crop investment
-
బోనస్ అంతా బోగస్ పంట పెట్టుబడి ఇవ్వకుంటే
నంగునూరు (సిద్దిపేట): ‘వానాకాలం ప్రారంభమై నా ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం అందించడం లేదు.. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని చిన్నచూపు చూస్తోంది. పంటకు బోనస్ అన్న మాటను బోగస్‌గా మార్చారు’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కెనపల్లి లో రైతు నాగేంద్ర పొలంలో ఆయిల్‌పామ్ మొదటి పంటను కోసి క్రాప్ కటింగ్‌ను ప్రారంభించారు.అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ విత్తనాల కోసం రైతులు ఆందోళన చేసినా పట్టించుకోవడంలేదని, ఎరువులు సకాలంలో అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. వరి పంట బోనస్ విషయంలో మంత్రులు తలో మాట మాట్లాడుతు న్నారని విమర్శించారు. పంట పెట్టుబడితోపాటు రైతు సమస్యలపై అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఆయిల్‌పామ్ దిగుబడిపై కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీ తొలగించడంతో దిగుమతులు పెరిగి విదేశీ మారకం నష్టపోతున్నా మని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట ప్రాంతంలో ఆయిల్‌పామ్ పంట సాగును ప్రోత్సహించడంతో ఖమ్మం తరువాత స్థానంలో నిలిచి ఆదర్శంగా నిలిచిందన్నారు. -
అడవుల్లోనూ ఆహార పంటలు
‘‘నేను నా రెండెకరాల్లో వరి సాగుచేస్తున్నాను. ప్రభుత్వం అందించిన రైతుభరోసా సాగు పెట్టుబడికి ఎంతో ఉపయోగపడుతోంది. రాయితీ విత్తనాలు కూడా అందించి అండగా నిలుస్తోంది. ఈ ఏడాది 1070 వరి రకాన్ని సాగుచేశా. మంచి దిగుబడులు సాధిస్తున్నా. అటవీ ఫలాలు సేకరణతోనే కుటుంబాన్ని పోషిస్తూ గతంలో అవస్థలుపడ్డ నేను ఇప్పుడు ప్రభుత్వ సహకారంతో ఆహార పంటలూ పండిస్తూ సమాజంలో గౌరవంగా జీవిస్తున్నాను.’’ – కుర్సం రాజు, మెరకగూడెం, బుట్టాయగూడెం మండలం, ఏలూరు జిల్లా సాక్షి, అమరావతి: నిన్న మొన్నటి వరకు కేవలం అటవీ ఫలాల సేకరణపైనే ఆధారపడ్డ గిరిపుత్రులు ఇప్పుడు అద్భుతాలు సృష్టిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు, సహకారంతో ఇతర అన్ని ప్రాంతాల్లోని రైతుల మాదిరిగానే ఆహార పంటలు పండిస్తూ వారితో సాగులో పోటీపడుతున్నారు. వీరికి ప్రభుత్వం పెద్దఎత్తున ఆర్వోఎఫ్ఆర్ పట్టాల ద్వారా భూమిని పంపిణీ చేయడంతో అడవి బిడ్డలు ఇప్పుడు ఉద్యాన, వ్యవసాయ పంటల సాగువైపు మళ్లుతున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాగు పద్ధతులను అవలంబిస్తూ మేలైన దిగుబడులు సాధిస్తున్నారు. పోడు వ్యవసాయం, వంతుల సాగు, టెర్రస్ సాగు, వర్షాధార సాగు, మిశ్రమ పంటలు వేయడం, అంతర్ పంటలు, ఆర్గానిక్ వ్యవసాయం, జీరో బడ్జెట్ వ్యవసాయం వంటి విధానాలను ఆయా ప్రాంతాలు, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా చేపట్టి లాభాలు ఆర్జిస్తున్నారు. గిరిజనులు సాగుచేస్తున్న ప్రాంతాలివే.. సీతంపేట, పార్వతీపురం, పాడేరు, రంపచోడవరం, చింతూరు, కోట రామచంద్రపురం, కృష్ణా, నెల్లూరు, శ్రీశైలం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)లతోపాటు గుంటూరు, ప్రకాశం, వైఎస్సార్ కడప, అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో అనేక గిరిజన తెగలు వ్యవసాయ సాగులో రాణిస్తున్నాయి. సాగుతో రైతులుగా మారిన గిరిజన తెగలు.. సవర, కాపు సవర, జతాపు, సవర గదబ, భగత, వాల్మీకి, కొండదొర, కొండరెడ్డి, వాల్మీకి, కొండ కమ్మర, కోయనైకపాడు, కోయ, లంబాడీ, చెంచు, సుగాలి, యానాది, ఎరుకల, నక్కల తెగలు. గిరిజన తెగలు సాగుచేస్తున్న పంటలు.. వరి, రాగి, జొన్నలు, బాజ్రా, కందులు, వేరుశనగ, జీడిపప్పు, కాఫీ, మిరియాలు, మామిడి, అనాస (పైనాపిల్), సీతాఫలం, రామాఫలం, పనస, బొప్పాయి, అరటి, టమాటా, పసుపు, చింతపండు, నిమ్మ, అల్లం, మిరప, పత్తి, పొద్దుతిరుగుడు, పొగాకు, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు. ప్రభుత్వ ప్రోత్సాహం బాగుంది నేను సొంతంగా రెండున్నర ఎకరాల్లో వరి సాగుచేస్తున్నాను. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం బాగుంది. ఏటా రైతుభరోసాతోపాటు రాయితీతో కూడిన విత్తనాలు అందిస్తున్నారు. కోతుల బెడద నుంచి రక్షణగా పొలం చుట్టూ గ్రీన్ కర్టెన్ ఏర్పాటుచేశాను. పంట బాగుంది. రూ.35వేల వరకు మిగిలే అవకాశముంది. – బంధం చిన్న వీరాస్వామి, ఐ.పోలవరం గ్రామం, రంపచోడవరం మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా కాఫీ సాగుకు తోడ్పాటు అందుతోంది రెండెకరాల్లో కాఫీ తోట పెంచుతున్నాను. ఇందులో అంతర్ పంటగా మిరియాలు సాగుచేస్తున్నాను. కాఫీ సాగులో ప్రభుత్వ ప్రోత్సాహం, కాఫీ బోర్డు, ఐటీడీఏ సహకారం బాగుంది. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) కొనుగోలుతో బయట మార్కెట్లోను పోటీ పెరిగి మంచి ధర దక్కుతోంది. ఈ ఏడాది రూ.3 లక్షలు ఆదాయం వస్తుంది. – తమర్భ వెంకటేశ్వరనాయుడు, ఇరడాపల్లి గ్రామం, పాడేరు మండలం గిరిజన రైతులకు భరోసా అందిస్తున్నాం గిరిజన రైతులకు ఏటా రూ.13, 500 చొప్పున వైఎస్సార్ రైతుభరోసా సాయాన్ని అందిస్తూ విత్తన రాయితీ, సాంకేతిక పరిజ్ఞానం, ఇతర వనరులను సమకూరుస్తున్నాం. సీఎం నేతృత్వంలో 2019 ఆగస్టు నుంచి 1,20,361 మంది గిరిజనులకు 2,09,615 ఎకరాల ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను, 26,287 మందికి 39,272 ఎకరాల డీకేటీ పట్టాలు అందించాం. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా భూములు చదును చేయడం, బోరు బావులు తవ్వడం వంటివి ప్రభుత్వం చేపట్టింది. – పీడిక రాజన్నదొర, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గిరిజన ఉత్పత్తుల కొనుగోలుపై ప్రత్యేక శ్రద్ధ గిరిజన కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వారు సేకరించిన అటవీ ఫల సాయంతోపాటు అటవీ ఉత్పత్తులను కూడా జీసీసీ మద్దతు ధరలకు కొనుగోలు చేసి ప్రోత్సహిస్తోంది. అటవీ ఫలసాయం సేకరణతోనే గిరిజనులు సరిపెట్టుకోకుండా వ్యవసాయం, ఉద్యాన పంటలను సాగుచేస్తున్నారు. – శోభా స్వాతిరాణి, చైర్పర్సన్, గిరిజన సహకార సంస్థ (జీసీసీ) -
అన్నదాతను వెంటాడిన అప్పులు
సాగునీటి వేటలో ఐదు బోర్లు తవ్వించగగా.. అన్నీ ఫెయిలయ్యాయి. పంట పెట్టుబడుల కోసం చేసిన అప్పులు కుప్పలుగా పెరిగాయి. సొంత, కౌలు పొలాల్లో సాగు చేసిన పంటల్లో ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. ఈ క్రమంలో అప్పులు తీర్చే మార్గం లేక పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి తన వారితో బంధం తెంచుకుని కుటుంబానికి అంతులేని శోకాన్ని మిగిల్చాడో అన్నదాత. - వర్గల్ - పురుగు మందు తాగి బలవన్మరణం - ఇప్పలగూడలో విషాదం - వీధినపడ్డ కుటుంబం మండలంలోని ఇప్పలగూడ గ్రామానికి చెందిన సొక్కుల వెంకట్‌రెడ్డి (36) తనకున్న రెండెకరాలోపు భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఈ భూమిలో పంటల సాగు కోసం సుమారు ఐదు బోర్లు వేయించాడు. ఒక బోరులో కొద్దిపాటి నీరు మినహా మిగతావన్ని విఫలమయ్యాయి. దీంతో అప్పులే మిగిలాయి. మరోవైపు నీళ్లు లేక సాగు మొక్కుబడిగా మారింది. గత ఖరీఫ్‌లో పొరుగు రైతుకు చెందిన 6 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని దాదాపు రూ. 90 వేలు పెట్టుబడితో పత్తిని సాగు చేశాడు. ప్రతికూల పరిస్థితుల కారణంగా అందులో పది క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. వ్యవసాయం కలిసిరాకపోవడంతో మొత్తం రూ. 4 లక్షలకు పైబడి అప్పులయ్యాయి. ఈ క్రమంలో అప్పులు తీర్చే మార్గం లేక మానసిక వేదనకు గురైన ఆ రైతు ఆత్మహత్యే శరణ్యంగా భావించాడు. దీంతో ఈ నెల 10న ఉదయం 6 గంటలకు తన ఇంటి వెనక వైపు పురుగుల మందు తాగి పడిపోయాడు. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు గజ్వేల్ ప్రభుత్వాస్పత్రిలో ప్రాథమిక చికిత్సలు చేయించి అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా.. అక్కడ వైద్యసేవలు సరిగా అందడం లేదని, డబ్బులు సమకూర్చుకుని మెరుగైన చికిత్స జరిపించాలనే ఆలోచనతో సోమవారం సాయంత్రం రైతు వెంకట్‌రెడ్డిని స్వగ్రామానికి తీసుకువచ్చారు. అదేరోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో రైతు వెంకట్‌రెడ్డి మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, సాయి కిరణ్ (పదో తరగతి), హన్మంతరెడ్డి (ఐదో తరగతి)లు ఉన్నారు. తెల్లారితే మంచి దవాఖానకు తీసుకపోదామనుకున్నం. ఇంతల్నే పాణం పోయిందని మృతుడి భార్య లక్ష్మి బోరుమని విలపించింది. లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు గౌరారం స్టేషన్ హౌస్ ఆఫీసర్ దేవీదాస్ తెలిపారు. -
ఈ పాపం సర్కారుదే!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : రొద్దం మండలం గోనుమేకలపల్లికి చెందిన యువ రైతు గోపీనాథ్(22) తల్లిదండ్రులు పంట పెట్టుబడుల కోసం అప్పు చేశారు. తాము అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పడం, సీఎం పీఠంపై చంద్రబాబే కూర్చోవడంతో గోపీనాథ్‌తో పాటు అతడి తల్లిదండ్రులు సంబరపడిపోయారు. తన తండ్రి జల్లప్ప పేరుతో ఉన్న 1.76,200 లక్షల రూపాయల అప్పుతో పాటు తల్లి పేరుతో ఉన్న డ్వాక్రా రుణం రూ.1.41,900 మాఫీ అవుతుందనుకున్నాడు. పూర్తి స్థాయిలో మాఫీ చేయలేమని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇంతలోనే బ్యాంకర్లు నోటీసులు జారీ చేశారు. ఇంకేముంది తల్లి, తండ్రితో పాటు తన పేరుపై ఉన్న 4.85 లక్షల రూపాయలు చెల్లించలేమని గోపీనాథ్ ఒత్తిడికి లోనయ్యాడు. శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పిన ప్రభుత్వమే అతన్ని చంపేసిందని గోనుమాకుపల్లి వాసులు మండిపడుతున్నారు. గుత్తి మండలం తురకపల్లి రైతులు శ్రీనివాసరెడ్డి, గోవిందరెడ్డి బంగారు నగలు తాకట్టుపెట్టి 48, 56 వేల రూపాయల చొప్పున రుణం తెచ్చుకున్నారు. రుణమాఫీలో ఈ డబ్బులను ప్రభుత్వమే చెల్లిస్తుందని భావించారు. అయితే రుణం తీర్చాలని, లేదంటే నగలు వేలం వేస్తామని సహకర బ్యాంకు నోటీసులు జారీ చేసింది. దీంతో వీరు బోరుమంటున్నారు. రుణ మాఫీ వ్యవహారం కొలిక్కి రాక ఒక వైపు, బ్యాంకర్ల నోటీసులతో మరో వైపు రైతులు సతమతమవుతున్నారు. అప్పు చెల్లించే మార్గం కానిపించక కొందరు రైతులు తనువు చాలించడానికి పూనుకుంటున్నారు. రుణమాఫీ హామీతో మోసపోయిన రైతులు ఏవిధంగా వేదన పడుతున్నారో.. కుటుంబాలు ఎలా ఛిన్నాభిన్నం అవుతున్నాయో పల్లెల వైపు చూస్తే ఇట్టే అర్థమవుతోంది. జిల్లాలోని రైతులు 8 లక్షల ఖాతాల ద్వారా 6,102 కోట్ల రూపాయలు పంట సాగు కోసం అప్పు తీసుకున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే రైతు, డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. బాబు చెప్పినట్లుగా టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆయనే సీఎం అయ్యారు. జిల్లా వాసులు కూడా అత్యధికంగా 12అసెంబ్లీ స్థానాలను టీడీపీకి కట్టబెట్టారు. కానీ చంద్రబాబు మాత్రం తనదైనశైలిలో మాట తప్పారు. 1.50 లక్షల రూపాయలలోపు రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని షాక్ ఇచ్చాడు. ఏరుదాటాక తెప్ప తగలేశాడన్న చందంగా చంద్రబాబు వ్యవహరించారని రైతులు మండిపడుతున్నారు. ఆయన చెప్పినట్లు రూ.ఒకటిన్నర లక్ష కూడా మాఫీ కాకపోవడంతో బ్యాంకర్లు రైతులకు నోటీసులు జారీ చేశారు. రుణాలు చెల్లించాల్సిందే అని, లేదంటే వేలం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఆత్మహత్యలకు తెగిస్తున్న రైతులు రుణమాఫీ కాదని, తీసుకున్న అప్పులు తప్పక చెల్లించాల్సిందేనని బ్యాంకర్ల నోటీసుల ద్వారా రైతులకు స్పష్టమైంది. దీంతో కొందరు రైతులు అప్పు తీర్చేస్తోమత లేక ఆత్మహత్యలకు తెగిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో 17మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే రైతులు ఎంత వేధన పడుతున్నారో ఇట్టే అర్థమవుతోంది. శుక్రవారం ఆత్మహత్యకు పూనుకున్న గోపీనాథ్‌తో ఈ సంఖ్య 18కి చేరింది. మూన్నెళ్లలో 18 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిసినా జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు రైతులకు భరోసా ఇవ్వడం లేదు. రుణమాఫీ అమలయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం లేదు. రుణమాఫీ చేసి తీరాల్సిందే: ఓబుళకొండారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి. రుణమాఫీపై ప్రభుత్వం మాట తప్పడం పెద్ద తప్పిదం. మాఫీ చేయాలని విపక్షాలు చేస్తున్న డిమాండ్‌ను పెడచెవిన పెడుతోంది. రుణమాఫీ చేసి తీరాల్సిందే. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఆదుకోవల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే.