సాక్షి, అమరావతి: దేశంలో అంతరించే ప్రమాద జాబితాలో ఉన్న 75 గిరిజన తెగలను ప్రత్యేక బలహీనమైన గిరిజన సమూహాలు (పీవీటీజీ)గా గుర్తించి ఆయా తెగల సంరక్షణతోపాటు వారికి బలమైన ఊతమిచ్చేలా చర్యలు ఊపందుకున్నాయి. రాష్ట్రంలోని గిరిజనుల సంక్షేమానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఇదే స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం కొత్త కార్యాచరణ ప్రకటించడం మరింత కలిసివచ్చే అంశంగా మారనుంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్యంలో రాష్ట్రంలో గిరిజన సంక్షేమానికి, అభివృద్ధికి చేపట్టిన చర్యలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ఎస్టీ కాంపొనెంట్ (ఉప ప్రణాళిక) ద్వారా చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో రూ.12,487.48 కోట్లను గిరిజనుల కోసం ఖర్చు చేస్తే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కేవలం మూడున్నరేళ్లలోనే రూ.15,589.38 కోట్లు ఖర్చు చేసింది. గత ప్రభుత్వం ఐదేళ్లలో కేటాయించిన మొత్తం కంటే ప్రస్తుత ప్రభుత్వం ఈ మూడున్నరేళ్లలో రూ.3,101.90 కోట్లు అదనంగా ఖర్చు చేయడం రికార్డు.
అనేక చర్యలతో..
కాగా, గిరిజన తెగల సంక్షేమానికి సైతం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. నవరత్నాలతోపాటు వారికి అనేక విధాలుగా నేరుగా లబ్ధి చేకూరుస్తోంది. గిరిజనులకు భూమి హక్కు(ఆర్వోఎఫ్‌ఆర్, డీకేటీ పట్టాలు) ఇవ్వడంలో దేశంలోనే వైస్సార్‌సీపీ ప్రభుత్వానిదే అగ్రస్థానం కావడం గమనార్హం. రాష్ట్రంలో గడచిన 12 ఏళ్లలో 2.34 లక్షల ఎకరాలను పట్టాలుగా (దీనిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ పంచిందే ఎక్కువ) పంపిణీ జరిగింది. కాగా, వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా 2.48,887 లక్షల ఎకరాలను పంచి రికార్డు సృష్టించింది.
ప్రత్యేక గిరిజన విశ్వవిద్యాలయం, వైద్య కళాశాల, ఇంజనీరింగ్ కాలేజీ, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వంటివి నెలకొల్పి ఎస్టీలకు సాంకేతిక, వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చింది. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ద్వారా అటవీ ఉత్పత్తుల కొనుగోలు, మార్కెటింగ్‌కు ఊతమిస్తోంది. అరకు కాఫీ, నల్లమల నన్నారి వంటి అటవీ ఉత్పత్తులకు బ్రాండ్ ఇమేజ్‌ను కల్పించి గిరిజనులను ప్రోత్సహిస్తున్నారు.
రాష్ట్రపతి ఆదేశాలతో..
అంతరించే ప్రమాదమున్న జాతుల సంరక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలతో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. దేశంలో అంతరించే ప్రమాద జాబితాలో ఉన్న 75 గిరిజన తెగల అభివృద్ధి, సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం మరింత ప్రత్యేక దృష్టి సారించింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా దేశవ్యాప్తంగా 75 పీవీటీజీల స్థితిగతులపై క్షేత్రస్థాయి అధికారులు అధ్యయనం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో 9 పీవీటీజీల జీనవ పరిస్థితులపై పరిశీలన జరుగుతోంది. గత నెల 27 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం సహకారంతో కేంద్ర బృందాలు క్షేత్రస్థాయి అధ్యయనం చేపట్టాయి.
పాడేరు సమీకత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పరిధిలోని మూడు ప్రాంతాల్లో కేంద్ర బృందాలు డొంగ్రీయా కోండ్, బోండా పోర్జా, పరంగి పోర్జా తెగల జీవన పరిస్థితిని, వారికి అందుబాటులో ఉన్న సౌకర్యాలను ప్రత్యక్షంగా పరిశీలించాయి. వారి జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరిచేలా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఆ బృందాలు కేంద్రానికి నివేదించనున్నాయి.
మూడేళ్ల మిషన్
దేశంలో బలహీన గిరిజన సమూహాల (పీవీటీజీ) సామాజిక, ఆర్థిక అభివృద్ధికి మూడేళ్లపాటు ప్రత్యేక మిషన్(కార్యాచరణ)ను అమలు చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఇందుకోసం మూడేళ్లలో రూ.15 వేల కోట్లను ఖర్చు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను బడ్జెట్‌లో ప్రతిపాదించడం గమనార్హం.
ఈ పథకంలో దేశంలోని 75 గిరిజన తెగలకు ప్రత్యేక లబ్ధి చేకూర్చనున్నారు. తద్వారా ఏపీలోని గిరిజన తెగలకు రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా మరింత మేలు కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment