సాక్షి, అమరావతి: వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం రెండో విడతను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం అమలు చేయనున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో నిర్వహించే సభలో ఒక్కొక్కరికి రూ.4,000 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 50.92 లక్షల మంది రైతన్నలకు రూ.2,096.04 కోట్ల రైతు భరోసా సాయాన్ని సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ సందర్భంగా వైపీపీఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించనున్నారు.
► రైతు భరోసా ద్వారా అన్నదాతలకు ఏటా మూడు విడతల్లో రూ.13,500 సాయంగా ప్రభుత్వం అందచేస్తోంది. వరుసగా నాలుగో ఏడాది తొలి విడత సాయాన్ని మే నెలలో ఖరీఫ్‌కు ముందే రూ.7,500 చొప్పున ప్రభుత్వం ఇప్పటికే అందజేసింది. సంక్రాంతి సమయంలో మూడో విడతగా మరో రూ.2,000 సాయాన్ని అందచేయనుంది.
► దేశంలో ఎక్కడా లేనివిధంగా సొంత భూమి సాగుచేసుకుంటున్న రైతులతో పాటు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కౌలు రైతులు, ఆర్‌వోఎఫ్‌ఆర్, అటవీ, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న అన్నదాతలకు కూడా వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్సార్ సీపీనే కావడం గమనార్హం. 50 లక్షల మందికిపైగా రైతన్నలకు ఏటా సుమారు రూ.7,000 కోట్లను రైతు భరోసా ద్వారా అందచేసి ఆదుకుంటోంది.
► రైతు భరోసా ద్వారా మొదటి విడతగా ఖరీఫ్ పంటలు వేసే ముందు మే నెలలో రూ.7,500 చొప్పున అందిస్తుండగా రెండవ విడతగా అక్టోబర్‌లో పంట కోతలు, రబీ అవసరాల కోసం రూ.4,000 చొప్పున సాయం అందుతోంది. మూడో విడతగా ధాన్యం ఇంటికి చేరే సంక్రాంతి వేళ జనవరిలో రూ.2,000 చొప్పున ప్రభుత్వం ఇస్తోంది.
► తాజాగా అందించే రూ.2,096.04 కోట్లతో కలిపితే ఇప్పటివరకు ఒక్క వైఎస్సార్ రైతు భరోసా ద్వారానే రూ.25,971.33 కోట్ల మేర రైతన్నలకు లబ్ధి చేకూర్చడం గమనార్హం.
► చెప్పిన దానికంటే మిన్నగా రైతన్నలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సాయాన్ని అందచేస్తోంది. ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50,000 అందిస్తామని మేనిఫెస్టోలో మాటివ్వగా సీఎం జగన్ ప్రభుత్వం అంతకుమించి ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 అందచేస్తోంది. అంటే రైతన్నకు అదనంగా అందిస్తున్న రూ.17,500.
► గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ పథకాల ద్వారా మూడేళ్ల నాలుగు నెలల్లో రైతన్నలకు సీఎం జగన్ ప్రభుత్వం దాదాపు రూ.1,33,526.92 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చింది. అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా వైఎస్సార్ రైతు భరోసా, ఈ –క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులకు పంట రుణాలు, బీమా రిజిస్ట్రేషన్, సకాలంలో పంట రుణాలు చెల్లించిన రైతుల తరపున పూర్తి వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తూ వైఎస్సార్ సున్నావడ్డీ పంటరుణాలు, రైతులపై పైసా భారం లేకుండా వైఎస్సార్ ఉచిత పంటల బీమా, ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్ ముగిసేలోగా ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లిస్తోంది. కనీస మద్దతు ధరతో పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తోంది.
రైతన్నలకు పగటిపూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తూ వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకాన్ని అమలు చేస్తోంది. వ్యవసాయంలో ఆధునిక యంత్రాల కొరతను నివారించేలా వైఎస్సార్ యంత్రసేవా పథకాన్ని తెచ్చింది. పసుపు, మిర్చి, ఉల్లి, అరటి, బత్తాయి, ఐదు రకాల చిరుధాన్యాలతో సహా 26 పంటలకు పంట వేసినప్పుడే మద్దతు ధరలను ప్రకటించింది. రూ.3 వేల కోట్లతో ధరల స్ధిరీకరణ నిధి ఏర్పాటు చేసి భరోసా కల్పిస్తోంది. ఏడాది పొడవునా వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండటంతో ఒక్కటి కూడా కరువు మండలంగా ప్రకటించే పరిస్ధితి తలెత్తలేదు.
► టీడీపీ హయాంలో రైతన్నలకు కనీసం విత్తనాలు కూడా అందించలేని దుస్థితి నెలకొంది. ఇక ఎరువుల పంపిణీ, బీమా క్లెయిమ్‌లు అగమ్యగోచరమే. ఆశాస్త్రీయ పంట నష్టాల అంచనాతోపాటు అయిన వారికే పరిహారం దక్కేది. నాడు ఏడాది పొడవునా కరువు తాండవించడంతో ఐదేళ్లలో 1,623 కరువు మండలాలను ప్రకటించాల్సి రావడం గత సర్కారు నిర్వాకాలకు నిదర్శనం. ఇక రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఆలోచనే గత పాలకులకు రాలేదు.
రైతు భరోసాతో ఇప్పటిదాకా ఎవరికి, ఎంత సాయం?
► బీసీలు 24,61,000 మందికి రూ.12,113.11 కోట్లు
► ఎస్సీలు 5,23,000 మందికి రూ.2,653.04 కోట్లు
► ఎస్టీలు 3,92,000 మందికి రూ.1,771.13 కోట్లు
► మైనార్టీలు 60,000 మందికి రూ.320.68 కోట్లు
► కాపులు 7,85,700 మందికి రూ.3,793.44 కోట్లు
► ఇతరులు 10,16,300 మందికి రూ.5,319.93 కోట్లు
► మొత్తం 52,38,000 మందికి రూ.25,971.33 కోట్లు
నేడు సీఎం పర్యటన ఇలా
► సీఎం జగన్ ఉదయం 9.00 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి 10.15 గంటలకు ఆళ్లగడ్డ చేరుకుంటారు.
► 10.45 – 12.10 వరకు వైపీపీఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు,
► వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ నగదు బదిలీని బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.
► మధ్యాహ్నం 12.35 గంటలకు తిరిగి బయలుదేరి 2.15 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment