‘‘నేను నా రెండెకరాల్లో వరి సాగుచేస్తున్నాను. ప్రభుత్వం అందించిన రైతుభరోసా సాగు పెట్టుబడికి ఎంతో ఉపయోగపడుతోంది. రాయితీ విత్తనాలు కూడా అందించి అండగా నిలుస్తోంది. ఈ ఏడాది 1070 వరి రకాన్ని సాగుచేశా. మంచి దిగుబడులు సాధిస్తున్నా. అటవీ ఫలాలు సేకరణతోనే కుటుంబాన్ని పోషిస్తూ గతంలో అవస్థలుపడ్డ నేను ఇప్పుడు ప్రభుత్వ సహకారంతో ఆహార పంటలూ పండిస్తూ సమాజంలో గౌరవంగా జీవిస్తున్నాను.’’
– కుర్సం రాజు, మెరకగూడెం, బుట్టాయగూడెం మండలం, ఏలూరు జిల్లా
సాక్షి, అమరావతి: నిన్న మొన్నటి వరకు కేవలం అటవీ ఫలాల సేకరణపైనే ఆధారపడ్డ గిరిపుత్రులు ఇప్పుడు అద్భుతాలు సృష్టిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు, సహకారంతో ఇతర అన్ని ప్రాంతాల్లోని రైతుల మాదిరిగానే ఆహార పంటలు పండిస్తూ వారితో సాగులో పోటీపడుతున్నారు. వీరికి ప్రభుత్వం పెద్దఎత్తున ఆర్వోఎఫ్‌ఆర్ పట్టాల ద్వారా భూమిని పంపిణీ చేయడంతో అడవి బిడ్డలు ఇప్పుడు ఉద్యాన, వ్యవసాయ పంటల సాగువైపు మళ్లుతున్నారు.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాగు పద్ధతులను అవలంబిస్తూ మేలైన దిగుబడులు సాధిస్తున్నారు. పోడు వ్యవసాయం, వంతుల సాగు, టెర్రస్ సాగు, వర్షాధార సాగు, మిశ్రమ పంటలు వేయడం, అంతర్ పంటలు, ఆర్గానిక్ వ్యవసాయం, జీరో బడ్జెట్ వ్యవసాయం వంటి విధానాలను ఆయా ప్రాంతాలు, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా చేపట్టి లాభాలు ఆర్జిస్తున్నారు.
గిరిజనులు సాగుచేస్తున్న ప్రాంతాలివే..
సీతంపేట, పార్వతీపురం, పాడేరు, రంపచోడవరం, చింతూరు, కోట రామచంద్రపురం, కృష్ణా, నెల్లూరు, శ్రీశైలం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)లతోపాటు గుంటూరు, ప్రకాశం, వైఎస్సార్ కడప, అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో అనేక గిరిజన తెగలు వ్యవసాయ సాగులో రాణిస్తున్నాయి.
సాగుతో రైతులుగా మారిన గిరిజన తెగలు..
సవర, కాపు సవర, జతాపు, సవర గదబ, భగత, వాల్మీకి, కొండదొర, కొండరెడ్డి, వాల్మీకి, కొండ కమ్మర, కోయనైకపాడు, కోయ, లంబాడీ, చెంచు, సుగాలి, యానాది, ఎరుకల, నక్కల తెగలు.
గిరిజన తెగలు సాగుచేస్తున్న పంటలు..
వరి, రాగి, జొన్నలు, బాజ్రా, కందులు, వేరుశనగ, జీడిపప్పు, కాఫీ, మిరియాలు, మామిడి, అనాస (పైనాపిల్), సీతాఫలం, రామాఫలం, పనస, బొప్పాయి, అరటి, టమాటా, పసుపు, చింతపండు, నిమ్మ, అల్లం, మిరప, పత్తి, పొద్దుతిరుగుడు, పొగాకు, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు.
ప్రభుత్వ ప్రోత్సాహం బాగుంది
నేను సొంతంగా రెండున్నర ఎకరాల్లో వరి సాగుచేస్తున్నాను. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం బాగుంది. ఏటా రైతుభరోసాతోపాటు రాయితీతో కూడిన విత్తనాలు అందిస్తున్నారు. కోతుల బెడద నుంచి రక్షణగా పొలం చుట్టూ గ్రీన్ కర్టెన్ ఏర్పాటుచేశాను. పంట బాగుంది. రూ.35వేల వరకు మిగిలే అవకాశముంది.
– బంధం చిన్న వీరాస్వామి, ఐ.పోలవరం గ్రామం, రంపచోడవరం మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా
కాఫీ సాగుకు తోడ్పాటు అందుతోంది
రెండెకరాల్లో కాఫీ తోట పెంచుతున్నాను. ఇందులో అంతర్ పంటగా మిరియాలు సాగుచేస్తున్నాను. కాఫీ సాగులో ప్రభుత్వ ప్రోత్సాహం, కాఫీ బోర్డు, ఐటీడీఏ సహకారం బాగుంది. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) కొనుగోలుతో బయట మార్కెట్‌లోను పోటీ పెరిగి మంచి ధర దక్కుతోంది. ఈ ఏడాది రూ.3 లక్షలు ఆదాయం వస్తుంది.
– తమర్భ వెంకటేశ్వరనాయుడు, ఇరడాపల్లి గ్రామం, పాడేరు మండలం
గిరిజన రైతులకు భరోసా అందిస్తున్నాం
గిరిజన రైతులకు ఏటా రూ.13, 500 చొప్పున వైఎస్సార్ రైతుభరోసా సాయాన్ని అందిస్తూ విత్తన రాయితీ, సాంకేతిక పరిజ్ఞానం, ఇతర వనరులను సమకూరుస్తున్నాం. సీఎం నేతృత్వంలో 2019 ఆగస్టు నుంచి 1,20,361 మంది గిరిజనులకు 2,09,615 ఎకరాల ఆర్వోఎఫ్‌ఆర్ పట్టాలను, 26,287 మందికి 39,272 ఎకరాల డీకేటీ పట్టాలు అందించాం. ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా భూములు చదును చేయడం, బోరు బావులు తవ్వడం వంటివి ప్రభుత్వం చేపట్టింది.
– పీడిక రాజన్నదొర, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి
గిరిజన ఉత్పత్తుల కొనుగోలుపై ప్రత్యేక శ్రద్ధ
గిరిజన కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వారు సేకరించిన అటవీ ఫల సాయంతోపాటు అటవీ ఉత్పత్తులను కూడా జీసీసీ మద్దతు ధరలకు కొనుగోలు చేసి ప్రోత్సహిస్తోంది. అటవీ ఫలసాయం సేకరణతోనే గిరిజనులు సరిపెట్టుకోకుండా వ్యవసాయం, ఉద్యాన పంటలను సాగుచేస్తున్నారు.
– శోభా స్వాతిరాణి, చైర్‌పర్సన్, గిరిజన సహకార సంస్థ (జీసీసీ)
Comments
Please login to add a commentAdd a comment