవ్వకాల్లో జాప్యం నెలకొంటోందని అధికారులు చెబుతున్నారు. అటవీశాఖ తమ భూములు సర్వే చేయించి హద్దులను గుర్తిస్తే ఆ ప్రాంతంలోని రైతులు, గిరిజనులు తమ భూములు అంటూ కందకాల తవ్వకానికి అడ్డుపడుతున్నారు. దీంతో రెవెన్యూ, అటవీశాఖ అధికారులు జాయింట్‌ సర్వే చేయాల్సి వస్తోంది. అయితే అటవీ, రెవెన్యూశాఖ అధికారులు బిజీగా ఉండడం, సమన్వయ లోపంతో  జాయింట్‌ సర్వే జరగడం లేదు. మెదక్, నర్సాపూర్, చిన్నశంకరంపేట మండలాల్లో జాయింట్‌ సర్వేల్లో జాప్యం జరుగుతోంది. ఫలితంగా కందకాల తవ్వకాలు  ఎక్కడికక్కడే ఆగిపోతున్నాయి.

త్వరితగతిన పూర్తయ్యేలా చూస్తాం
జిల్లాలో లక్ష్యం మేరకు కందకాల తవ్వకాలు జరిగేలా చూస్తున్నాం. జాయింట్‌ సర్వే, కాంట్రాక్టర్ల కొరత కారణంగా కందకాల తవ్వకాల్లో జాప్యం జరుగుతోంది. ఒక బ్లాక్‌లో కిలోమీటర్‌ కందకం తవ్వకానికి రూ.1.40 లక్షలు చెల్లిస్తున్నాం. దీనికోసం అధికారులు టెండర్లు ఆహ్వానిస్తున్నారు. అయితే కాంట్రాక్టర్లు ముందుకురావడం లేదు. జాయింట్‌ సర్వేలో జాప్యం వల్ల సైతం కందకాల తవ్వకాల్లో జాప్యం జరుగుతోంది. వీటన్నింటినీ అధిగమించి కందకాల తవ్వకాలను లక్ష్యం మేరకు పూర్తి చేస్తాం.
          – పద్మజారాణి, డీఎఫ్‌ఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement