ఇతని పేరు మడివి సిరమయ్య. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలోని మారుమూల గ్రామమైన గుంజవరం. మూడేళ్లలో ‘నవరత్నాల’ ద్వారా ఏకంగా రూ.2.86 లక్షల మేర లబ్ధి పొందాడు. గత ప్రభుత్వ హయాంలో సాయం అంటే ఏమిటో తెలీకుండా ఉండేదని.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు వలంటీర్ స్వయంగా తన ఇంటికొచ్చి పథకాలూ అందేలా చూస్తున్నారని అంటున్నాడు. అడవుల్లో ఎవరికీ పట్టనట్లు ఉండే గిరిజన బతుకులు సీఎం వైఎస్ జగన్ పుణ్యాన బాగుపడుతున్నాయని సంతోషం వ్యక్తం చేశాడు.
ఈమె పేరు కుంజం సావిత్రి. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం ముసురుమిల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఉంటోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈమెకు అటవీ హక్కుల చట్టం (ఆర్వోఎఫ్‌ఆర్) ప్రకారం రెండు ఎకరాలకు భూమి హక్కు పట్టా అందించింది. అలాగే, మూడేళ్లుగా రైతుభరోసా అందిస్తూ పోడుభూముల్లో వ్యవసాయం చేసుకునేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అండదండగా నిలుస్తున్నారంటూ కృతజ్ఞతలు తెలిపింది.
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయనగరం: అన్ని సామాజిక వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా అమలు చేస్తున్న ‘నవరత్నాలు’ గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. అనేక సంవత్సరాలుగా కనీస సదుపాయాలకు నోచుకోని ఆదివాసీలకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరాల మూట అందిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక గిరిజనోద్ధరణకు అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయి. వీటిద్వారా 95 శాతం మంది గిరిజనులు లబ్ధి పొందారు. దేశ చరిత్రలో మరే రాష్ట్రంలోనూ ఇంత ప్రయోజనం కలిగిన దాఖలాల్లేవు. ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీల హక్కులు, రక్షణ కోసం పునరంకితమయ్యేలా ఏటా ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో గిరిజనులకు ప్రస్తుత ప్రభుత్వ హయాంలో జరుగుతున్న మేలు ఏమిటంటే..
పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల
రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 27.39 లక్షల మంది గిరిజనులున్నారు. 9 సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)ల పరిధిలో 16,068 గిరిజన ఆవాసాలున్నాయి. వాటిలో 7 ఐటీడీఏలు అటవీ ప్రాంతంలోను, రెండు ఐటీడీఏలు మైదాన ప్రాంతాల్లోను గిరిజనుల కోసం పనిచేస్తున్నాయి. ఇక నవరత్నాల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా గత మూడేళ్లలో 51,74,278 మంది గిరిజన లబ్ధిదారులకు రూ.9,204.75 కోట్ల మేర లబ్ధిచేకూరింది. ప్రత్యక్షంగా నగదు బదిలీ (డీబీటీ) ద్వారా 33,92,435 మందికి రూ.7,012.35 కోట్లు, పరోక్షంగా (నాన్ డీబీటీ) 17,81,843 మందికి రూ.2,192.40 కోట్ల మేర లబ్ధిచేకూరింది. గిరిపుత్రులకు ఇంత భారీ స్థాయిలో ఆర్థిక ప్రయోజనం చేకూరడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. దీనికితోడు గిరిజన ఉప ప్రణాళిక(ట్రైబల్ సబ్‌ప్లాన్).. కేంద్ర, రాష్ట్ర నిధులతో దాదాపు 40 ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారు.
గిరిజనం కోసం ప్రభుత్వ చర్యల్లో ముఖ్యమైనవి..
► గిరిజన రైతులకు పోడు భూములపై యాజమాన్య హక్కులను కల్పించేలా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి స్పెషల్ డ్రైవ్‌ను చేపట్టారు. గత మూడేళ్ల కాలంలో 1,34,056 మందికి ఆర్‌ఓఎఫ్‌ఆర్, ఆర్‌ఓఆర్ పట్టాలు చేతికందాయి. తద్వారా వారికి 2,48,066 ఎకరాలపై హక్కు లభించింది. అంతేకాదు వారికి వైఎస్సార్ రైతుభరోసా పథకాన్ని ముఖ్యమంత్రి వర్తింపజేశారు.
► గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక వైద్య కళాశాలల నిర్మాణంతోపాటు మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.746 కోట్లు మంజూరు చేసింది.
► గిరిజన గ్రామాల్లో డోలీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఫీడర్ అంబులెన్సులను వినియోగిస్తున్న ప్రభుత్వం తాజాగా.. 128 బైక్ అంబులెన్సులను అందుబాటులోకి తేనుంది.
► రక్తహీనత కారణంగా బాలింతలు, శిశువులు మరణిస్తుండడంతో గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వం గిరి గోరుముద్ద, బాల సంజీవని, పోషకాహార బుట్ట వంటి ప్రత్యేక వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాన్ని అమలుచేస్తున్నారు.
► ఏజెన్సీలో 2,652 మంది గిరిజన కమ్యూనిటీ హెల్త్ వర్కర్ (సీహెచ్‌డబ్ల్యూ)లకు 1995 నుంచి ఉన్న రూ.400 జీతాన్ని ఏకంగా రూ.4 వేలకు పెంచారు.
► గిరిజనులకు సీఎం వైఎస్ జగన్ ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశారు.
► వంద శాతం గిరిజనుల జనాభా కలిగిన తండాలు, గూడేలను 165 కొత్త గిరిజన పంచాయతీలుగా ఏర్పాటుచేసిన ప్రభుత్వం అక్కడ ప్రజాప్రతినిధులంతా గిరిజనులే ఎన్నికయ్యేలా రిజర్వ్ చేస్తూ జీఓ నెంబర్ 560 జారీచేసింది.
► 4,76,206 గిరిజనుల కుటుంబాల గృహావసరాలకు 200 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ అందిస్తోంది.
► గిరిజనులకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తెస్తూ కురుపాంలో రూ.153 కోట్లతో ట్రైబల్ ఇంజనీరింగ్ కళాశాలకు సీఎం శ్రీకారం చుట్టారు.
► కోట్లాది రూపాయలతో విద్యా సంస్థల భవనాలు, గిరిజన ప్రాంతాల్లోని రహదారుల నిర్మాణాన్ని చేపట్టారు. è రాష్ట్రానికి మంజూరైన గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రస్తుతం విజయనగరం వద్ద నిర్వహిస్తున్నారు.
► కరోనా కష్టకాలంలో.. అటవీ ఫలసాయం, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణలో గిరిజన సహకార సంస్థ (జీసీసీ) అడవి బిడ్డలకు అండగా నిలిచింది.
► ఇక విశాఖ జిల్లా తాజంగిలో రూ.35 కోట్లతో గిరిజన సమరయోధుల మ్యూజియం, కాపులుప్పాడలో రూ.45 కోట్లతో అల్లూరి సీతారామరాజు స్మారక మ్యూజియం ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. విశాఖలో రూ.10కోట్లతో ట్రైబల్ రీసెర్చ్ మిషన్ (టీఆర్‌ఎం)కు భవన నిర్మాణం పూర్తయింది.
గిరిజనులకు వైఎస్ కుటుంబమే బాసట
నాడు వైఎస్సార్ ఇప్పుడు ఆయన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో గిరిజనులకు ఎంతో మేలు జరిగింది. అందుకే వీరిని గిరిజనులు దైవంతో సమానంగా భావిస్తారు. గిరిజనులకు ప్రాధాన్యమిస్తూ కొత్తగా రెండు జిల్లాలు ఏర్పాటుచేశారు. మరో జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదనలున్నాయి. గిరిజనులకు విద్య, వైద్యం రెండు కళ్లుగా భావిస్తూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విద్యాసంస్థలు, ఆస్పత్రుల నిర్మాణం చేపట్టారు. ప్రత్యక్షంగానే రూ.9వేల కోట్లకు పైగా వారికి లబ్ధిచేకూర్చారు.
– పీడిక రాజన్నదొర, ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment