ఈ పాపం సర్కారుదే!
సాక్షి ప్రతినిధి, అనంతపురం :
రొద్దం మండలం గోనుమేకలపల్లికి చెందిన యువ రైతు గోపీనాథ్(22) తల్లిదండ్రులు పంట పెట్టుబడుల కోసం అప్పు చేశారు. తాము అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పడం, సీఎం పీఠంపై చంద్రబాబే కూర్చోవడంతో గోపీనాథ్‌తో పాటు అతడి తల్లిదండ్రులు సంబరపడిపోయారు. తన తండ్రి జల్లప్ప పేరుతో ఉన్న 1.76,200 లక్షల రూపాయల అప్పుతో పాటు తల్లి పేరుతో ఉన్న డ్వాక్రా రుణం రూ.1.41,900 మాఫీ అవుతుందనుకున్నాడు. పూర్తి స్థాయిలో మాఫీ చేయలేమని ప్రభుత్వం తేల్చి చెప్పింది.
ఇంతలోనే బ్యాంకర్లు నోటీసులు జారీ చేశారు. ఇంకేముంది తల్లి, తండ్రితో పాటు తన పేరుపై ఉన్న 4.85 లక్షల రూపాయలు చెల్లించలేమని గోపీనాథ్ ఒత్తిడికి లోనయ్యాడు. శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పిన ప్రభుత్వమే అతన్ని చంపేసిందని గోనుమాకుపల్లి వాసులు మండిపడుతున్నారు.
గుత్తి మండలం తురకపల్లి రైతులు శ్రీనివాసరెడ్డి, గోవిందరెడ్డి బంగారు నగలు తాకట్టుపెట్టి 48, 56 వేల రూపాయల చొప్పున రుణం తెచ్చుకున్నారు. రుణమాఫీలో ఈ డబ్బులను ప్రభుత్వమే చెల్లిస్తుందని భావించారు. అయితే రుణం తీర్చాలని, లేదంటే నగలు వేలం వేస్తామని సహకర బ్యాంకు నోటీసులు జారీ చేసింది. దీంతో వీరు బోరుమంటున్నారు.
రుణ మాఫీ వ్యవహారం కొలిక్కి రాక ఒక వైపు, బ్యాంకర్ల నోటీసులతో మరో వైపు రైతులు సతమతమవుతున్నారు. అప్పు చెల్లించే మార్గం కానిపించక కొందరు రైతులు తనువు చాలించడానికి పూనుకుంటున్నారు. రుణమాఫీ హామీతో మోసపోయిన రైతులు ఏవిధంగా వేదన పడుతున్నారో.. కుటుంబాలు ఎలా ఛిన్నాభిన్నం అవుతున్నాయో పల్లెల వైపు చూస్తే ఇట్టే అర్థమవుతోంది. జిల్లాలోని రైతులు 8 లక్షల ఖాతాల ద్వారా 6,102 కోట్ల రూపాయలు పంట సాగు కోసం అప్పు తీసుకున్నారు.
టీడీపీ అధికారంలోకి వస్తే రైతు, డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. బాబు చెప్పినట్లుగా టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆయనే సీఎం అయ్యారు. జిల్లా వాసులు కూడా అత్యధికంగా 12అసెంబ్లీ స్థానాలను టీడీపీకి కట్టబెట్టారు. కానీ చంద్రబాబు మాత్రం తనదైనశైలిలో మాట తప్పారు. 1.50 లక్షల రూపాయలలోపు రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని షాక్ ఇచ్చాడు. ఏరుదాటాక తెప్ప తగలేశాడన్న చందంగా చంద్రబాబు వ్యవహరించారని రైతులు మండిపడుతున్నారు. ఆయన చెప్పినట్లు రూ.ఒకటిన్నర లక్ష కూడా మాఫీ కాకపోవడంతో బ్యాంకర్లు రైతులకు నోటీసులు జారీ చేశారు. రుణాలు చెల్లించాల్సిందే అని, లేదంటే వేలం తప్పదని హెచ్చరిస్తున్నారు.
ఆత్మహత్యలకు తెగిస్తున్న రైతులు
రుణమాఫీ కాదని, తీసుకున్న అప్పులు తప్పక చెల్లించాల్సిందేనని బ్యాంకర్ల నోటీసుల ద్వారా రైతులకు స్పష్టమైంది. దీంతో కొందరు రైతులు అప్పు తీర్చేస్తోమత లేక ఆత్మహత్యలకు తెగిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో 17మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే రైతులు ఎంత వేధన పడుతున్నారో ఇట్టే అర్థమవుతోంది. శుక్రవారం ఆత్మహత్యకు పూనుకున్న గోపీనాథ్‌తో ఈ సంఖ్య 18కి చేరింది. మూన్నెళ్లలో 18 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిసినా జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు రైతులకు భరోసా ఇవ్వడం లేదు. రుణమాఫీ అమలయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం లేదు.
రుణమాఫీ చేసి తీరాల్సిందే:
ఓబుళకొండారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి.
రుణమాఫీపై ప్రభుత్వం మాట తప్పడం పెద్ద తప్పిదం. మాఫీ చేయాలని విపక్షాలు చేస్తున్న డిమాండ్‌ను పెడచెవిన పెడుతోంది. రుణమాఫీ చేసి తీరాల్సిందే. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఆదుకోవల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే.