సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మైదాన ప్రాంత గిరిజనులకు మరిన్ని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)లను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్విభజన చేయడంతో మైదాన ప్రాంతంలో ఏడు జిల్లాలకు ఐటీడీఏల ఏర్పాటు అత్యవసరమైంది. ఆయా జిల్లాల్లోని గిరిజనులకు సేవలు అందించేలా ఒకటి, రెండు ఐటీడీఏలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఇటీవల కేంద్రాన్ని కోరింది. రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం గిరిజన జనాభా 27.39 లక్షలు. వీరిలో 15.88 లక్షలమంది (58 శాతం) మైదాన ప్రాంతంలోనే నివసిస్తున్నారు. వారి అభివృద్ధి, సంక్షేమానికి మరిన్ని ఐటీడీఏల అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది.
రాష్ట్రంలో ప్రస్తుతం తొమ్మిది ఐటీడీఏలున్నాయి. వీటిలో విజయవాడ కేంద్రంగా ఉన్న మైదాన ప్రాంత ఐటీడీఏ మాత్రమే ఎస్టీలు తగినంత సంఖ్యలో ఉన్న ఏడుజిల్లాలకు సేవలందిస్తోంది. జిల్లాల పునర్విభజనలో రాష్ట్ర ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం.. రెండు పూర్తిస్థాయి గిరిజన జిల్లాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మైదానప్రాంత జిల్లాలైన అనంతపురం, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో గిరిజనులు గణనీయంగా ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది.
ఈ జిల్లాల్లో కనిష్టంగా 75,886 మంది, గరిష్టంగా 2,88,997 మంది గిరిజనులున్నారు. ఈ జిల్లాల్లోని గిరిజనుల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేకంగా ఐటీడీఏలను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. తగినన్ని ఐటీడీఏలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వారికి మరింత సమర్థంగా అందించే వీలుకలుగుతుందని పేర్కొంది.
మైదాన ప్రాంత ఎస్టీల కోసం ఐటీడీఏ అత్యవసరం
మైదాన ప్రాంతాల్లో ఎస్టీల సంక్షేమానికి, అభివృద్ధికి మరిన్ని ఐటీడీఏలు కావాలని కేంద్ర గిరిజన సంక్షేమశాఖకు ప్రతిపాదనలు అందించాం. ఏపీలోని గిరిజనుల కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. మైదాన ప్రాంతంలోని ఎస్టీల అవసరాలను గుర్తించి వారి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ఏజెన్సీలో మాదిరిగానే మైదాన ప్రాంతంలోని ఎస్టీలకు ప్రాథమిక విద్య, వైద్యం, రహదారుల కల్పన, విద్యుత్, ఆర్థికాభివృద్ధిపై అవకాశాలు వంటి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాం.
– పీడిక రాజన్నదొర, ఉపముఖ్యమంత్రి
Comments
Please login to add a commentAdd a comment